వార్ వన్ సైడ్
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి దుమ్ము రేపింది.
కూటమి హవా
64.08 శాతం ఓట్లు సాధన
వైసీపీకి కేవలం 29.81 శాతం
కాంగ్రెస్‌కు దక్కింది 1.47 శాతం
వామపక్షాలకు 0.35 శాతం
ఇతరులకు 4.29 శాతం
జిల్లాలో పోలైన ఓట్లు 14,24,836
కూటమి అభ్యర్థులకు లభించిన ఓట్లు 9,13,065
వైసీపీకి 4,24,747
Amaravati
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి దుమ్ము రేపింది. ఊహించని మెజారిటీలతో అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొన్ని నియోజక వర్గాల్లో విజేతలకు లభించిన మెజారిటీ కంటే కూడా వైసీపీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. గట్టి పోటీ ఇస్తారనుకున్న అభ్యర్థులు బాగా వెనుకబడిపోయారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ వైఖరి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, ఇంకా నాసిరకం మద్యం విక్రయాలు…వంటివి వైసీపీని ముంచేశాయి.
విశాఖపట్నం జిల్లాలో మొత్తం 14,24,836 ఓట్లు లెక్కింపునకు పరిగణనలోకి తీసుకోగా వాటిలో కూటమి అభ్యర్థులకు 9,13,065 (64.08 శాతం) ఓట్లు లభించాయి. మరో ప్రధాన పార్టీ అయిన వైసీపీకి 4,24,747 (29.81 శాతం) ఓట్లు లభించాయి.
జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో నాలుగు స్థానాలు (భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, గాజువాక)లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసి అఖండ విజయం సాధించారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు, తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమంలో గణబాబు, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గెలిచారు. పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో గంటా ఉన్నారు. మరో రెండు స్థానాలు (విశాఖ దక్షిణం, పెందుర్తి)లో జనసేన అభ్యర్థులు పోటీ విజయం దక్కించుకున్నారు. విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి బీజేపీ పోటీ చేసి ఆ సీటును తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేశాయి. విశాఖ పశ్చిమ నుంచి సీపీఐ అభ్యర్థి విమల, గాజువాక నుంచి సీపీఎం నుంచి జగ్గునాయుడు పోటీ చేసి ఓడిపోయారు. మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసి ఒక్కరు కూడా పది వేల ఓట్లు సాధించలేకపోయారు. అంతా కలిసి 20,993 ఓట్లను తెచ్చుకున్నారు. స్వతంత్రులు అంతా కలిసి 61,062 ఓట్లను సాధించారు.
భీమిలిలో గంటాకు 63.34 శాతం
భీమిలి నియోజక వర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో అధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ అధికారులు 2,78,235 ఓట్లను లెక్కించగా అందులో గంటా శ్రీనివాసరావుకు 1,76,230 ఓట్లు (63.34 శాతం) లభించాయి. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 83,829 ఓట్లు (30.13 శాతం) దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 5,147 ఓట్లు (1.85 శాతం) తెచ్చుకున్నారు. ఇతరులకు 13,029 ఓట్లు వచ్చాయి.
వెలగపూడికి 64.89 శాతం
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. ఇక్కడ అధికారులు 2,03,494 ఓట్లు లెక్కింపునకు తీసుకోగా అందులో 64.89 శాతం అంటే 1,32,047 ఓట్లు వెలగపూడికి వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 61,170 ఓట్లు (30.06 శాతం) లభించాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 3,430 (1.69 శాతం), ఇతరులకు 6,847 ఓట్లు పడ్డాయి.
గణబాబుకు 60.13ు
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు గెలిచారు. ఇక్కడ అధికారులు 1,51,008 ఓట్లు లెక్కించగా అందులో 60.13 శాతం ఓట్లు అంటే 90,805 గణబాబుకు లభించాయి. వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌కు 36.83 శాతం అంటే 54,998 ఓట్లు దక్కాయి. ఇక్కడ సీపీఐ నుంచి విమల పోటీ చేసి 999 ఓట్లు సాధించారు. ఇతరులకు 4,206 ఓట్లు వచ్చాయి.
‘నార్త్’లో విష్ణుకుమార్‌రాజుకు 57.81 శాతం ఓట్లు
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పి.విష్ణుకుమార్‌రాజు పోటీ చేసి విజయం సాధించారు. అధికారులు ఇక్కడ 1,88,208 ఓట్లను లెక్కించగా అందులో విష్ణుకుమార్‌రాజుకు 1,08,801 ఓట్లు (57.81 శాతం) లభించాయి. వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు 61,267 ఓట్లు (32.55 శాతం) దక్కాయి. ఇదే నియోజకవర్గం నుంచి జైభారత్ నేషనల్ పార్టీ తరఫున మాజీ సీబీఐ అధికారి వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేసి 5,160 (2.74 శాతం) ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు 4,252 ఓట్లు, ఇతరులకు 8,278 ఓట్లు లభించాయి.
వంశీకృష్ణకు 70.24ు
విశాఖ దక్షిణంలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీ చేసి గెలిచారు. ఇక్కడ అధికారులు 1,39,328 ఓట్లు లెక్కింపునకు తీసుకోగా వంశీకి 70.24 శాతం అంటే 97,868 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు 33,274 ఓట్లు (23.88 శాతం) దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 3,940, ఇతరులకు 4,246 ఓట్లు వచ్చాయి.
పల్లాకు భారీ మెజారిటీ
గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ 95,235 ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు. ఇక్కడ అధికారులు 2,34,329 ఓట్లు లెక్కించగా అందులో 67.3 శాతం అంటే 1,57,703 ఓట్లు పల్లా శ్రీనివాసరావుకు లభించాయి. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌కు 62,468 ఓట్లు (26.66 శాతం), సీపీఎం అభ్యర్థి జగ్గునాయుడుకు 1.69 శాతం అంటే 3,970 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 10,188 ఓట్లు పడ్డాయి.
పెందుర్తిలో పంచకర్లకు 65.01 శాతం ఓట్లు
పెందుర్తిలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పంచకర్ల రమేశ్‌బాబు పోటీ చేసి గెలిచారు. ఇక్కడ అధికారులు 2,30,144 ఓట్లు లెక్కించగా అందులో 65.01 శాతం ఓట్లు అంటే 1,49,611 ఓట్లు పంచకర్లకు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌కు 67,741 (29.43 శాతం) ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 4,224 ఓట్లు, ఇతరులకు 8,568 ఓట్లు వచ్చాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు
నియోజకవర్గం లెక్కించిన ఓట్లు కూటమి శాతం వైసీపీ శాతం కాంగ్రెస్+ శాతం ఇతరులు శాతం
భీమునిపట్నం 2,78,235 1,76,230 63.34 83,829 30.13 5,147 1.85 13,029 4.68
విశాఖ తూర్పు 2,03,494 1,32,047 64.89 61,170 30,06 3,430 1.69 6,847 3.36
విశాఖ పశ్చిమ 1,51,008 90,085 60.13 54,998 36.83 999 0.66 4,206 2.78
విశాఖ ఉత్తర 1,88,208 1,08,801 57.81 61,267 32.55 4,252 2.26 8,278 4.39
విశాఖ దక్షిణ 1,39,328 97,868 70.24 33,274 23.88 3,940 2.83 4,246 3.04
గాజువాక 2,34,329 1,57,703 67.3 62,468 26.66 3,970 1.69 10,188 4.34
పెందుర్తి 2,30,144 1,49,611 65.01 67,741 29.43 4,224 1.84 8,568 3.72