చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా – YS షర్మిల
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
షర్మిల వాడిన భాష, యాస సరికాదు
వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్సే
ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది: సజ్జల
తాడేపల్లి: చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు . ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘షర్మిల వాడిన భాష, యాస సరికాదు. వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారు. వైయస్ఆర్ వారసుడిగా సీఎం వైయస్ జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైయస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది. సీఎం వైయస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు. వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్సే.
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?. షర్మిల.. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు. ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. చంద్రబాబుతో కుమ్మకై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే.
చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైయస్ జగన్ రాజీ పడరు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. చివరగా వైయస్ఆర్ తనయురాలిగా, వైయస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.