రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పారదర్శక పరిపాలనే మా లక్ష్యం
•సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, జూన్ 8: రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, పారదర్శకత, సాంకేతికత, వేగవంతమైన సేవల సమన్వయంతో సివిల్ సప్లైస్ శాఖ గత రెండు సంవత్సరాల్లో చారిత్రాత్మక సంస్కరణలను అమలు చేసి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, ధాన్యం కొనుగోళ్లలో సంపూర్ణ పారదర్శకత, తక్షణ చెల్లింపులు, మధ్యవర్తుల నిర్మూలన, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు, రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు అనుబంధ శాఖల సమన్వయంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
రైతుకు ప్రథమ ప్రాధాన్యత…
రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు గౌరవం దక్కేలా, ధాన్యం విక్రయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా తీసుకుని, పారదర్శకత, వేగవంతమైన చెల్లింపులు, సాంకేతిక ఆధారిత సేవలతో దేశంలోనే ఆదర్శవంతమైన ధాన్యం కొనుగోలు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 17.97 లక్షల మంది రైతుల నుండి 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో సుమారు రూ.30,361 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు నిర్వహించి, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం జరిగిందన్నారు.
రైతులకు చెల్లింపుల విషయంలో అత్యంత వేగవంతమైన విధానాన్ని అమలు చేస్తూ, 90 శాతం చెల్లింపులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన చెల్లింపులు కూడా 48 గంటలు దాటకుండా పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, చెల్లింపుల్లో జాప్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
సాంకేతిక సంస్కరణలు – దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం…
రైతులకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ఆధారిత ధాన్యం నమోదు మరియు విక్రయ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థ ద్వారా రైతులు ఎటువంటి మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా తమ ధాన్యాన్ని నమోదు చేసి విక్రయించే అవకాశం పొందుతున్నారన్నారు.
ఇప్పటికే 40 వేల మందికి పైగా రైతులు ఈ విధానాన్ని వినియోగించుకుని సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేరుగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు విక్రయించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణ ద్వారా మధ్యవర్తుల జోక్యం గణనీయంగా తగ్గడమే కాకుండా, రైతులకు పారదర్శక వ్యవస్థలో నేరుగా లాభం చేకూరిందని ఆయన పేర్కొన్నారు.
వర్షాలు – తుఫానుల సమయంలో రైతులకు రక్షణ…
వర్షాకాలంలో ధాన్యం తడవకుండా కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా చిన్న, సన్నకారు రైతులకు రూ.50 కోట్లు విలువైన టార్పాలిన్లు ఉచిత పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. తుఫానులకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి రైతు సహాయక కేంద్రాల ద్వారా ఈ సేవలు అందించామని పేర్కొన్నారు.
“దీపం–2” పథకం – కోట్లాది కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్ధి…
“దీపం–2” పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని 1.08 కోట్ల గ్యాస్ కనెక్షన్లను లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కుటుంబాలపై గ్యాస్ వ్యయభారం తగ్గించి, సాధారణ ప్రజలకు ఆర్థిక ఊరటనందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు పలు విడతల్లో భారీ స్థాయిలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 97.36 లక్షల సిలిండర్లకు రూ.764 కోట్ల సబ్సిడీ, రెండో విడతలో 93.83 లక్షల సిలిండర్లకు రూ.777 కోట్లు, మూడో విడతలో 94.81 లక్షల సిలిండర్లకు రూ.791 కోట్లు, నాలుగో విడతలో 92.28 లక్షల సిలిండర్లకు రూ.760 కోట్ల రాయితీ నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఐదో విడత అమలుకు ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు రూ.300 కోట్లు అడ్వాన్సుగా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అత్యంత విస్తృత స్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో “దీపం–2” ఒకటిగా నిలిచి, కోట్లాది కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక లబ్ధి చేకూరుస్తోందని మంత్రి తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డులు – వినూత్న డిజిటల్ సంస్కరణ…
ప్రజలకు మరింత పారదర్శకమైన, సులభమైన మరియు సాంకేతిక ఆధారిత సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న డిజిటల్ సంస్కరణగా QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులు అందజేసినట్లు తెలిపారు.
“One Nation – One Ration Card” విధానంలో భాగంగా రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా లబ్ధిదారులు తమకు కేటాయించిన సరుకులను పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల వివరాలను డిజిటల్ రూపంలో సమగ్రంగా పొందుపరిచిన ఈ కార్డులు ATM కార్డు తరహాలో సులభ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, రేషన్ పంపిణీలో పారదర్శకతను మరింత పెంచాయని తెలిపారు.
సాంకేతికతను ప్రజా సంక్షేమంతో అనుసంధానిస్తూ, దళారుల జోక్యానికి అవకాశం లేకుండా, నిజమైన లబ్ధిదారులకు సేవలు చేరే విధంగా అమలు చేస్తున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డులు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన సంస్కరణగా నిలిచిందని ఆయన తెలిపారు.
