ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమ బాట పడతాం… ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)ని ఏర్పాటు చేశారు.
జేఏసీ కన్వీనర్లుగా – వై. శ్రీనివాసరావు (ఎన్ఎంయూఏ), పలిశెట్టి దామోదరరావు (ఆర్టీసీ ఇయు)
కో-కన్వీనర్లుగా – పి.వి. రమణారెడ్డి (ఎన్ఎంయూఏ), జి.వి. నరసయ్య (ఆర్టీసీ ఇయు), సిహెచ్.సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం (ఎస్ డబ్ల్యూఎఫ్), ఎస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు (కార్మిక పరిషత్), కె.సూర్యప్రకాశరావు (యునైటెడ్ వర్కర్స్ యూనియన్), డి.మాల్యాద్రి (కార్మిక సంఘ్)లు వ్యవహరిస్తారు.
సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రైవేట్ ఆపరేటర్లకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుని, విద్యుత్తు బస్సులను స్వయంగా ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే విద్యుత్ బస్సులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం, యాజమాన్యం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రైవేట్ ఆపరేటర్లకు విద్యుత్ బస్సులతో పాటు విలువైన డిపో స్థలాలను లీజు పేరుతో అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విధానం ఆర్టీసీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడంతో పాటు, ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోందని, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచి, ఉద్యోగ నియామకాలు చేపట్టి సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణకు దారితీసే విధానాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పడుతున్న అదనపు భారం, తగ్గించేందుకు వెంటనే 4000 బస్సులు ఆర్టీసి ద్వారా కొనుగోలు చేయాలి, ప్రస్తుతం ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకొని 10 వేల మంది సిబ్బంది నియామకాలు చేయాలి. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే IR ప్రకటించడం, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ DAలు, 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పరిష్కారం తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
జేఏసీ కార్యాచరణ
జూన్ 11న జేఏసీ డిమాండ్లతో కూడిన వినతిపత్రం మరియు ఉద్యమ కార్యాచరణను ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్కు మరియు ప్రభుత్వానికి అందజేయడం.
జూన్ 16 నుండి జూన్ 20 వరకు నాలుగు జోన్ల పరిధిలో ఐదు చోట్ల ఉద్యమ సన్నాహక సదస్సులు నిర్వహిస్తాం.
జూన్ 16 – విజయనగరం
జూన్ 17 – విజయవాడ
జూన్ 18 – నెల్లూరు
జూన్ 19 – తిరుపతి (ఉమ్మడి చిత్తూరు & కడప జిల్లాలు)
జూన్ 20 – అనంతపురం (ఉమ్మడి అనంతపురం & కర్నూల్ జిల్లాలు)
జూన్ 23 & 24 తేదీలలో రాష్ట్ర వ్యాప్తముగా అన్ని డిపోలు/యూనిట్స్లో ఎర్ర రిబ్బన్ ధరించి విధులకు హాజరై, గేటు ధర్నాలు.
తదుపరి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జె.ఎ.సి సమావేశం జూన్ 28 వ తేదీన విజయవాడలో నిర్వహించబడును.
ధన్యవాదములతో…
వై.శ్రీనివాసరావు & పలిశెట్టి దామోదరరావు
జేఏసీ కన్వీనర్లు

















































