జిహాద్ అంటే పవిత్ర యుద్ధమా?
నేటి ఆధునిక ప్రపంచంలో అత్యంత వక్రీకరణకు, అపార్ధాలకు గురైన పదం జిహాద్.చాలామంది జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని భావిస్తుంటారు.ఈ అర్ధాన్ని యూరప్ సామ్రాజ్యవాదం ముస్లింలను హింసావాదులుగా, ఇస్లాంను రక్తపాతం సృష్టించే మతంగా ప్రచారం చేయడం అనే లక్ష్యంతో కొనసాగిస్తుంది.దేశీయంగా ఉన్న మతతత్వ శక్తులు కూడా ఇవే ఉద్దేశంతో గోబెల్స్ ప్రచారం చేస్తుంటాయి.
నిజానికి జిహాద్ అనే పదం ‘జహద్’అనే పదం నుండి వచ్చింది.అరబ్బీ నిఘంటువు ప్రకారం దీని అసలు అర్ధం శ్రమించడం లేదా కృషి చేయడం అని వస్తుంది.దీనిలో అంతర్గత జిహాద్, బహిర్గత జిహాద్ అని రెండు రకాలున్నాయి.ఇందులో అంతర్గత జిహాద్దే ఉన్నత స్థానం.ఇదొక మేధకు సంబంధించిన ఆధ్యాత్మిక, నైతిక,భౌతికపరమైన ఓ ప్రయత్నం.మనిషి తన మనసులోని మాలిన్యానికి,చెడు ఆలోచనలకు వ్యతిరేకంగా తనను తాను సంస్కరించుకోవడానికి చేసే నిరంతర కృషి.మానవుడు తన మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధ పర్చుకుంటూ సత్యాన్ని స్థాపించడమే దీని పరమోద్దేశ్యం.ఇక బహిర్గత జిహాద్ అంటే మనిషి అన్యాయానికీ,పీడనకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించడం .అయితే ఈ పదాన్ని దుర్వినియోగం చేయడంలో ముస్లిం పాలకుల వైపునుండి కూడా తప్పులున్నాయి.పవిత్ర యుద్ధం పేరుతో ఐసిస్ వంటి ఉగ్రవాదాలు సాగిస్తున్నదంతా ఇస్లాంకు వ్యతిరేకమే.అరబ్బు ప్రపంచంలోని ఆయిల్ వనరుల కోసం అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయిలీ జియోనిజం సృష్టించిన వాటి ముద్దుబిడ్డే ఐసిస్.తమ దోపిడీకి ఎదురుతిరిగిన పాలకుల్ని మట్టుబెట్టడం,తామే సృష్టించుకున్న శత్రువుతో యుద్ధం చేసే సాకుతో ఆ ప్రాంతంలో తిష్టవేయడం,వనరులు దోచుకోవడం వంటి కుట్రలన్నాయి.ఇస్లామిక్ జిహాద్ పేరుతో ఐసిస్, ఐయస్ఐ వంటి సంస్థలు సాగిస్తున్న మారణకాండ, బాంబులు పెట్టడం,అమాయకుల్ని చంపడం పవిత్ర ఖుర్ఆన్ బోధనలకే వ్యతిరేకం.
“అన్యాయంగా ఏ వ్యక్తి ఏ వ్యక్తిని హత్య చేసినా అతను సమస్త మానవ జాతిని హత్య చేసినట్లే.ఏ వ్యక్తి ఏ వ్యక్తిని రక్షించినా అతను సమస్త మానవ జాతిని రక్షించినట్లే “—పవిత్ర ఖుర్ఆన్
“ఇతరుల ధనం,ప్రాణాలకు నష్టాన్ని కలిగించేవాడు నిజమైన దైవ విశ్వాసి కాజాలడు” —దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
నిజమైన ముస్లిం పకృతి అంత ఉన్నతంగా జీవించాలి.పకృతి కులమతాల వ్యత్యాసాలు లేకుండా ఎలా సమస్త మానవాళిని సమంగా ఆదరిస్తుందో అలా జీవించాలి.మానవులంతా పరస్పరం సహోదరులేనని పవిత్ర ఖుర్ఆన్ చెప్తోంది.ముందుగా ముస్లిం సమాజంలోని ప్రగతిశీలురు ఇస్లాంను విచ్ఛిన్నకర శక్తులు దుర్వినియోగపర్చకుండా అడ్డుకోవాలి.అంటే ఇస్లాం శాంతిని,ప్రేమను బోధించే సన్మార్గమనే భావనను విప్పి చెప్పాలి.సత్యం చెప్పులు తొడుక్కునేలోపు అసత్యం భూప్రదక్షిణం చేసి వస్తుందనేది నానుడి.మరీ ముఖ్యంగా మన దేశంలో ముస్లింలలో పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువ.చుట్టూ జరిగే కుట్రలు తెలియవు . రెక్కాడితే కానీ డొక్కాడని తమ జీవితాలకు స్వాంతన ఇచ్చేది వారి విశ్వాసమే.అత్యంత బలమైన శక్తులు తమ అధీనంలోని సర్వ వనరులతో విద్వేషాన్ని, ఇస్లామోఫోబియాను వ్యాప్తి చేస్తున్న తరుణమిది.ఇటువంటి సమయంలో తమ సమాజ ప్రగతికి అడ్డుపడుతున్న వాటిని తొలిగించుకుంటూ,తతిమ్మా సమాజాలలో పేరుకుపోయిన అపోహలను దూరం చేయాల్సిన బాధ్యత ముస్లిం సమాజంలోని విద్యావంతులు తీసుకోవాలి.ఏది మంచి ?ఏది చెడు? అనేది వివేకం ఆధారంగా జరగాలి.కవి, తత్వవేత్త ముహమ్మద్ ఇక్బాల్ అన్నట్లు ముస్లిం ప్రపంచంపై ఆవరించియున్న స్తబ్దతకు మూలకారణం ఇజ్తిహాద్(హేతువు )కు ద్వారాలు మూయడమే.జిహాద్ అంటే వ్యక్తిగతంగా,సమాజపరంగా గుణాత్మకమైన మార్పును తీసుకురావడం,సాటి మానవుల్ని ప్రేమించడం,పగ,ప్రకోపాలకు దూరంగా ఉండటమే.విద్య కోసం కృషిసల్పడం,చివరికి మొక్కకు నీరు పోయడం కూడా జిహాదే.జిహాద్ అంటే పవిత్ర యుద్ధం కాదు పవిత్ర జీవనం అని మనం చాటి చెప్పాలి.