కవి కరీముల్లా సామాజిక వ్యాసం
———————————-
నాటి మూల వాసులే నేటి ముస్లింలు
—————————————-
మన భారతదేశాన్ని ఎంతోమంది ముస్లిం రాజులు పరిపాలించారు. అందరూ ఈ సంస్కృతిలో మమేకమై ఈ మట్టిని ప్రేమించి ఈ మట్టిలోనే కల్సిపోయారు. అయితే వీరంతా ఇస్లాం మత విస్తరణ కాంక్షతో వచ్చారని ఇక్కడి ప్రజలను బలవంతంగా మతం మార్చారు కనుకే ముస్లింల జన సంఖ్య పెరిగిందని కొంతమంది చరిత్రకారులు చర్విత చరణంలా అసంబద్ధ, అసత్య ప్రచారాలు చేశారు.
ఏ మతానికి చెందిన రాజులు పరిపాలిస్తే ఆ మతానికి ప్రోత్సాహం లభించిన మాట వాస్తవమే అయినా మొత్తం మత విస్తరణకు అది కారణం కాదు. ఆనాడు సమాజంలో నెలకొనివున్న సామాజిక, ఆర్థిక రాజకీయ, మత పరిస్థితులు ఇస్లాం వ్యాప్తికి దోహద పడ్డాయి. నాడు నెలకొనివున్న చాతుర్వర్ణ వ్యవస్థ, అమానవీయ అంటరానితనం మొత్తం సమాజాన్ని అనేక పాయలుగా చీల్చింది. దిగువ వర్ణాలన్నీ వివక్షత అనే చట్రంలో నలిగిపోయాయి.
ఈ పరిస్థితులలో చింపిరిగుడ్డలతో, జోలె సంచులతో వచ్చిన సూఫీ సన్యాసులు ఇస్లామ్ను ప్రేమ, సమానత్వం ప్రాతిపదికగా అందించారు. వారి ప్రభావానికి గురైన వేలాదిమంది నాటి మూలవాసులు ఇస్లామ్ స్వీకరించి ఆత్మ గౌరవాన్ని పొందారు. అజ్మీర్కు చెందిన ఖాజా గరీబ్ నవాజ్ అనే సూఫీ గురువు చేతుల మీదుగా వేలాది మంది ప్రజలు ఇస్లామ్లో ప్రవేశించారంటే వారి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా చారిత్రకంగా నాటి తొలితరం మూలవాసులే నేటి ముస్లింలని చెప్పవచ్చు.నేటి వర్తమాన స్థితిగతుల్ని బట్టి చూస్తే ముస్లింలు దళితులకన్నా బాగా వెనుకబడివున్నారు.
ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశ జనాభాలో సుమారు 20 శాతం వుండి కూడా విద్య, ఉద్యోగ విషయాలలో, చట్ట సభల్లో నేటికీ తను వాటా పొందలేక పోయారు. 1991 సం|| జనాభా లెక్కల ప్రకారం ముస్లింలలో దాదాపు సగానికి పైగా దారిద్య్ర రేఖకు దిగువగా వున్నారంటే ఎంత దయనీయమైన స్థితిలో వున్నారో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ ముస్లింలలో నేటికీ 2 ఎకరాల పొలంకంటే తక్కువగా వున్నవారు దాదాపు 90% పై చిలుకు వున్నారని గణాంక వివరాలు తెలియపరుస్తున్నాయి.
ఇక ఐ.ఏ.యస్., ఐ.పి.యస్., వంటి క్యాడర్లలో కనీసం 1% కూడా మించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం చెప్పుకోదగ్గ పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే కార్యనిర్వాహక వర్గంలో వీరికి ఏ పాత్ర లేదు. పల్లెలలో నివసించే ముస్లింలు కూలీలుగా జీవనం సాగిస్తూ. అక్కడి పెత్తందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతుకున్నారు. అయితే మెజారిటీ ముస్లింలు పట్టణాలలోనే స్థిర పడ్డారు. వీరంతా మెకానిక్లుగానో, టైలర్లుగానో, డ్రైవర్లుగానో కొనసాగుతున్నారు. ఇంకా రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనో, చేతివృత్తులు చేసుకుంటూనో పొట్ట పోసుకుంటున్నారు. ఎంతకీ ఎదుగు బొదుగులేని జీవితాలతో, చాలీచాలని ఆదాయంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు.
