మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది
మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోంది
ముస్లింలలో పేదలందరికి వైయస్ఆర్ రిజర్వేషన్‌లు అమలు చేశారు
సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం
భిన్నత్వంలో ఏకత్వం మన బలం
ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది
వెనుకబడ్డ వర్గాలకు, మైనారిటీలకు 50 శాతం పదవులు ఇచ్చాం
రూ.2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తున్నాయి
లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన: సీఎం వైయస్ జగన్
విజయవాడ: మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మనందరి ప్రభుత్వమని ఉద్ఘాటించారు. మైనార్టీలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైయస్ఆర్ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుమారుడిగా నాలుగు అడుగులు ముందు వేస్తూ మన పార్టీ నుంచి నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం పేర్కొన్నారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- మైనారిటీ వెల్‌ఫేర్ డే..ఈ రోజు నిజంగా మంచి రోజున మీ అందరి ఆప్యాయతల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య..ఇక్కడికి వచ్చిన నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములూ, అవ్వలు తాతలు. మీ అందరి సంతోషాల మధ్య ఈ మైనారిటీ వెల్‌ఫేర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ..పేరు పేరునా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను.
- ఈ రోజు భారత తొలి విద్యాశాఖ మంత్రిగా, దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ఈ రోజు మనందరం జరుపుకుంటున్నాం. మైనారిటీస్ డేగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు, దివంగత నేత, వైయస్ రాజశేఖరరెడ్డి గారు, నాన్నగారు తొలిసారిగా ఉమ్మడి ఏపీలో ప్రకటించారు.
- ఈ రోజు మనమంతా సంతోషాల మధ్య జరుపుకుంటూ ముస్లింలలో పేదలందరికీ దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి ఆ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. నాన్నగారు ముస్లింల పట్ల, మైనారిటీల సంక్షేమం పట్ల నాన్నగారు ఒక్క అడుగు వేస్తే..ఆయన బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా రెండు అడుగులు వేశానని సగర్వంగా చెబుతున్నాను.
- ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ సా«ధికారత, ఆర్థిక సాధికారత, సామాజిక సాధికారత, మహిళా సాధికారత, విద్యా సాధికారత, వారికి సంక్షేమం అందించే ఏ విషయం చూసినా కూడా మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక గొప్ప మార్పులు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను.
- గతానికి, ఇప్పటికీ తేడాను గమనించండి.గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి మనసు రాని పరిస్థితి అప్పట్లో ఉంటే..మనసున రాని ముఖ్యమంత్రి గతంలో ఉంటే..ఈ రోజు మన ప్రభుత్వంలో ఇప్పటికీ 53 నెలల కాలం అవుతుంది. రెండుసార్లు మంత్రి మండలిలో మార్పులు, కూర్పులు చేశాం. డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు నా మైనారిటీ సోదరుడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు. గతానికి ఇప్పటికీ తేడా గమనించండి.
- గతంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వని అధ్వాన్నమైన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా నా పక్కనే కూర్చోబెట్టుకుని ఇది అందరి ప్రభుత్వమని చాటి చెప్పాను.
- ఈ రోజు మన పార్టీ నుంచి దేవుడి దయతో నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. 53 నెలల కాలంలో మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చోబెట్టగలిగాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారిగా నా సోదరి, నా అక్క శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. నా అక్కచెల్లెమ్మల విషయంలో, ముస్లింల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్ప అడుగులు వేస్తుందో చరిత్రలో నిలిచిపోతుంది.
- ఈ రోజు ప్రతి అడుగులోనూ కూడా రాష్ట్రంలో ఇచ్చే ప్రతి పదవిలో కూడా ఏకంగా చట్టం చేసి 50 శాతం పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీబిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోష పడుతున్నాను.
- ఇన్నీ మార్పులు జరిగిన పరిస్థితులు, రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, సామాజిక సాధికారత, మహిళా, విద్యా సాధికారత మాటల్లో కాదు..ఏకంగా చేతల్లో చేసి చూపించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది.
- ఈ రోజు మెజారిటీ ప్రజలు, మైనారిటీలు కానివ్వండి. పేదలకు ఏది చేసినా కూడా నిండు మనసుతో తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ వారి బతుకులు మార్చుతున్నాం.