వృద్ధులు – దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సేవ…
సామాజిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, దేశంలోనే తొలిసారిగా వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేసే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16.88 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రేషన్ డీలర్లు E-POS పరికరాలతో నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ అనంతరం సరుకులు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులు గణనీయంగా తగ్గడమే కాకుండా, సంక్షేమ సేవలను మరింత గౌరవప్రదంగా, సులభంగా అందించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. సాంకేతికతను మానవీయ దృక్పథంతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
సూపర్ ఫైన్ రైస్ – విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో, శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరుతో సూపర్ ఫైన్ రైస్‌తో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ వినూత్న నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని రైతుల వద్ద నుంచి సుమారు 2.25 లక్షల క్వింటాళ్ల సూపర్ ఫైన్ రైస్ సేకరించి, 25 కిలోల ప్యాకెట్ల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41 వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు 4 వేల సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బియ్యం సంచులపై రైతుల వివరాలను ముద్రించడం ద్వారా రైతుకు గౌరవం కల్పించడంతో పాటు, వ్యవసాయం మరియు విద్యా సంక్షేమాన్ని అనుసంధానించే ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, రైతులకు మెరుగైన మద్దతు అనే ద్వంద లక్ష్యాలతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం దేశంలోనే ఒక వినూత్న సంస్కరణగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.
పారదర్శకతలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ గుర్తింపు…
రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత, నిజమైన లబ్ధిదారుల గుర్తింపు మరియు సాంకేతిక ఆధారిత పరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన EKYC ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ కార్డులలో 99.06 శాతం EKYC విజయవంతంగా పూర్తి చేసి, దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందినట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చేయడమే కాకుండా, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు డిజిటల్ సంస్కరణల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు.
అక్రమాలపై ఉక్కుపాదం – పారదర్శక పంపిణీ వ్యవస్థకు కట్టుదిట్టమైన చర్యలు…
ప్రజలకు అందాల్సిన సంక్షేమ సరుకులు దారి మళ్లకుండా, పంపిణీ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా కొనసాగేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు. అక్రమ రవాణా, నిల్వలు మరియు దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 5,354 కేసులు నమోదు చేయగా, 7,32,675 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి నిజమైన లబ్ధిదారులకే చేరేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు అవినీతి రహిత పంపిణీ వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ బకాయిల చెల్లింపు – రైతులకు ఆర్థిక ఊరటనిచ్చిన ప్రభుత్వం…
గత ప్రభుత్వ కాలంలో రైతులకు చెల్లించాల్సి ఉండి పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారికి రావాల్సిన నిధులు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
ఈ క్రమంలో ఒక విడతలో రూ.1000 కోట్లు, మరో విడతలో రూ.674 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతూ, పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరించడం ద్వారా రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు.
భవిష్యత్ లక్ష్యాలు – పోషకాహారం, సాంకేతిక సేవలకు మరింత ప్రాధాన్యత…
ప్రజలకు మరింత నాణ్యమైన, పోషక విలువలతో కూడిన సరుకులు అందించడంతో పాటు సాంకేతిక ఆధారిత సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మిల్లెట్స్ పంపిణీ చేపట్టడంతో పాటు, పామ్ ఆయిల్ మరియు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా వినియోగదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన మరియు సాంకేతికత ఆధారిత సేవలు అందించేందుకు కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, పోషకాహారం మరియు డిజిటల్ సేవల సమన్వయంతో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సిబ్బందికి ప్రత్యేక అభినందనలు…
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోళ్లు, పారదర్శక పంపిణీ వ్యవస్థ మరియు సాంకేతిక సంస్కరణల విజయవంతమైన అమలుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, సివిల్ సప్లైస్ అధికారులు, రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, రేషన్ డీలర్లు మరియు సాంకేతిక బృందాలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్షేత్ర స్థాయిలో అంకితభావంతో పనిచేస్తూ రైతులు, వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగి ప్రభుత్వ విజయాల్లో భాగస్వామి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వినియోగదారుల రక్షణ మరియు పారదర్శక పరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె.కన్నబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డిల్లీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
===
రెండేళ్ల కూటమి పాలన, పౌరసరఫరాల శాఖ సంస్కరణలపై సచివాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు.. వివరాలు
———————————————————
రైతులకే మా తొలి ప్రాధాన్యం
** రెండేళ్లలో రైతులకు సాగు భరోసా, సొమ్ము భద్రతను కల్పించాం
** పౌరులకు, రైతులకు ఉపయోగపడే సంస్కరణలు తీసుకొచ్చాం
** పథకాలను రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందించాం
** రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు
** రెండేళ్ల కూటమి పాలన, పౌరసరఫరాల శాఖ సంస్కరణలపై మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
కూటమి ప్రభుత్వానికి రైతులే తొలి ప్రాధాన్యం. రైతుల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన రూ.1674 కోట్లను రెండు విడతల్లో చెల్లించాం. ధాన్యం అమ్మిన సొమ్ములు 24 గంటల్లోపే వారి ఖాతాలో జమ అయ్యేలా చొరవ తీసుకున్నాం. సాంకేతికతను రైతు ముంగిట్లోకి తీసుకొచ్చి, ధాన్యం సేకరణ చేయించాం. రూ.50 కోట్లతో వర్షాల కోసం టార్పాలిన్లు కొని రైతులకు అందజేశాం. రైతు ప్రయోజనమే ముఖ్యంగా పాలనలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రెండేళ్ల కూటమి పాలన, పౌర సరఫరాల శాఖ ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు వివరించేందుకు సోమవారం శ్రీ మనోహర్ గారు సచివాలయంలోని 4వ బ్లాక్ లోని మీడియా బ్లాక్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ…
‘‘ రెండేళ్లలో 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 17.97 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ఇది రికార్డు. ఎన్నో ప్రతికూలతలు పకలరించినా, దాన్ని సంకల్పం అనే ఆయుధంతో అధిగమించి అనుకూలతలుగా మార్చుకున్నాం. కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వానికి అమ్మితే, ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి గతంలో రైతులకు ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి, 24 గంటల్లోనే ధాన్యం అమ్మిన డబ్బుల 94 శాతం మంది రైతులకు వారి ఖాతాలో జమ అయ్యే ఏర్పుటు చేశాం. 48 గంటల్లో 100 శాతం జమ అయ్యేలా చూశాం.