ఉత్పత్తి రంగంలో స్త్రీలు పాలు పంచుకోవడంపై ఇస్లామ్ ఎటువంటి నిషేధం విధించక పోయినా పురుషాహంకారం వల్ల స్త్రీలు కుటుంబ ఆర్థికాభివృద్దిలో పాలు పంచుకోలేక పోతున్నారు. తత్ఫలితంగా వీరి జీవన ప్రమాణస్థాయి దారుణంగా పడిపోయింది.
నేటి ముస్లిం సమాజం ఇంతగా వెనుకబడి వుండటానికి ప్రధాన కారణం నిరక్ష్యరాస్యత, అవిద్య ముస్లింలకు తీరని హాని కల్గించింది. దశాబ్దాల చీకటి గోతుల్ని తవ్వింది. చదివించే స్థోమత లేక పిల్లల్ని పనుల్లోకి పంపటం సహజమై. పోయింది. విద్యా ఉద్యోగాలలో సరియైన రిజర్వేషన్ సౌకర్యం లేక పోవటం వలన నిరాశానిస్పృహలతో ముస్లింలు విద్యకు దూరంగా జరిగి పోయారు. ముస్లింలు మొదటగా ఉద్యమించాల్సింది విద్య, ఉద్యోగాలలో ప్రాతినిధ్యం కోసం మాత్రమే. ఇస్లామ్లో విద్యకు, జ్ఞానానికి పెద్ద పీట వెయ్యడం జరిగింది.
పవిత్రఖుర్ఆన్లో మొదటి వాక్యం చదువుతోనే ప్రారంభమౌతుంది. స్వయాన దైవ ప్రవక్త ముహమ్మద్ (స) విద్యార్జన కోసం భూమి చివరి అంచుల వరకైనా వెళ్ళండి అని ఉపదేశించారు. అయినా ముస్లిం సమాజం విద్యను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ఇటీవలి విద్యా సర్వేప్రకారం ముస్లిం విద్యార్థుల డ్రాపవుట్స్ శాతం పెరిగింది. ఈ డ్రాపవుట్స్ శాతాన్ని తగ్గించేందుకై ప్రభుత్వం, ముస్లిం సమాజం కల్సి కృషి చేయాల్సిన అవసరం ఎంతో వుంది.
ముస్లిం సమాజంలో మదరసాలకు ఎనలేని ప్రాధాన్యత వుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మదరసాలు కీలకమైన పాత్ర పోషించాయి. అటువంటి మదరసాలు నేడు ఆధునిక విద్యకు దూరమై కేవలం ధార్మిక విద్యకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇహలోక సంబంధమైన విషయాలకు, పరలోక సంబంధమైన విషయాలకు ఇస్లామ్ సమాన ప్రాతినిధ్యం ఇచ్చినా ముస్లిం పండితులు మదరసాలలో కేవలం ధార్మిక విద్యను మాత్రమే బోధించటం వల్ల సామాజిక శాస్త్రాల్ని, గణితం, ఇంగ్లీషు, తెలుగు తదితర బోధనాంశాలను ప్రక్కన పెట్టడం ద్వారా నేటి వర్తమాన ప్రపంచంలో ముస్లింల విద్యాస్థాయిని దారుణంగా దెబ్బతింది.
