అమరావతి
419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-110 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, ఫార్మసిస్టుల పోస్టులకు కూడా..
జాతీయ ఆరోగ్య మిషన్ కింద స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ల కేటగిరిల్లో కలిపి 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూటుమెంటు బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 419 స్టాఫ్ నర్సులు, 24 ఫార్మసిస్టు పోస్టులు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల నోటిఫికేషన్ అనుసరించి అర్హత కలిగిన వారు ఈ నెల 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని బోర్డు తెలిపింది. జూన్ 30 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. 419 స్టాఫ్ నర్సుల పోస్టులు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్సీడీ క్లినిక్ లు, న్యూట్రిషన్ రికవరీ సెంటర్లు, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, ఇతర విభాగాల్లో ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. స్టాఫ్ నర్సులకు నెలసరి వేతనం:27,675. డి-ఫార్మసీ/బి-ఫార్మసీ/ ఇంటర్ వొకేషన్ కోర్సును ఫార్మసీలో పూర్తిచేసిన వారు ఫార్మసిస్ట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీరికి నెలసరి వేతనం:23,393. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల కోసం దరఖాస్తుచేసే వారు ఇంటర్ తోపాటు ఒకటిన్నర సంవత్సరం వ్యవధి కలిగిన మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. నెలసరి వేతనం:23,494. ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ( హెచ్‌టిటిపిఎస్:// ఎపిఎంఎస్ఆర్‌బి.ఎపి.జిఓవి.ఇన్ /ఎంఎస్ఆర్‌బి/) లో పూర్తి సమాచారం ఉంది. ఈ పోస్టులన్నింటికీ కలిపి 15వేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వీటి పరిశీలన నుంచి ఎంపిక జాబితా ఖరారు ఎపి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జరుగుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి ఈ ప్రక్రియ జరుగుతుంది. స్టాఫ్ నర్సుల పోస్టులను జోన్‌ల వారీగా, ఇతర పోస్టులను జిల్లాల స్థాయిల్లో భర్తీ చేస్తారు.
267 కొత్త మెడికల్ ఆఫీసర్లకు శుక్రవారం పోస్టింగ్ ఉత్తర్వులు: మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
జీరో వేకన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీలలో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను శుక్రవారం పంపబోతున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు అనుసరించి పోస్టింగు ఉత్తర్వులు ఆటోమేటిగ్గా అభ్యర్థులకు మెయిళ్ల ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్‌సి, ఏరియా, జిల్లా ఆసుపత్రులోని ఎన్సీడీ క్లినిక్కులు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారు


















































