- ఏపిఎస్ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు
•విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు
అమరావతి, జూలై 9: ఏపిఎస్ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేసే ప్రస్తక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపిఎస్ఆర్టీసి ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, సంస్థ ఆస్తులు, డిపోలు, భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయబోవడం లేదన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు కొనసాగిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై కొన్ని వర్గాలు, ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, మీడియాలో వస్తున్న పలు కథనాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించడం, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం, ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంలో ప్రైవేటీకరణకు తావు లేదు…
రాష్ట్ర ప్రభుత్వం ఏపిఎస్ఆర్టీసీని ప్రైవేటీకరిస్తోందని, డిపోలు లేదా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఏపిఎస్ఆర్టీసీకి చెందిన అన్ని భూములు, డిపోలు, భవనాలు, ఇతర స్థిరాస్తులు యథావిధిగా ఏపిఎస్ఆర్టీసీ యాజమాన్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. విద్యుత్ బస్సులను సరఫరా చేసే సంస్థలకు కేవలం ఒప్పంద కాలంలో సేవల నిర్వహణకు అవసరమైన మేరకు మాత్రమే సంస్థ ప్రాంగణాలను వినియోగించుకునే అనుమతి ఇస్తున్నామని, ఎలాంటి లీజు, యాజమాన్య బదిలీ లేదా ఆస్తుల బదిలీ జరగదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కూడా 26 శాతం డీజిల్ బస్సులు హైర్ పద్ధతిలోనే…
ప్రస్తుతం ఏపిఎస్ఆర్టీసీలో సుమారు 26 శాతం డీజిల్ బస్సులు హైర్ విధానంలో నడుస్తుండగా, మిగిలిన 74 శాతం బస్సులు సంస్థకు చెందినవేనని తెలిపారు. ఇదే విధానంలో విద్యుత్ బస్సులను కూడా హైర్ ప్రాతిపదికన నడపడం జరుగుతుందని వివరించారు.
దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం…
విద్యుత్ బస్సుల ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా రూపొందించిన పథకం కాదని, ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM e-Bus Sewa Schemeలో భాగమని తెలిపారు. దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు సేవలు అందించేందుకు మొత్తం 10,000 విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ పథకంలో భాగంగా 22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే విధమైన విధానంలో బస్సులు కేటాయించబడుతున్నాయని చెప్పారు.
CESL ద్వారా దేశవ్యాప్త టెండర్లు…
విద్యుత్ బస్సుల కొనుగోలు, సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CESL (Convergence Energy Services Limited) దేశవ్యాప్తంగా పోటీ టెండర్లు నిర్వహించిందన్నారు. ఈ టెండర్లు Gross Cost Contract (GCC) విధానంలో జరిగాయని, ఇందులో బస్సులను సరఫరా చేసే సంస్థే బస్సులను సమకూర్చుతుందని, నిర్వహణ బాధ్యతతో పాటు డ్రైవర్లను కూడా సంస్థే సమకూర్చుకుంటున్నారు. అయితే బస్సులు నడిచిన కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏకరీతి విధానమని ఆయన వివరించారు. ఈ GCC విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోమీటరుకు రూ.24 సబ్సిడీ అందజేస్తోందన్నారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు…
CESL నిర్వహించిన జాతీయ స్థాయి పోటీ టెండర్లలో విజేతగా నిలిచిన పినాకిల్ సంస్థ ద్వారా రాష్ట్రంలో 750 విద్యుత్ బస్సులను 11 పట్టణాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకై అవసరమైన చోట కొత్త డిపోలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సింహాపురి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న చోట కొత్త డిపోలు, ఛార్జింగ్ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా విజయవాడ (విద్యాధరపురం), గుంటూరు, నెల్లూరు మరియు తిరుపతి ప్రాంతాల్లో స్థలాభావం కారణంగా కొన్ని షెడ్యూళ్లను సమీప డిపోలకు మార్చాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం గమనించిందని, ప్రభుత్వ భూములు లేదా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఏ ఒక్క ఉద్యోగికీ నష్టం జరగదు…
విద్యుత్ బస్సుల ప్రవేశంతో ఉద్యోగులను తొలగించడం, అదనపు సిబ్బందిగా ప్రకటించడం లేదా నిరుద్యోగులుగా మార్చడం వంటి చర్యలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యల్ప ఇబ్బందులతో ఈ మార్పును అమలు చేస్తామని తెలిపారు.
Sustainable Electric Mobility Policy–4.0 అమలు…
రాష్ట్ర ప్రభుత్వం Sustainable Electric Mobility Policy (SEMP)–4.0 ప్రకారం 2024–2029 మధ్యకాలంలో ఏపిఎస్ఆర్టీసీలోని డీజిల్ బస్సులను దశలవారీగా విద్యుత్ బస్సులుగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ నమూనాలను కూడా పరిశీలిస్తోంది…
కేంద్ర ప్రభుత్వం GCC విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పలు ప్రత్యామ్నాయ విధానాలను కూడా అధ్యయనం చేస్తోందన్నారు. వాటిలో Dry Lease Model, RTC డ్రైవర్ల వినియోగం, సాధారణ మెకానికల్ నిర్వహణను APSRTC సిబ్బందితో నిర్వహించడం, విద్యుత్ వ్యవస్థ, బ్యాటరీలు వంటి కీలక భాగాల నిర్వహణను తయారీ సంస్థకే అప్పగించడం వంటి నమూనాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయి…
ఉద్యోగ సంఘాలు, JAC ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపామని, వారి సూచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా, సంస్థ ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ముఖ్యమంత్రి ఆమోదంతో తుది విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.
