మహిళా రిజర్వేషన్ బిల్లు వెనక్కా…ముందుకా ?
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల ముందు మాత్రమే గుర్తుకు వస్తుంది. అప్పుడు మాత్రమే హడావుడి జరుపుతారు. అందుకు తెలుగు రాష్ట్రాలు మినహాయింపుకాదు. 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళా మంత్రిని కేటాయించని టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ ఎస్ మహిళా బిల్లుల కోసం కేసీఆర్ కుమార్తె కవిత మార్చి 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడంలోనే రాజకీయ పార్టీల నైతికతను ప్రశ్నార్థకంగా చేస్తోంది. 1996 లో ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్ ఇప్పటివరకు చట్టంగా మారలేదంటే భారతీయ రాజకీయాలు ఎంత నిబద్దతతో పనిచేస్తున్నాయో తెలుస్తోంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కేవలం నాలుగు పార్టీలకు మాత్రమే మహిళలు నాయకత్వం వహించారు. అవి ఇండియన్ కాంగ్రెస్ కు ఇందిరాగాంధీ, తర్వాతికాలంలో ఎక్కువ ఏళ్లు పార్టీ అధినేతగా ఉన్న సోనియాగాంధీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ కు మమతా బెనర్జీ, ఏఐఏడీఎంకే పార్టీ అధినేత్రి దివంగత జయలలిత ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 70 శాతం అసెంబ్లీ స్థానాలకు మహిళా అభ్యర్తులు లేరు. 2013 గణాంకాల ప్రకారం పార్లమెంటులో 11శాతం మంది, రాజ్యసభలో 10.6 శాతం మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టాలని తృణమూల్ కాంగ్రెస్, జనతా దళ్ (యు), శిరోమణి అకాళిదల్ లు లోక్ సభలో ప్రవేశపెట్టాలని గతేడాది లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కోరాయి.
జనాభా ప్రాతిపధికగా లోక్ సభ, అసెంబ్లీలలో మూడొంతుల మంది మహిళలు ఉండాలని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ప్రధాని దేవగౌడ ఈ బిల్లును మొదటిసారిSeptember 12, 1996లో లోక్ సభలోప్రవేశపెట్టారు. ఆపై 1999, 2008లో ప్రవేశపెట్టారు.
రాజ్యాధికారంలో మహిళలను కూడా భాగస్వామ్యులను చేయాలనే ఉధ్దేశ్యంతో లోక్ సభలో 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సంకల్పించారు. అయితే ఇది బ్రమణ పద్దతి (రొటేషనల్) లో ఉంటుంది. అంటే మూడు సార్వత్రిక ఎన్నికలకు ఒక్కసారి మహిళా రిజర్వేషన్ ఉంటుంది. దీనిపై బీజేపీ ప్రధమ ప్రధాని వాజ్ పేయి ఎంతో కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రోజురోజుకు రాజకీయాలు బలంగా తయారవడంతో రాటుదేలిన మహిళలు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఎగువ, దిగువ సభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం మహిళలకు 33శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ బిల్లు పెండింగ్ లోనే ఉండిపోవడం విచారకరం. దీనిని మళ్లీ లోక్ సభలో ప్రవేశపెట్టాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
యూపీఏ 1 ప్రభుత్వం దశాబ్ద కాలం తర్వాత మహిళా రిజర్వేజషన్ బిల్లును 2008 మేలో ప్రవేశ పెట్టింది. ఇదే బిల్లును మళ్లీ 2010 యూపీఏ ప్రవేశపెట్టడంతో మార్చి 9న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 లో 15వ లోక్ సభ చివరినాటికి ఈ బిల్లుకు కాలం చెల్లింది.
అయితే ఈ బిల్లుపై ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలు వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు క్వశ్చన్ అవర్ లో గందరగోళం సృష్టిస్తూ, నిరసనను తెలియచేశారు. మహిళా కోటాలో బీసీలకు కూడా కోటా కల్పించాలని, బాబ్డ్ హెయిర్, స్లీవ్ లెస్ జాకెట్ల వారు మాత్రమే ఈ రిజర్వేషన్ ను వినియోగించుకునే అవకాశం ఉందని ఆర్జేడీ చీఫ్ లల్లూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎల్ జేపీ అధ్యక్షుడు చిరాంగ్ పాశ్వాన్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లులను సమర్థిస్తూ, ర్యాలీల్లో , బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. వాస్తవానికి ఈ బిల్లును 1993లో 108వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్లను రూపొందించారు. తద్వారా గ్రామ పంచాయతీ సర్పంచ్ సీట్లనుంచిలోక్ సభ, రాజ్య సభ సీట్ల వరకు మహిళలకు రిజర్వ్ చేస్తారు. దీనిని వ్యతిరేకించే వారిని మహిళాభ్యుదయానికి వ్యతిరేకులుగా భావించవచ్చు.
ప్రస్తుతం ఈ బిల్లు లోక్ సభలో పాస్ అవడానికి అధికార పార్టీ మద్దతు తప్పనిసరి.
ఇప్పటివరకు దేశంలో కేవలం రెండు పార్టీలు మాత్రమే మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నాయి. అందులో ఒకటి బిజు జనతా దళ్ (బీజేడీ)ఒడిశా, కాగ రెండవది పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ). ఈ రెండు పార్టీల్లోనూ మూడొంతుల సీట్లు ఎగువ, దిగువ సభల్లో ఉండే విధంగా మహిళా ప్రతినిధులను పంపుతున్నాయి.
బీజేడీ పార్లమెంటులో 33 శాతం మహిళా అభ్యుర్థులను పంపుతుండగా, టీఎంసీ 41శాతం మందిని పార్లమెంటు ఉభయ సభలకు పంపుతోంది. రానున్న ఎన్నికల్లో తాము కూడా 41 శాతం మందిని పార్లమెంటుకు పంపుతామని బీజేడీ స్పష్టం చేసింది.
అధికారంలోని బీజేపీ మాత్రం 184 మంది అభ్యర్థుల్లో కేవలం 23 మంది మహిళలనే పార్లమెంటుకు పంపగలిగింది. కాంగ్రెస్ తనకున్న 143 మంది పార్లమెంటు సభ్యుల్లో 17 మందిని పంపింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేయడం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ అని మమతా అన్నారు.
అసెంబ్లీ, పార్లమెంటులో మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మహిళా మంత్రులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, మొత్తం 545 పార్లమెంటు సభ్యుల్లో కేవలం 12 శాతం అంటే 64 మంది మాత్రమే ఉన్నారన్నారు. పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ ఎంపీలు 42 మంది ఉండగా, వారిలో 13 మంది మహిళలే. ఒడిశాలోని బీజేడీలో ముగ్గురు మహిళా ఎంపీలు ఉన్నారు.
1996లో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో వెనుకబడిన తరగతుల మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించారు. ప్రస్తుత 17వ లోక్ సభలో 15 శాతం మాత్రమే మహిళా ఎంపీలు లోక్ సభలో, 12.2 శాతం రాజ్య సభలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ స్థానల్లో మహిళల సంఖ్య కేవలం 8 శాతం మాత్రమే. ఈ ఎన్నికల వేళయినా బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ఆమోదించి మహిళా సాధికారతకు పట్టం కట్టగలదని యావత్ దేశం ఎదురు చూస్తోంది.