ఇప్పుడిప్పుడే ఆధునిక విద్య మదరసాలలో చోటుచేసుకోవటం,ఈ కోణంలో ఉలేమాలు ఆలోచించటం హర్షణీయం.. కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నట్లుగా మదరసాలు తీవ్రవాద నిలయాలు కావు. ఇవి విద్యార్థులలో నైతిక వర్తన పెంచుతూ ధార్మిక నియమాలు పాటించే వారిగా మాత్రమే తయారు చేస్తాయి. ఇందులో చదివే విద్యార్థులకు తమ చుట్టూ వున్న ప్రపంచం గురించి ఏమాత్రం తెలియపర్చకుండా, కనీసమైన సామాజిక స్పృహను కలిగించకుండా కొంతమంది మత పండితులు ఉపేక్షించడం ఇస్లామ్ స్ఫూర్తికే విరుద్ధం. ఇప్పటికైనా మత పండితులు ఆత్మ విమర్శ చేసుకుని ధార్మిక విద్యతో పాటు సామాజిక శాస్త్రాల్ని కూడా బోధనాంశాలుగా పెట్టి మదరసాల్ని ఆధునీకరించాల్సిన అవసరం వుంది.
మతపరమైన విషయాలలోనూ ముస్లింలు ఇస్లామ్ వాస్తవిక రూపాన్ని దర్శించలేక పోతున్నారు. ఇస్లామ్ అత్యంత ప్రగతిశీలమైన ధర్మం. కాని ఒక డ్రైవింగ్ తెలియని డ్రైవర్ చేతిలో చిక్కిన కారులా కొన్ని విషయాలకే పరిమితమై నడుస్తున్నది. ఇస్లామ్లో లేని అనేక దురాచారాలను తలకెత్తుకున్న ముస్లిమ్ సమాజం స్వీయ సంస్కరణల బాటలో నడవవల్సి వున్నది. ఆర్థికాభివృద్ధి కోసం దేబిరించే బదులు ‘జకాత్’ వ్యవస్థను పట్టిష్ట పర్చుకోవడం ద్వారా స్వీయ సమృద్ధిని సాధించాలి.
మతపరమైన ఉద్రిక్తతలకు తావిచ్చే అంశాలలో అత్యంత వివేకంతో సంయమనం పాటించాలి. ఇంటి గడప దాటకుండా, సామాన్య ముస్లిం ప్రజల కష్టనష్టాలు తెలియకుండా బాధ్యతలేని ప్రకటనలతో ఉద్రేకపూరిత ఉపన్యాసాలు చెప్పే రాజకీయ నాయకులు ముస్లింలకు ఒరగబెట్టిందేమీ లేదు. ముస్లింల డోలయాన స్థితిని ఆసరా చేసుకొని కొన్ని శక్తులు మెజార్టీ సమాజంలో మసిపూసి మారేడు కాయ చేసిన చందంలా ముస్లింల ఉనికి పట్ల భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. తమకు అందుబాటులో వున్న మీడియాద్వారా తమ పట్ల ఇతర సమాజాలలో పెరుగుతున్న అపోహలను, అపార్ధాలను తొలగించే కార్యక్రమాన్ని ముస్లిం మేధావులు చేపట్టాలి.
మతోన్మాదానికి సమాధానం మతోన్మాదం కాకూడదు. స్వయాన ప్రవక్త ముహమ్మద్(స) మలినాన్ని మలినంతో శుభ్రపర్చలేమని చెప్పారు. మతోన్మాదం, టెర్రరిజం పరస్పర ఆధారితాలు ఈ రెండు వివేక శూన్యమయినవే.
ఇప్పుడు ముస్లిమ్ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య అభద్రతాభావం. ఈ వలయంలో చిక్కి ముస్లిమ్ సమాజం విలవిలలాడి పోతున్నది. ముస్లింలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కరువైంది. చివరికి క్రికెట్ కూడా టి.వి.లో అందరితో కలిసి చూడలేని దౌర్భాగ్యపు పరిస్థితులు చుట్టు ముట్టాయి. కొన్ని శక్తులు ఒక పధకం ప్రకారం ముస్లింల దేశభక్తిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని త్యాగాలు చేసిన ముస్లింల చరిత్ర ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించబడింది. నిజానికి దేశవిభజన వల్ల ఎక్కువగా నష్టపోయిన వారు భారతీయ ముస్లింలే. భారతీయ ముస్లింలకు దేశ విభజన వల్ల జరిగిన నష్టం అపారమైనది. స్వీయ ప్రయోజనాల కోసం నిత్యం పాకిస్తాన్ పాలకులు అనుసరిస్తున్న దుష్ట వైఖరి భారతీయ ముస్లింలకు పెను శాపంలా మారింది. భారత్లో ఐ.యస్.ఐ. కొనసాగిస్తున్న విధ్వంసకర కార్యక్రమాలతో భారతీయ ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తదనంతర పరిణామాలకు ముస్లిం సమాజం బలి అవుతున్నది. పరాన్న భుక్కులుగా కాక శ్రమ విలువలతో కూడిన జీవన విధానం కలిగి వున్న ముస్లింలు సామాజిక, ఆర్థిక, సమస్యలతో పాటు అభద్రతాభావాన్ని మోయాల్సి రావడం విచారించదగ్గ విషయం.