• దేశంలోనే ధీటైన సంస్కరణలు
రైతులకు మేలు చేసేలా, పాలనలో సరికొత్త సంస్కరణలను ఈ రెండేళ్లలో తీసుకొచ్చాం. వాట్సప్ సాంకేతికతను 44,081 మంది రైతులు వాట్సప్ ద్వారా ధాన్యం అమ్మే షెడ్యూలు చేసుకున్నారు. దీనిద్వారా 3,51,431 మెట్రిక్ టన్నులను రైసు మిల్లులకు తరలించాం.
దేశంలో ఎన్నడూ లేనట్లుగా ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డును ప్రత్యేక క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలోని 1,49,22,066 కుటుంబాలకు అందించాం. సీఎంఆర్ ధాన్యం సేకరణలో 10.45 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించి, దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం.
• రాజకీయాలకు అతీతంగా నిబద్ధతగా పాలన
రాజకీయాలకు అతీతంగా దీపం-2 పథకాన్ని లబ్దిదారులకు అందించాం. నాలుగు విడతలుగా అమలు చేసిన పథకంలో మొదటి విడతలో 96.29 లక్షల సిలిండర్లు, రూ.764 కోట్ల రాయితీ, రెండో విడతలో 92.80 లక్షల సిలిండర్లు, రూ.777 కోట్ల రాయితీ, మూడో విడతలో 93.81 లక్షల సిలిండర్లు, రూ.791 కోట్ల రాయతీ, నాలుగో విడతలో 92.28 లక్షల సిలిండర్లు, రూ.760 కోట్ల రాయతీని అందించాం. 5వ విడతలోనూ ఇప్పటివరకు రూ.300 కోట్ల రాయితీ సొమ్ములను ఆయిల్ కంపెనీలకు అందించాం. బడి పిల్లలకు శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో 2.25 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ ఫైన్ బియ్యంతో వారికి భోజనం అందించాం. రైతులు కూడా బోనస్ ఆశించకుండా సూపర్ ఫైన్ రైస్ ను పిల్లల కోసం అందించారు.
• రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
భవిష్యత్తులో రేషన్ డిపోల ద్వారా లబ్దిదారులకు అందించే బియ్యం నాణ్యమైనవి అందించాలని భావిస్తున్నాం. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. మా ప్రణాళికను ఇప్పటికే కేంద్రం ముందు పెట్టాం. అక్కడి నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. రేషన్ అక్రమ రవాణాను పూర్తిగా ఆపాలంటే, ప్రజలు రేషన్ బియ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దీంతో పాటు అక్రమ రవాణాను నిరోధించడానికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ లను వినియోగిస్తాం. దీంతో పాటు ప్రత్యేకంగా హోల్ సేల్ దుకాణాలకు దీటుగా మినీ మార్టుల ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ మంచి డిస్కౌంట్ తో బియ్యం, చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్రజలకు లభించే ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో గుజరాత్, పాండిచ్చేరిలో విజయవంతంగా అమలు అవుతున్న సీబీడీసీ విధానాన్ని తీసుకురానున్నాం. దీనివల్ల డిజిటల్ రూపాయి సాయంతో వినియోగదారులు తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ప్రజలకు, రైతులకు పౌర సరఫరాల ద్వారా మేలైన సేవలు అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అన్నారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు గారు, పౌర సరఫరాల సంస్థ ఎండీ శ్రీ ఢిల్లీ రావు గారు పాల్గొన్నారు.

















