అన్ని బస్సుల్లో ఏసీ సేవలే లక్ష్యం…
ప్రస్తుతం APSRTC బస్సుల సగటు వయస్సు 7 సంవత్సరాలకు పైగా ఉందన్నారు. ప్రజలకు అత్యాధునిక సేవలు అందించేందుకు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు సేవలు సహా అన్ని విభాగాల్లో దశలవారీగా పూర్తిస్థాయి ఎయిర్ కండీషన్డ్ విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని తెలిపారు.
శ్రీశక్తి, దివ్యాంగశక్తి పథకాల రీయింబర్స్మెంట్‌పై వివరణ…
ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన శ్రీశక్తి, దివ్యాంగశక్తి పథకాల కింద 100 శాతం రీయింబర్సుమెంట్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.350 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ.4,200 కోట్లు APSRTC ఉద్యోగుల వేతనాల కోసం వ్యయం చేస్తోందని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రీయింబర్సుమెంట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం మరింత సహకారం అందిస్తుందని చెప్పారు.
నాణ్యత సమస్య తలెత్తకుండా GCC విధానం అమలు…
విద్యుత్ బస్సుల సాంకేతికత ఇప్పటికీ అభివృద్ధి దశలోనే ఉందని, గత 5–6 సంవత్సరాలుగా మాత్రమే ఈ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం నేరుగా L1 పద్ధతిలో కొనుగోలు చేస్తే నాణ్యతపై సమస్యలు తలెత్తే అవకాశముందని, అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా GCC విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలు, నాణ్యత, దీర్ఘకాల నిర్వహణ, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ విధానాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం కొనసాగిస్తోందని తెలిపారు.
దశలవారీ వ్యయ నిర్వహణ…
ప్రతి సంవత్సరం సుమారు 2,000 బస్సులను ఒకేసారి కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000 కోట్ల భారీ పెట్టుబడి అవసరమవుతుందని తెలిపారు. అందువల్ల కిలోమీటరు ప్రాతిపదికన చెల్లింపులు చేసే విధానంలో ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా, ఉద్యోగుల సేవలను గరిష్ఠంగా వినియోగించుకునే విధానాన్ని రూపొందిస్తున్నామని వివరించారు.
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ…
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ PM e-Bus Sewa పథకం కింద GCC (Gross Cost Contract) విధానంలోనే విద్యుత్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. అస్సాం, కేరళలో మాత్రమే పరిమిత సంఖ్యలో ప్రభుత్వ కొనుగోలు బస్సులు ఉన్నాయన్నారు. కేంద్ర-రాష్ట్ర నిధులతో డిపోలను ఆధునికీకరించి, బస్సుల నిర్వహణ కోసం మాత్రమే ప్రాంగణ వినియోగానికి అనుమతి ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల్లో ఉన్న ప్రధాన ఆందోళన ఉద్యోగ భద్రతపై అపోహలేనని, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అదే విధంగా భవిష్యత్తులో కూడా APSRTCనే బస్సులను నిర్వహిస్తుందని, రూట్ల ప్రైవేటీకరణ ఉండదన్నారు. కండక్టర్లు APSRTC ఉద్యోగులే ఉంటారన్నారు. డ్రైవర్ల ఖాళీలు భర్తీ అయ్యే వరకు మాత్రమే Wet Lease విధానం అమలులో ఉంటుందన్నారు. అనంతరం APSRTC డ్రైవర్లతోనే Dry Lease విధానాన్ని అమలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ వంటి కీలక సాంకేతిక నిర్వహణను మాత్రమే తయారీ సంస్థ నిర్వహిస్తుందని, సాధారణ నిర్వహణను APSRTC ఉద్యోగులే చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 15 సంవత్సరాల సేవ పూర్తిచేసిన పాత బస్సుల స్థానంలో కొత్త ఈ-బస్సులను తీసుకొస్తామన్నారు. తొలి విడతలో 750 విద్యుత్ బస్సులు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో అందుబాటులోకి రానున్నాయని, అదనంగా తిరుమల కోసం 300 విద్యుత్ బస్సుల టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ బస్సుల నిర్వహణకు సంబంధించి డ్రైవింగ్, మెయింటెనెన్సులో APSRTC ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఒప్పందంలో తప్పనిసరి నిబంధనగా చేర్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న శ్రీశక్తి, దివ్యాంగశక్తి వంటి సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. Non-AC బస్సుల స్థానంలో AC విద్యుత్ బస్సులు వచ్చినా ప్రయాణికులకు అందుతున్న సంక్షేమ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఏపిఎస్ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రంహ్మనంద రెడ్డి పాల్గొన్నారు.
















