వర్తమాన ఆధునిక కాలంలో సమస్యలు పెరిగాయి. ప్రతి సమాజానికీ కొన్ని ప్రత్యేక సమస్యలు వున్నాయి. ఈ పరిస్థితులలో అనేక ఉమ్మడి సమస్యలపై ముస్లిం సమాజం ఇతర సమాజాలతో కల్సి నడవవల్సిన అవసరం వుంది. అయితే అన్ని సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ముస్లిం సమాజం అదనపు సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి విచిత్ర పరిస్థితులలో స్వీయ తప్పిదాలను సవరించుకునే వైపుగా అడుగులు పడాలి. ముందుగా ముస్లింలు తాము అగ్రవర్ణీకులమని,నవాబులమనే భావనను తొలగించుకోవాలి. ప్రత్యేకమైన భాష, సంస్కృతిని కలిగి వుండటం తప్పుకాదు. కాని ఉర్దూభాష ఇస్లామ్ భాషనే భావ జాలం నుండి బయటపడాలి.
తెలుగు లేదా ఇతర స్థానిక భాష మాట్లాడే ముస్లింలను చిన్న చూపు చూడటం మానుకోవాలి. సాంస్కృతిక వైరుధ్యం శృతిమించితే అది విభిన్న సమాజాల మధ్య విభజనకు దారితీస్తుంది. ప్రాంతీయ భాషల్ని సామాన్యీకరణ చేసుకోవడం ద్వారా ముస్లిం సమాజం ఇతర సమాజాలకు దగ్గరవుతుంది. తద్వార ఒకరి సమస్యలు మరొకరు తెల్సుకోవటానికి వీలవుతుంది. ఒకరి పట్ల మరొకరికి వున్న అనుమానాలు దూరమై ఉమ్మడి సామాజిక ఐక్యత సాధ్యమవుతుంది.
ముస్లింలు తమ మూలాల్ని వెతుక్కోవాల్సిన అవసరం వుంది. సామాజిక స్పృహను కలిగి వుండాలి. పీడక వర్గాలేవో, పీడిత వర్గాలేవో గుర్తించి తమతో సారూప్యమున్న అట్టడుగు బలహీన వర్గాల ప్రజలతో ఐక్యవేదికను నిర్మించుకోవాలి. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రయత్నాలు జరుగుతూ వుండటం హర్షించదగ్గ విషయం. ముస్లిం యువత ఇప్పుడు తీవ్రమైన నిరాశ నిస్పృహలమధ్య కొట్టుమిట్టాడుతుంది. అసంతృప్తి ఆలోచనాత్మకమైన నిర్మాణం వైపుకు కదలాలి, అంతే కాని అవేశపూరితమైన విధానాల వైపుకు కాదు. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రగతిశీల, సెక్యులర్ శక్తులతో కలిసి నడుస్తూ విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలి. తద్వారా మాత్రమే ముస్లిం సమాజం సమస్యల సుడిగుండం నుండి బయట పడగలుగుతుంది.
ముస్లింలు ఇప్పుడు పాకులాడాల్సింది గుప్పెడు సానుభూతి కోసం కాదు. ఆత్మవిశ్వాసం కోసం, అచంచలమైన విజయ విశ్వాసం కోసం.
