ముస్లింలు–బహుభార్యాత్వం
నేడు ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు వ్యాపించి ఉన్నాయి.వాటిలో బహుభార్యాత్వం ఒకటి.ముస్లింలు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు.అది సత్యదూరం.కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో,అనేక నిబంధనలతో మాత్రమే అందుకు అనుమతి లభిస్తుంది.నాటి అరబ్ సమాజంలో ఇస్లాం వ్యాప్తి చెందక మునుపు స్త్రీ కి భద్రత ఉండేది కాదు.పురుషుడు చాలా పెళ్లిళ్ళు చేసుకునే వాడు.వ్యభిచారం సర్వ సాధారణమై ఉండేది.నాటి అరబ్ తెగల మధ్య చిన్న విషయాలకే యుధ్ధాలు జరిగేవి.అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయి వారి భార్యలు వితంతువులుగా,సంతానం అనాధలుగా మారి సమాజం అస్తవ్యస్థంగా ఉండేది.ఈ స్థితిలో దైవ ప్రవక్త ముహమ్మద్(స)అనేక సంస్కరణలు చేశారు.స్త్రీ వస్తువు కాదని,ఆమెకూ హృదయం ఉందని చెప్పారు.స్త్రీలను కొనడం,అమ్మడం,వ్యభిచరించడం మహా పాపమని బోధించారు.నాటి కాలంలో జరిగిన ఉహద్ యుధ్ధంలో పురుషులు ఎక్కువ సంఖ్యలో చనిపోవటం వల్ల స్త్రీ,పురుష జనాభా నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది.ఎటుచూసినా అనాధ పిల్లలు,వితంతువులు కన్పించేవారు.ప్రవక్త హృదయం తల్లడిల్లిపోయింది.ఈ పరిస్థితుల్ని అధిగమించి సంక్షోభాన్ని నివారించేందుకు అనాధలకు న్యాయం చేయలేమనే భయం కలిగితే బహుభార్యాత్వం పాటించవచ్చనే అనుమతి ఇచ్చారే గానీ తప్పనిసరి చేయలేదు.ఆ కాలంలో అపరిమితంగా ఉన్న వివాహాల సంఖ్యను ఇస్లాం నాలుగుకు కుదించింది.పురుషుడు ఆర్థికంగా,శారీరకంగా సమాన స్థాయి న్యాయం పాటించాలని,అలా పాటించటం కష్టం కనుక ఏకపత్నీ వ్రతమే శ్రేయస్కరమని ఇస్లాం బోధించింది.ఇస్లాం కనుక బహుభార్యాత్వాన్ని నిషేధించి వుంటే నాటి సమాజంలోని స్త్రీలు,పిల్లలు అభాగ్యులుగా మిగిలి పోయేవారు.లైంగిక నేరాలు,వ్యభిచారం ప్రబలి సమాజం నైతికంగా పతనమయ్యేది.కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అనుమతించబడ్డ బహుభార్యాత్వాన్ని కొందరు పురుషాహంకారులు దుర్వినియోగం చేయడం వల్లే ముస్లిం సమాజంపై అపోహలు వ్యాపించాయి.నిజానికి ఏ మతం బహుభార్యాత్వం నిషేధించలేదని మనం గ్రహించాలి.హిందువులు ఆరాధించే పురాణ పురుషులు,బైబిల్ లోని ప్రవక్తలు బహుభార్యాత్వం పాటించినట్లు స్పష్టమౌతుంది.
ముఖ్యంగా భారతీయ ముస్లిం సమాజంలో 95%మంది పాటించడం లేదని మనం గ్రహించాలి.ప్రభుత్వ లెక్కల ప్రకారం గిరిజనుల్లో 15.25%,బౌధ్ధుల్లో 7.97%,జైనుల్లో 6.72%,హిందువుల్లో 5.8%బహుభార్యాత్వం పాటిస్తే ముస్లింలలో కేవలం 5.7%మాత్రమే ఉంది.దీనిని బట్టి మన దేశంలో అన్ని సామాజిక వర్గాల కన్నా ముస్లింలే తక్కువ బహుభార్యాత్వాన్ని కలిగి ఉన్నారు.కానీ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా వుంది.
ఆర్థికంగా చితికిపోయి దైన్యంగా బతుకుతున్న ముస్లింలకు ఒక కుటుంబాన్ని పోషించే స్థోమతే లేదు.ఇక బహుభార్యాత్వానికి అవకాశమే లేదు.ఆధునికులమని చెప్పుకునే వారు నేటికీ వితంతు వివాహాలకు దూరంగా ఉన్నారువిధి వంచితులైన వితంతువుల పట్ల సరియైన ఆదరణ ఉండదు.కానీ 1500 సం. క్రితమే దైవ ప్రవక్త ముహమ్మద్(స) వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు.పైగా వితంతు వివాహం పుణ్య ప్రదమైనదని బోధించారు.ఈ కారణం వల్లే ముస్లిం సమాజంలో వితంతు వివాహం సలభతరమైంది.ఎన్నో మానవీయ విలువలు ఆచరణలో చూపే ముస్లిం సమాజం పై కమ్ముకున్న అపార్థాల కారు మబ్బుల్ని తొలిగించాల్సిన బాధ్యత ముస్లిం ఆలోచనాపరులపై ఉంది.