3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు •మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు ధరఖాస్తు చేసుకున్నారు
•పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు
•వి.వి.ఐ.పి.లబందోబస్తుకు హాజరయ్యేపోలీసులకు 9న పోస్టల్ బ్యాలెట్కు అవకాశం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, మే 7: పోస్టల్ బ్యాలెట్ కోసం ధరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో తమను కలిసి ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన పలు విషయాలను వివరించారు. కొన్ని జిల్లాల్లో 3 వ తేదీన మరికొన్ని జిల్లాల్లో 4 వ తేదీన హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయిందన్నారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబందించి కొన్ని సమస్యలు తతెత్తిన వెంటనే వాటిని పరిష్కరించండ జరిగిందన్నారు. తాను స్వయంలో ఈ నెల 5 వ తేదీన విజయనగరం జిల్లాల్లో పర్యటించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించడం జరిగిందన్నారు.
ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్కు ధరఖాస్తు చేసుకున్న4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్ ఓటింగ్ కేటగిరీ క్రింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ క్రింద 31 వేల మంది మరియు మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరిలో ఇప్పటి వరకూ 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోను మరియు హోమ్ ఓటింగ్, ఎసన్షియల్ సర్వీసెస్ కేటగిరీ క్రింద 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. అయితే కొంత మంది ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోనందున సంబందిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగిఉన్నాడో ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో స్పాట్ లోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా నేడు, రేపు కూడా అవకాశాన్ని కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. అయితే ఈ విషయంలో నేడు కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోని ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలో ఓటు హక్కును కలిగి ఉన్నాడో ఆ ఆర్వోను నేనుగా కలసి సంబందిత ఫెసిలిటేషన్ సెంటర్లో స్పాట్ లోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును నేడు గాని, రేపు గాని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు……
పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చేవారిపైనే కాకుండా లంచాలు పుచ్చుకునే వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే ఉద్యోగుల విషయంలో గత రెండు రోజుల నుండి పలు విమర్శలు వస్తున్నాయన్నారు. కొంత మంది ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందనే విషయం ప్రచారంలో ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వంటి ప్రలోభాలకు లోబడటం అనేది చెడు సంకేతం అన్నారు. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫ్.ఐ.ఆర్. ను ఫైల్ చేయడం జరిగిందన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, అతనిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేసి, ఎఫ్.ఐ.ఆర్. ను ఫైల్ చేయడం జరిగిందన్నారు. ఒంగోలులో కొంత మంది యుపిఐ విదానం ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపించడం గుర్తించడమైందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సంబందిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణ చేయాలన ఆదేశించడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిందని, కొంత మంది వ్యక్తులను కూడా గుర్తించడం జరిగిందని, కాల్ డేటా, బ్యాంక్ ట్రాంగ్జాషన్ ద్వారా దాదాపు ఎనిమిది నుండి పది మంది ఉద్యోగులను కూడా గుర్తించండ జరిగిందన్నారు.
అదే విధంగా నేడు, రేపు రాష్ట్రంలో పలువురు వి.వి.ఐ.పి.లు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఉద్యోగులు వి.వి.ఐ.పి.ల బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవడంలో సమస్యలు తతెత్తుతున్నాయని పోలీస్ శాఖతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. వి.వి.ఐ.పి.ల బందోబస్తు కార్యక్రమంలో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది నేడు, రేపు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని సంబందిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. అయితే ఎవరన్నా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే, ఈ నెల 9 వ తారీఖున వారు ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశాన్ని కల్పించాలని ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు.