*ఒకవైపు వరద నియంత్రణ చర్యలు..
మరోవైపు బాధితులకు నిబద్ధతతో సహాయక చర్యలు*
– ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం.
– కలెక్టరేట్‌ను సెక్రటేరియట్‌గా చేసుకొని సీఎస్ నుంచి సీఎం వరకూ ఇక్కడే ఉన్నాం.
– 32 డివిజన్లకు 32 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాం.
– చివరి మైలు వరకూ ఆహారం అందించేందుకు కృషిచేస్తున్నాం.
– ఆహారం కలుషితం కాకుండా అందించేందుకు డ్రోన్లను రంగంలోకి దించాం.
– ఎక్కడా అశ్రద్ధ అనే దానికి తావులేకుండా సేవలందించాలని అధికారులకు నిర్దేశించాం.
– మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
రెండో రోజూ సోమవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందనే భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో సహాయకచర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్నే కార్యస్థానంగా చేసుకొని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. వారికి మార్గనిర్దేశనం చేస్తూ అలుపెరగకుండా బాధితులకు ఎంతచేయాలో అంతాచేస్తూ మనోధైర్యం కల్పించారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
– ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యలను చేపడుతూనే మరోవైపు ముంపు బాధితులకు ఎక్కడికక్కడ సహాయం అందించే కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. తక్షణం కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం.
– బుడమేరుకు పడిన గండ్లు వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కృష్ణా నదిలోనూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 11,43,000 క్యూసెక్కులు నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 11,90,000 క్యూసెక్కులు. బ్యారేజీ కట్టిన తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. 2009లో వచ్చిన వరదలో 10,90,000 క్యూసెక్కులు వచ్చింది.
– కృష్ణలంకలో మేం 18 అడుగుల మేర రిటైనింగ్ వాల్ కట్టాం. ఆ తర్వాత కట్టిన 14 అడుగులు కట్టారు. ఈ 14 అడుగులను దాటి కృష్ణ లంకలోకి నీళ్లు వచ్చాయి. ఇది ఊహించని పరిణామం.
– భవానీపురంలోకి వచ్చే నీళ్లు తగ్గాయి. కృష్ణలంకలోనూ నియంత్రణలోకి వస్తోంది. సింగ్ నగర్‌లో నిన్నటికంటే అడుగున్నర మేర నీళ్లు తగ్గాయి. నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం.
– సుశిక్షితులైన ఎన్‌డీఆర్ఎఫ్ బలగాల కోసం కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే చాలావరకు వచ్చారు. రేపు ఉదయానికి 30 బృందాలు, 120 బోట్లతో ఆపరేషన్ చేపట్టే పరిస్థితికి వచ్చింది. మనదగ్గరుండే ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోట్లను దాదాపు 40కి పైగా ఆపరేషన్‌కు పెట్టాం.
– చాలావరకు ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నా.. ఇంకా కొన్నిచివరి ప్రాంతాలు మిగిలిపోయాయి. చివరి మైలుకు చేరుకోలేకపోయాం. దృఢ సంకల్పంతో సకల విధాలా ప్రయత్నిస్తున్నా. క్షేత్రస్థాయి సందర్శనలో ఎన్నో దీన గాథలు ఎదురయ్యాయి. ఇవన్నీ చూశాక చాలా బాధేస్తోంది. అందుకే స్పష్టంగా 32 డివిజన్లకు 32 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాం. అదే విధంగా 179 సచివాలయాలకు 179 మంది ఇన్‌ఛార్జ్‌లను నియమించాం. బోట్ ద్వారా వాహనాల ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్నాం.
– మంగళవారం ఆరు హెలికాప్టర్లు పనిచేస్తాయి. వినూత్నంగా ఈ రోజు ఎనిమిది డ్రోన్లు పెట్టి 10 వేల మందికి ఆహార ప్యాకెట్లను అందచేయగలిగాం. ఆహారం కలుషితం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా డ్రోన్ల ద్వారా ప్యాకెట్లను అందిస్తున్నాం. రేపు 30-35 డ్రోన్లను పెడతాం. ఈ ప్రక్రియ విజయవంతమైతే మరిన్ని డ్రోన్లను రంగంలోకి దించుతాం. ప్రతి బోట్‌లోనూ వాహనంలోనూ ఆక్టోపస్, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌ను పెట్టాం. లోడింగ్, అన్‌లోడింగ్‌లో ఇబ్బందులు రాకుండా ఏపీఎస్‌పీ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం.
– ఎక్కడా చిన్న నిర్లక్ష్యం లేకుండా చివరి మైలు వరకూ బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేశాం. నీరు అందిస్తే చాలు అమృతంలా భావించే పరిస్థితులు ఉన్నాయి. అందుకే మనపై గురుతర బాధ్యత ఉందంటూ అధికారులకు చెప్పాను. ఎక్కడా అశ్రద్ధ అనే దానికి తావులేకుండా సేవలందించాలని సూచించాను. బాధితులను గౌరవిస్తూ ఆదుకోవాలని స్పష్టం చెప్పాను. సర్వేలు కూడా నిర్వహిస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాలను తీసుకుంటున్నాం. ఈ సమాచారం ఆధారంగా
అవసరం మేరకు ఆహారాన్ని పంపిస్తున్నాం.
– ఇవన్నీ తొలి దశ కార్యక్రమాలైతే ఇప్పటినుంచే పారిశుద్ధ్యంపై శ్రద్ద పెట్టాల్సిన అవసరముంది. బాధితులందరినీ ఆదుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతాం.
– కలెక్టరేట్‌ను సెక్రటేరియట్‌గా చేసుకొని సీఎస్ నుంచి సీఎం వరకూ ఇక్కడే ఉన్నాం. 1996-97లో హరికేన్ తుపాను సమయంలో రాజమండ్రి ఆర్‌డీవో ఆఫీసును సెక్రటేరియట్‌గా చేసుకొని అందరు సెక్రటరీలను రమ్మని వారంలో పనులు పూర్తిచేసి పరిస్థితిని చక్కదిద్దాకే హైదరాబాద్ వెళ్లాను.
– హుద్ హుద్ సమయంలో విశాఖలోనే ఉండి అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాం. తిత్లీ సమయంలోనూ పండగలను పక్కనపెట్టి అక్కడే ఉండి సాయమందించాం.