పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
ఈసీఐ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి
ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బందికి నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడి
భద్రతా ఏర్పాట్లను వివరించిన పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ
ఎన్‌టీఆర్ జిల్లా, మే 27: ఎన్‌టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఆర్‌వో స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఇప్పటికే చేసిన, చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేసిన మూడంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ డిల్లీరావు వివరించారు. వెయ్యి మందికి పైగా కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 500 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని.. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించే ప్రక్రియలో భాగస్వాములుకానున్న కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తుకు చేసిన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ వివరించారు.
సమష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులకు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు అత్యంత కీలకమైన భద్రతా ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెంట తిరువూరు ఆర్‌వో కె.మాధవి, నందిగామ ఆర్‌వో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, విజయవాడ తూర్పు ఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, విజయవాడ పశ్చిమ ఆర్‌వో ఇ.కిరణ్మయి తదితరులున్నారు.