ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 20, 2026
అదరహో.. కొండపల్లి బొమ్మల పండగ..
– విజయవంతంగా ముగిసిన మూడు రోజుల ఉత్సవాలు
– కొండపల్లి బొమ్మకు, కొండపల్లి కళాకారులకు కొత్త ఉత్తేజం
– చివరి రోజు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్
– ఆద్యంతం కళాకారులను ప్రోత్సహించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్,
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ. ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న ప్రారంభమైన కొండపల్లి బొమ్మల పండగ వైభవంగా ముగిసింది. చివరి రోజు కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్‌తో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కొండపల్లి కళను విశ్వవ్యాప్తం చేసేలా ప్రోత్సహించారు.
చివరి రోజు మార్కెటింగ్, వ్యాపార అవకాశాలపై చర్చతో పాటు ఆటవిడుపుగా రోప్ పుల్లింగ్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, గోనెసంచి పరుగు వంటి పోటీలు సందర్శకులకు ఆనందాన్ని పంచాయి. బొమ్మల ప్రేరణతో పిల్లల ఫ్యాషన్ షో, పవర్ విమెన్ ఆఫ్ కొండపల్లి, పిండివంటల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహపరిచాయి.
కొండపల్లి బొమ్మల పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
వారసత్వ సంస్కృతి, ఆధునిక జెన్ జెడ్, పండగలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై మార్చి 8న కొండపల్లి బొమ్మల పోటీ నిర్వహించడం జరిగింది.. ఇందులోని విజేతలకు రూ. లక్ష విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
కొండపల్లి బొమ్మ మన ఘన వారసత్వానికి ప్రతీక: కేఎస్ విశ్వనాథన్, డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ*
కొండపల్లి బొమ్మ మన ఘన వారసత్వానికి ప్రతీక అని.. ఈ వారసత్వ సంపదను మనమందరం కలిపి కాపాడుకుందామని.. హస్తకళాకారుల సంక్షేమానికి, మన వారసత్వ కళల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని.. ఈ క్రమంలో కొండపల్లి బొమ్మల పండగను, ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ పండగ వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకు, హస్తకళాకారుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పర్యాటక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న చొరవకు నిలువుటద్దమని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఎంతో కష్టపడి తమ కళాత్మక హృదయంతో కొండపల్లి బొమ్మలను తీర్చిదిద్దుతున్న కళాకారులకు ప్రతిఒక్కరు చేయూతగా నిలిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పర్యాటకం, హస్తకళల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని.. వరల్డ్ క్లాస్ రాజధాని అమరావతి అభివృద్ధి నేపధ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతానికి.. ఈ ప్రాంత కొండపల్లి బొమ్మకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.
కొండపల్లి బొమ్మల పండగకు విశేష స్పందన: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈనెల 18వ తేదీన ప్రారంభమై.. మూడు రోజులపాటు నిర్వహించిన కొండపల్లి బొమ్మల పండగకు విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కళాకారులు పండగకు వచ్చి తమ కళాత్మక కౌశలాన్ని ప్రదర్శించారని.. కొండపల్లి బొమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించాలన్న సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమానికి చేయూతగా నిలిచారని పేర్కొన్నారు. పెద్దఎత్తున కళాభిమానులు, యువత ఉత్సాహంగా పాల్గొని కళాకారులకు విలువైన ప్రోత్సాహం అందించారని తెలిపారు. మన గొప్ప 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మ వారసత్వ సంపద గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా పండగ ఆద్యంతం ఉత్సాహంగా జరిగిందని వివరించారు. కొండపల్లి కార్నివాల్ కు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. కొండపల్లి బొమ్మల పండగ విశేషాలకు సోషల్ మీడియాలో దాదాపు కోటి వరకు వ్యూస్ వచ్చాయని తెలిపారు. మూడు రోజులపాటు జరిగిన వివిధ వినూత్న కార్యక్రమాల సమాహారంతో ఒక ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఈ డాక్యుమెంటేషన్ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని.. కొండపల్లి బొమ్మల వారసత్వ సంపద నిరాటంకంగా వెలుగులు వెదజల్లడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. కళ కలకాలం నిలిచి ఉండడానికి, కళాకారులు అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని వివరించారు. కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయడం జరుగుతుందని.. కొండపల్లి ఊరు గుండా కొండపల్లి కోటపైకి వెళ్లే పాత రహదారి అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. కొండపల్లి బొమ్మల పండగ విజయానికి సహకరించిన, భాగస్వాములైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ కొండపల్లి బొమ్మల పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని కొండపల్లి కళకు పూర్వ వైభవం తెచ్చేందుకు, ప్రపంచ వ్యాప్తంగా కళను చేర్చేందుకు తనదైన ముద్రతో కళాకారులను ఉత్సాహపరిచారు. కొండపల్లి బొమ్మ అలనాటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు ప్రతీక అని.. రాచరికం పోయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ బొమ్మ వైభవం వర్ధిల్లుతోందని, ఈ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో నిర్వహించిన పండగను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ఛైర్మన్ సూర్యప్రకాశ్, సొసైటీ ప్రతినిధులు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, విజయవాడ ఆర్‌టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


















































