ఉదయనిధి vs బీజేపీ
బీజేపీ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆరాష్ట్ర మంత్రి ఉదయనిధిపై నిప్పులు చెరుగుతోంది. ఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని, ఇండియా కూటమికి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, మైనార్టీల పేరుతో ఓట్లు దండుకోవడానికి చూస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ దీనిపై స్పందిస్తూ ఉదయనిధిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. అతడొక ఆకతాయని, జీవితంలో ఒక్కరోజు కూడా మంచి చేయని వ్యక్తి అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీ ముంబై పోలీసులకు లేఖ రాసింది. ఒక మతానికి వ్యతిరేకంగా ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే అని ఆపార్టీ నాయకుడు రాహుల్ నారాయణ్ కనాల్ ఫైర్ అయ్యారు.
అసలేం జరిగింది ?
తమిళనాడు ప్రోగ్రసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సమావేశంలో శనివారం (సెప్టెంబర్ 2న) సీఏం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దూమారాన్ని రేపుతున్నాయి. సనాతన్ అంటే మార్చడానికి వీలులేనిది , ఎవరూ ప్రశ్నించలేనిది.. మతం, కులం ఆధారంగా ఇది ప్రజలను వేరుచేస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమలతో పోల్చారు. సమానత్వానికి, సామాజిక న్యాయానికి చోటులేకుండా చేయడమే కాకుండా, సనాతన ధర్మం కారణంగా భర్తను కోల్పోయిన మహిళలు సతీసహగమనానికి గురైయ్యారని మండి పడిన విషయం తెలిసిందే. అయితే ద్రవిడంలో అవి లేకుండా రూపుమాపాం. వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం అని ఉదయనిధి అన్నారు.
నావ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : ఉదయనిధి
సనాతన ధర్మంపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని, ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని మరో సారి చెబుతున్నానన్నారు. మారణహోమాలను సహించబోనని, ద్రవిడాన్ని రద్దు చేయాలని కోరుతున్నారని, అంటే డీఎంకే వాళ్లను చంపాలా అని నిలదీశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని మోడీ పిలుపునివ్వడం దేనిని సూచిస్తోందని ? కాంగ్రెస్ వాళ్లను చంపాలా అని ఉదయనిధి మండిపడ్డారు. ద్రవిడ ఇజం మార్పును స్వాగతిస్తుందని, అందరూ సమానంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.
తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడంలో బీజేపీ ముందుంటుందని, 115 మంది ప్రతిపక్షనేతలను ప్రశ్నించేందుకే మోడీ ప్రభుత్వం ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ )ని ఉపయోగించుకుంటోందని ఉదయనిధి ఆరోపించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులపై జూలై నెలలో మనిలాండరింగ్ కు సంబంధించి నోటీసులు జారీ చేసిందన్నారు. రామేశ్వరంలో అన్నామలై పాదయాత్ర ప్రారంభంలో డీఎంకే వారసత్వంపై అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, బీసీసీఐకి జైషా కార్యదర్శి ఎలా అయ్యాడని ? ఎన్ని క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు ? ఎన్ని పరుగులు తీశాడు ? అని ఉదయనిధి గట్టి కౌంటర్ ఇచ్చారు.