భాషల పరస్పరాభివృద్ధి
భాష మనసుకు ప్రతిబింబం. భాష నోటికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది.అది మన మనసును ఆవిష్కరిస్తుంది. అందుకనే శబ్దాన్ని పరబ్రహ్మ స్వరూపమంటారు.అన్ని భాషలు భగవదత్తమనే వాదమూ ఉంది. అది మంచి ఆలోచనకు నాంది. శబ్దార్ధ సమ్మేళనమైన భాష ప్రతి మనిషికి అవసరం.భాష శబ్దంతో నాదంతో కూడినది. ఒక భాష మరొక భాషకు ఏనాడూ ఆటంకం కాదు. పరస్పర అభివృద్ధికి కారణం కూడా.
స్టేషన్ వరకు వెళ్తాం. స్టేషన్ కి చాలా ట్రైన్స్ వస్తాయి. మనకు కావలసిన ట్రైన్ మాత్రమే ఎక్కి ప్రయాణం చేసి మన పని చూసుకుని తిరిగి వస్తాం. మన అవసరం తీరడానికి ఆ ట్రైన్ ఉపయోగపడింది.తక్కిన పనంతా మన సొంతం.మన సొంత పనంతా మాతృభాష, అవసరం తీరడానికి ఉపయోగపడిన ట్రైన్ పరభాష. ఈ సూత్రం ప్రపంచంలో ఏ భాషకైనా వర్తింపవుతుంది.
ఒక భాషను ఆహ్వానించడమంటే మరొక భాషను తిరస్కరించటం కాదు. ఎందుకంటే అన్ని భాషలకు ఆత్మ ఒక్కటే. అదే భావవ్యక్తీకరణ. అదే సార్వజనీనమైంది. ప్రాంతాలకు,దేశాలకు,జాతులకు, భాషలకి అతీతమైందది.భాషలకు అతీతమైన భాష ఒకటుంది.అదే సార్వజనీనమైన భావం.
మాతృ భాషలో వాక్యనిర్మాణం చేసుకోలేని వారు ఇతర భాషల్లోకి తర్జుమా చేయగలిగి మాట్లాడటం కొద్దిగా కష్టమే.తర్జుమా కాకుండా ఇతర భాష సహజంగా రావాలన్నా సాంస్కృతికమైన పునాది అవసరం.ఆ శక్తి మాతృభాష ద్వారానే సాధ్యమవుతుంది. పరభాష అధ్యయనానికి, సంభాషణకు అది దోహదపడుతుంది. అందుకనే మాతృభాష,పరభాష Contradictory కాదు. Controversy కాదు. Complementary మాత్రమే.
మనది కాని భాషని మనం నేర్చుకోవటం ఏమిటని ఆలోచించే రోజులు గతించాయి.ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లి ఉపాధిని పొందాలనుకున్నప్పుడు కొన్ని భాషలు అవసరమవుతాయి. అందుచేత ఇతర భాషలు కార్యకలాపాల నిర్వహణకు వాహకంగా ఉపయోగపడతాయి. నిర్వహణకు నైపుణ్యాలు కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ సాంస్కృతిక విలువలు, సామర్థ్యం, నైపుణ్యాలు మాతృభాష నుండి, సదాచారాల నుండి, తను జీవిస్తున్న సమాజం నుండి లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రాథమిక విద్యను తమ మాతృభాషలో అభ్యసించే విద్యార్థికి అనేక విషయాలు అవగతమవుతాయి. ప్రశ్నించే శక్తి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని మరిన్ని పరాయి భాషలను విద్యార్థి నేర్చుకోగలుగుతాడు.
కాబట్టి మాతృభాష,పరభాష రెండిటి అభివృద్ధి ద్వారానే విద్యార్థి సాఫ్ట్ స్కిల్స్ తో విజేత కాగలడు. ఆ దిశగా ఆరోగ్యకరమైన భాషల సంపర్కంతో జాతులు పురోగమించగలవు.
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!!