- భారత దేశం అంటేనే ఏడు రంగుల ఇంద్రధనస్సు అంటాం. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, సంస్కృతులు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అందరం కలిసి కట్టుగా ఇంద్రధనస్సుల్లా ఎప్పుడూ ఉంటామన్నది దేశ చరిత్ర.
- ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం మన బలం, ఒకరినొకరం గౌరవించుకోవడం మన బలం. అల్ప సంఖ్యాలో ఉన్నవారికి అండగా నిలబడటం మన బలం. మెజారిటీ, మైనారిటీ అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఐక్యత పెంచడం ఒక వైయస్‌ఆర్ బలం. ఒక జగన్ బలం..ఇది మనందరి బలం అని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
- ఈ ప్రభుత్వం మనందరిది. నా పక్కన తిరిగి చూస్తే ఒక్క జగన్ కనిపిస్తారు. ఇరుపక్కల డిప్యూటీ సీఎంలుగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కనిపిస్తారు. వీళ్లందరూ కూడా నా పక్కనే కనిపిస్తారు. మీ బిడ్డ ప్రమాణం చేసిన మొట్ట మొదటి నుంచి వీరంతా కనిపిస్తారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌ది మాత్రమే కాదు..ఈ ప్రభుత్వం మనందరిదని గుర్తు పెట్టుకోవాలని విన్నవిస్తున్నాను.
- ఈ 53 నెలల కాలంలో వివిధ పథకాల కింద ఎప్పుడు దేశంలో జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రతి అడుగులోనూ ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ నిరుపేదలు అని ప్రతి సందర్భంలో నా..నా..నా..అంటూ వీరంతా నా కుటుంబం అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులో అడుగు వేసిన పరిస్థితులు ..గతానికి ఇప్పటికీ మధ్య ఉన్న తేడాను గమనించమని కోరుతున్నాను.
- గతంలో ఎవరైనా కూడా ఐదేళ్ల కిందట ఇలా బటన్ నొక్కగలుగుతారు.. నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.2.40 లక్షల కోట్లు ఇవ్వగలుగుతారని ఐదేళ్లకిందట ఎవరైనా మాట్లాడారా? మీ గుండెలపై చేతులు వేసుకొని మీ మనసాక్షిని అడగండి. ఆ రోజు అదే ప్రభుత్వం, ఈ రోజు అదే ప్రభుత్వం. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఆ రోజుఅదే బడ్జెట్, అదే గ్రోత్‌రేట్..అప్పులు కూడాఅప్పటి కన్నా ఇప్పుడు తక్కువ. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. బటన్ నొక్కుతున్నాడు..నేరుగా నా పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.40 లక్షల కోట్లు జమ అయ్యాయి. గతంలోఎందుకు ఇలా బటన్ నొక్కలేదు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి.
- లంచాలు లేని, వివక్ష లేని పాలన, అక్కచెల్లెమ్మలను బాగా చూసుకోవాలని, వారి పిల్లలు బాగా చదవాలని, బాగా ఎదగాలని ఆలోచన చేసే పాలన వస్తుందని ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే నమ్మేవాళ్లమా? అప్పటికి, ఇప్పటికీ ప్రస్ఫూటమైన తేడా చూపుతూ నేరుగా రూ.2.40 లక్షల కోట్లు వారి ఖాతాల్లో జమచేశాం.
- ఆ పేదవాడు వెళ్తున్న స్కూళ్లు, ఆసుపత్రులు మారిపోయాయి. ఈ రోజు ఉదయమే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నారు.
- ఈ రోజు నా ముస్లిం మైనారిటీలు,అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములను తీసుకుంటే నా 53 నెలల పాలనలో నేరుగా బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి అక్షరాల రూ.12,375 కోట్లు డీబీటీ ద్వారా పంపించగలిగితే..ఇక నాన్ డీబీటీ ద్వారా మరో రూ.10,800 కోట్లు..అంటే ఈ నాలుగున్నరేళ్ల పాలనలోఅక్షరాల రూ.23,176 కోట్లు నా ముస్లిం మైనారిటీలకు ఇవ్వగలిగామంటే మార్పు ఎంతగా ఉందో తేడా గమనించండి.
