అమరావతి
– ఇసుక ఆపరేషన్స్ పై ఈనాడు తప్పుడు రాతలు
– పాత కాంట్రాక్టర్ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు
– కొత్త ఏజెన్సీ ఖరారు కోసం టెండర్లు నిర్వహిస్తున్నాం
– త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది
– అప్పటి వరకు పాత ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్
– దీనికి సిఎంఓకి సంబంధం ఏమిటీ?
– అనుమతి ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు
– రాజకీయంగా బురదచల్లేందుకే ఈనాడు నిరాధారమైన రాతలు
: శ్రీ విజి వెంకటరెడ్డి, గనులశాఖ సంచాలకులు
అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ పై ఈనాడు దినపత్రిక ఇసుకకు టెండరు పెట్టింది సిఎంఓనా? అనే శీర్షికన ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవాలతో రాసినదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక పై ఒక పారదర్శక విధానంను రూపొందించి అమలు చేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని ఈనాడు పత్రిక వండివార్చిందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం.
వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జెపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్ లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్ ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. దీనిని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక వక్రీకరణ కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?
ఇసుక ఆపరేషన్స్ కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారు? ఒక ఈనాడు దినపత్రికకు మాత్రమే ఇలా చెబుతున్నారా? ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు?
గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఈ అక్రమాలు కనిపించలేదా? సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే…. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి… జిల్లాకో ఇన్ చార్జిని నియమించారంటూ ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది.
ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోకపోతే ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.