గిరిజన గర్భిణిల కోసం 35 నూతన నిరీక్షణ వసతి భవనాలు
వీటిల్లో ప్రసవానికి వారం ముందే గర్భిణిలకు సపర్యలు
రోజుకి గర్భిణి, సహాయకులకు కలిపి రూ. 600 చెల్లింపు
ఈ కొత్త భవనాలతో గిరిజనులకు తగ్గనున్న వ్యయప్రయాసలు.
నిర్మాణాల పురోగతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన అధికారులు
గిరిజన గర్భిణిల కోసం 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల(ఐటీడీఏలు) పరిధిలో 35 నిరీక్షణ వసతి గృహాల కోసం కొత్త భవనాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్) నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 15, రంపచోడవరం , పార్వతీపురం, చింతూరు, శ్రీశైలం, కోట రామచంద్రాపురంలో 4 చొప్పున భవన నిర్మాణాల పనులు రూ.12.25 కోట్లతో జరుగుతున్నాయని తెలిపారు. ఈ 35లో 22 కేంద్రాలు మే/జూన్ నెలల్లో, మరో రెండు జులై, మిగిలిన వాటిని ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం , చింతూరు, కోట రామచంద్రాపురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో కలిపి 76 నిరీక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవి ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగానే పనిచేస్తున్నాయి. ఇందులో 41 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటికి ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయి.
ప్రతి భవనంలో 8 గదులు
ఒక్కో భవనంలో 8 గదుల్ని నిర్మిస్తున్నారు. వీటిలో 4 గదులు గర్భిణీలకు కేటాయిస్తారు. నాలు గదుల్లో ప్రతి దానికి ఒక మరుగుదొడ్డి నిర్మాణం కూడా జరుగుతోంది. అలాగే ఉమ్మడి వంట గది, రిక్రియేషన్ రూము, ఒక రిసెప్షన్ గది, స్టోర్ రూమును కూడా నిర్మిస్తున్నారు. ఒక్కొ భవన నిర్మాణానికి రూ.35 లక్షల చొప్పున వ్యయం చేస్తున్నారు.. ఈ భవనంలో ఏకకాలంలో నలుగురు గర్భిణులు, వారి సహాయకులు ఉండేందుకు వీలుగా ఈ నిర్మాణాలు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎం) నిధులతో ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 27 పిహెచ్ సిలు, 6 సిహెచ్ సిలు, 2 ఏరియా ఆసుపత్రులకు అనుసంధానంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మొండెంఖళ్లు పీహెచ్ సి, కోట రామచంద్రాపురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయిగూడెం సీహెచ్ సి, చింతూరు ఐటీడీఏ పరిధిలో రత్నపురం ఏరియా ఆసుపత్రుల్లో ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
13వేల మంది గర్భిణిలకు ప్రయోజనం
కొండలు, కోనల్లో నివసించే గర్భిణులను ఆశా వర్కర్ , ఎ.ఎన్.ఎం.లు ప్రసవ తేదీకి కనీసం వారం రోజుల ముందు ఇక్కడికి తీసుకువస్తారు. దీనివల్ల ప్రసవ సమయంలో రవాణాపరంగా, ఆరోగ్యపరంగా గర్భిణులకు సమస్యలు తప్పుతాయి. నిరీక్షణ వసతి గృహంలో గర్భిణికి రోజుకి ఆహారం కోసం రూ. 200, సాయంగా ఉండే మరొకరికి రూ.200 చొప్పున ఇస్తారు. సహాయకులుగా ఉండే వారు సదరు రోజుల్లో ఉపాధి కోల్పోయినందుకు నష్టపరిహారం కింద అదనంగా మరో రూ.200 ఇస్తారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 11వేల మంది గర్భిణులు ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 9,500 మంది వైద్య సేవలు పొందారు. ప్రస్తుత నిర్మాణాలు పూర్తయితే ఏడాదికి 13వేల మంది గర్భిణిలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.















