- గత పాలనలో ఎంత ఖర్చు చేసారోతెలుసా? కేవలం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.తేడాను గమనించండి.
- ఈ రోజు మనం చేసే ప్రతి పని కూడా పిల్లలు బాగా ఎదగాలని గొప్పగా అడుగులు వేస్తున్నాం. షాదీ తోఫా పథకం తీసుకువచ్చాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, వారిని ప్రోత్సహించేందుకు కచ్చితంగా పదో తరగతి చదవాలని చాలా మది నాతో అన్నారు. ఎన్నికలకు వెళ్తున్నాం. ఇలాంటి కండీషన్లు ఎందుకని ప్రశ్నించారు. నాయకుడు అన్నవాడు ఎన్నికల కోసం పథకాలు పెట్టకూడదని, వారి భివిష్యత్ కోసం పథకాలు అమలు చేయాలని వారితో చెప్పాను. అలా చేసినప్పుడే వారి పిల్లలు గొప్పగా చదువుకోగలుగుతారు.
- ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ బోర్డులు,ఇంగ్లీష్ మీడియం చదువులు, ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మన పిల్లలు బాగా చదువుకునేందుకు ఊతమిస్తాయి. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తున్నాం. అందులో మరో అడుగు కళ్యాణ మస్తు,షాదీ తోఫా.
- ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. ఈ 53 నెలల కాలంలో నేను సంతోషంగా చెబుతున్నాను. దేవుడి దయతో మంచి చేయగలిగానని గుండెల మీద చేతులు వేసుకొని సంతోషంగా చెబుతున్నాను. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకునే గొప్పభాగ్యం ఈ రోజు ప్రప్తమైంది.
- మరో విషయం చెప్పాలి..మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉర్దూను అధికార రెండో భాషగా ప్రకటించిందని చెప్పడానికి ఈ రోజు సంతోషపడుతున్నాను. రాష్ట్రంలోని అన్ని వర్గాల మైనారిటీల కోసం సబ్‌ప్లాన్ కూడా అమలు చేస్తున్నది కూడా మన ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కాంపోనెంట్ చట్టాన్ని సబ్ ప్లాన్‌ను తీసుకువచ్చాం.
- ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం. ఏ ఒక్క కష్టం వచ్చినా కూడా మీ కష్టాన్ని నా కష్టంగా భావించి అడుగులు ముందుకు వేశాను. మొన్న హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలు అందరూ కూడా గతంలో హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. విజయవాడ నుంచి నేరుగా వెళ్లాలని అడుగులు ముందుకు వేశాం. విజయవాడను ఎంబారికేషన్ పాయింట్‌గా ప్రకటించి విజయవాడ నుంచి విమాన టికెట్టు ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఏకంగా రూ.80 వేలు ఎక్కుగా వేశారు. ఏం చేయాలని నా దగ్గరికి వచ్చి మంత్రి అంజాద్‌బాషా వచ్చాడు. ఈ మాదిరిగా ఇవ్వాలంటే చేతనవుతుందా అని అడిగారు. ఇక్కడ ఉన్నది మన ప్రభుత్వం. కచితంగా తోడుగా ఉంటానని చెప్పాను. వెంటనే చెక్ ఇచ్చి హజ్ యాత్రకు పంపించాను.
- అక్కడికి వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం గట్టిగా దువ్వా చేయమని ముస్లిం సోదరులను కోరాను. ఈ రోజు మైనారిటీలందరిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
- మొట్టమొదటిసారిగా, ఎప్పుడు జరగని విధంగా ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లుకు రూ.5 వేలు గౌరవవేతనం పెంచిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.
- పాస్టర్లకు కూడా రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
- ఈ రోజు వక్ఫ్‌బోర్డు, మసీదులు, చర్చీలకు సంబంధించి ఆస్తుల సంరక్షణకు ఏకంగా జీవో 16 జారీ చేశాం. వీటి భూములను రక్షించేందుకు జీవో విడుదల చేశాం. రాష్ట్రం, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
- ప్రతి అడుగులోనూ కూడా అందరికీ మేలు చేస్తూ అందరి సంక్షేమం కోరే ప్రభుత్వంగా ఇవన్నీ చేస్తున్నామని తెలియజేస్తూ..
- దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సీఎం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.