NDA Alliance: ఈనెల 7న మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు, పవన్
ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో నేడు(బుధవారం) సమావేశం అయిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఇచ్చాయి. అయితే ఈనెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
ఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో నేడు(బుధవారం) సమావేశం అయిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఇచ్చాయి. అయితే ఈనెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మళ్లీ 7వ తేదీన ఢిల్లీకి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
7న బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ భేటీ జరుగనున్నది. ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలు అంతా హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేతలు కోరనున్నారు. ఈనెల 9వ తేదీన ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే (NDA) కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ (Narendra Modi) పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయిం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ అందజేశారు.