అమరావతి //14.3.2026
-సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026 సిద్ధం!
-‘అవేర్ ద్వారా 4-5 రోజుల ముందుగానే సదరు ప్రాంతాల్లో వేసవి తీవ్రతపై అప్రమత్తం
-జిల్లా అధికారులు, వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు
-కేసుల నమోదుకు అనుగుణంగా సత్వర చర్యలు
-1 71 కోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం!
-చికిత్స అందించేందుకు ఉప ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీల స్థాయి నుంచి సన్నద్ధత
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
వేసవి తీవ్రత అంచనాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఆధారంగా రూపొందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026’పై ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ చర్చించారు. వేసవి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తo చేయడం, వడ దెబ్బకు గురైతే సదరు లక్షణాలను వెన్వెంటనే గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదించేలా అవగాహన కల్పించడం, ఇలాంటి కేసుల్లో చికిత్స ఎలా అందించాలన్న దానిపై వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వస్తున్న సలహాలు, సూచనలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, రాష్ట్రంలోని పరిస్థితులపై వంటి అంశాల గురించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ నేడొక ప్రకటన జారీచేశారు.
‘అవేర్’ ద్వారా 4-5 రోజుల ముందుగానే హెచ్చరికలు
ఆవేర్ ప్లాటుఫామ్ ద్వారా రానున్న 4 నుంచి 5 రోజుల్లో వేసవి తీవ్రత ఎలా ఉంటుందన్న సమాచారం తెలుసుకునేవిధంగా ఏర్పాట్లు జరిగాయి. వాతావరణం కేంద్రాల ద్వారా అందే సమాచారం ఆధారంగా
ఏ ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉoదో గుర్తిస్తారు. ఈ సమాచారo
జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీనికి అనుగుణంగా వీరు చర్యలు తీసుకుంటారు.
అప్రమత్త చేసేలా..
27 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదు జరిగితే…దానిని ‘హెచ్చరిక (కాషన్)గా గుర్తిస్తున్నారు. 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదైతే దానిని ‘అపాయం-డేంజర్లో ‘ ఉన్నట్లు, 42 నుంచి 54 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదైతే దానిని ‘మరింత అపాయం’ (వెరీ డేంజర్)గా అవేర్ డిజిటల్ ప్లాటుఫాంలో గుర్తిస్తారు.
గతoలో ( హిస్టారికల్ డేటా ఆధారంగా) ఉష్ణోగ్రతల నమోదు ఆధారంగా కూడా జాగ్రత్తలు తీసుకునేందుకు ‘అవేర్’ డిజిటల్ ప్లాటుఫారమ్ను కూడా ఉపయోగిస్తున్నారు. సీజనల్ వ్యాధులను రియల్ టైమ్లో పర్యవేక్షించి, వ్యాధులు వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకునేందుకు ఆర్టీజీఎస్లోని ‘అవేర్ (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైయిజరీ ఫర్ రిసిలియెంటు ఎకోసిస్టమ్) సేవలను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ వినియోగించుకుంటోంది. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో, మండలాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉందో మ్యాపింగ్ ద్వారా తెలుసుకునేలా ఏర్పాటుచేశారు ఐహెచ్ఐపీ పోర్టల్ ద్వారా రోజూవారీ డేటా సేకరణ నిర్వహిస్తూ రియలుటైం మానిటరింగ్ చేస్తున్నారు.
శిక్షణ కార్యక్రమాలతో సన్నద్ధం!
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సర్వైలెన్స్ ఆఫీసర్స్, ఎపిడిమియాలజిస్టులు, ఎన్.సి.డి. ప్రోగ్రాం ఆఫీసర్లకు సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026 గురించి వర్చువల్ విధానంలో వివరించారు. వీరి ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి తిరిగి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు జాతీయ స్థాయిలో భాగంగా జిల్లాల్లో ఉండే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వర్చువల్ గా శిక్షణ ఇచ్చారు హీటు స్ట్రోక్ (వడ దెబ్బ) కేసులు ఎలా గుర్తించాలి? పోర్టలు (ఎన్పీసీసీహెచ్ఎచ్-ఐహెచ్ఐపీ)లో ఎలా నమోదు చేయాలి, ఇతర అంశాల గురించి వివరించారు దీనికి అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా జిల్లా అధికారులకు వివరించారు.
ముందస్తు జాగ్రత్తలు!
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు గురైన వారికి ప్రాధమిక చికిత్స అందించేలా ఏర్పాట్లు జరిగాయి. కేసు తీవ్రత అనుసరించి ఉన్నత చికిత్స నిమిత్తం ఉన్నతస్థాయి ఆసుపత్రులకు 108 అంబులెన్సుల ద్వారా తరలించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) ప్యాకెట్లు 1,71,66,381) అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంచేశారు. పీహెచ్సీల్లో 50,74,423, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 16,77,787 చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ తెలిపారు అవసరాలకు తగ్గట్లు ఐవీ ఫ్లూయిడ్స్ కూడా సిద్ధంచేసినట్లు చెప్పారు.
సహచర శాఖలతో సమన్వయం!
గర్భిణులు, వృద్ధులు, శిశువులు, నిర్మాణ రంగం కూలీలు, గ్రానైటు, నరేగా వర్కర్స్, ట్రాఫిక్ పోలీసులు, వేసవి తీవ్రతకు ప్రభావితమయ్యే ఇతర రంగాల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, కార్పొరేషన్, డిజాస్టర్ మేనేజ్మెంటు, పోలీసు, ఫైర్ అండ్ సేఫ్టీ, విద్యుత్తు, గ్రామీణ నీటిపారుదల, విద్యా శాఖ, కార్మిక, ఇతర శాఖల వారితో సమన్వయంతో వ్యవహరించి, వేసవితీవ్రతకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన తేవాలని మంత్రి స్పష్టంచేశారు. వేసవి తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో జూన్ వరకు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
కేసుల నమోదు వివరాలు!
రాష్ట్రంలో 2023లో 833, 2024లో 4,444, 2025లో 5,154 చొప్పున కేసుల నమోదు జరిగింది రిపోర్టింగ్ పెరిగేకొద్దీ కేసులు పెరుగుతున్నాయి. 2025లో అత్యధికంగా ఏలూరు జిల్లాలో 1,284, కృష్ణా-1,214, విశాఖ-1,089, కడప-325, పల్నాడు జిల్లాలో 268 చొప్పున వడదెబ్బ కేసుల నమోదయ్యాయి. వేసవి తీవ్రత రాయలసీమ, సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. 2025లో కోనసీమలో అత్యధికంగా 47.7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
















































