రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్(GIIS) స్కూల్..పూర్తైన ఒప్పందం
ప్రజారాజధాని అమరావతిలో మరో ప్రముఖ విద్యాసంస్థ ఏర్పాటు కానుంది. ప్రపంచ స్థాయి విద్యా సదుపాయాలతో పేరొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్(GIIS) తమ విద్యాసంస్థను అమరావతిలో స్థాపించేందుకు ఏపీ సిఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం 2026 జూన్ 10న ఏపీ సిఆర్డీఏ & విద్యాసంస్థను నిర్వహిస్తున్న GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగింది. ఏపీ సిఆర్డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ రాయ్, GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున కంట్రీ డైరెక్టర్ రాజీవ్ కౌల్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామంలో 4 ఎకరాల భూమిని కేటాయించారు. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఆధునిక విద్యా ప్రమాణాలతో కూడిన పాఠశాల క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు విద్యాసంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విద్యాసంస్థ ఏర్పాటు ద్వారా అమరావతి, పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.
ఈ సంస్థ స్థాపనతో ప్రజారాజధాని అమరావతిలో విద్యా మౌలిక వసతులు మరింత బలోపేతం చెందడంతో పాటు స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


















































