వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత- సీఎం వైయస్ జగన్
- ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించినప్పుడు వై నాట్ 175
- ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం కావాలని క్యాడర్‌కు పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపు
- మీరంతా నా కుటుంబ సభ్యులే
- అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నాం
- 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం
- మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు
- వైయస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం
- సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశాం
- రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం
- నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చాం
స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశాం
- వైయస్ఆర్‌సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదు
- జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి
- రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు
- నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతాం
- అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31వరకు బస్సుయాత్ర
- మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తాం
- రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్ వార్
- పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి
- డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకూ ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం
- జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు
- జనవరి 10 నుంచి వైయస్ఆర్ చేయూత
- జనవరి 20 నుంచి 30 దాకా వైయస్ఆర్ ఆసరా
- ఫిబ్రవరిలో ఇంటింటికీ వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో
- మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుదాం
- చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులిచ్చాయి
- చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా లేదు
- చంద్రబాబు, దత్తపుత్రడు కలిసివచ్చినా సున్నాయే
- ప్రజలతోనే మనపొత్తు
- రాజకీయమంటే చనిపోయాక కూడా బతికుండటమే
- దేవుడిని, ప్రజల్నే నమ్ముకున్నా
విజయవాడ: ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించినప్పుడు వై నాట్ 175, ప్రజలకు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు వై నాట్ 175 అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించామన్నారు. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చాం. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండేలా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చాం. వైయస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం. వ్యవస్థలోగానీ, పాలనలోగానీ ఇన్ని మార్పులు తెచ్చిన పార్టీ లేదన్నారు.
‘రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం. పేదవాడి పార్టీ వైయస్ఆర్‌సీపీ. రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్ వార్. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమన్నారు. ‘ఫిబ్రవరిలో వైయస్ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ …
- ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే..
- ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రెండు మెట్లు ఎదిగి మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజా సేవకులు..నా సేనానులు.
- ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, మేయర్లు, పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండల స్థాయి, ఆ పై స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ, వారితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నా మంత్రి మండలి సహచరులు..ఇలా అందరికీ మీ తమ్ముడిగా, మీ అన్నగా నిండు మనసుతో ఈ రోజు ఇక్కడ స్వాగతం పలుకుతున్నాను.
- ఈ మీటింగ్‌కు రాలేకపోయిన గ్రామ స్థాయిలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు ఇలా అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వీరందరికీ కూడా ఈ వేదికపై నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
- ఈ రోజు దేవుడి దయతో, ప్రజలిచ్చిన అధికారంతో ఈ రోజు మీ అన్న, మీ తమ్ముడు నేడు ప్రజలకు తొలి సేవకుడిగా అధికారం అన్నది మనకు బాధ్యతను మాత్రమే నేర్పింది అని తెలియజేప్పే తొలి సేవకుడిగా ఇక్కడి నుంచి ఉపన్యాసం ఇస్తున్నాను.
- బాధ్యతతో వ్యవహరించాను కాబట్టే ఈ 52 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ, ఎన్నడూ చూడని విధంగా, కనీవిని ఎరుగని విధంగా మన పరిపాలనలో సువర్ణ అక్షరాలతో లిఖించబడేట్టుగా ఎప్పుడూ రాష్ట్రం చూడని విధంగా మొట్ట మొదటి సారిగా గ్రామ స్థాయిలోనే అవినీతి, వివక్షకు తావులేకుండా పౌర సేవల డెలివరీలో డీబీటీ ద్వారా ఎప్పుడూ రాష్ట్రంలో చూడని గొప్ప విప్లవాత్మక మార్పులు 52 నెలల పాలనలోనే చూశాం.
- మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని ఒకవైపు కాపాడుతూ..మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ అడుగులు వేయగలిగాం.
- గ్రామస్థాయిలో ఇంతకుముందు చూడని విధంగా సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చాం. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చూడలేదు.
- ప్రభుత్వ పథకాలు అర్హతే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికీ కూడా అందించగలుగుతామా అన్నది సందేహం లేకుండా ఎక్కడా లంచాలు లేకుండా గ్రామస్థాయిలోనే అందించాం.
- ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గురించి పార్టీ నాయకులు చెబుతారు. ఎన్నికలు అయిపోయిన తరువాత దాన్ని చెత్తబుట్టలో వేస్తారని మనం గత పాలకులను చూశాం. గత పాలకులకు భిన్నంగా మనం 99 శాతం వాగ్ధానాలు అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే..చేస్తాడని , మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా, నష్టమైనా అండగా ఉంటాడని మంచి పేరు దేవుడి దయతో తెచ్చుకోగలిగాను.
- గుండెల నిండా ప్రేమతో సామాజిక వర్గాలను, ప్రాంతాలను అభిమానించాం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి మాటకు ముందు నా..నా..నా అంటూ ఆ మాటకు అర్థం చెబుతూ రూ.2.35 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశాను. 75 శాతం ఇవ్వగలిగాను.
- రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే..కేవలం ఈ నెలుగేళ్లలో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీల్లో 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాను.
- 30 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాను. 22 లక్షల ఇళ్లు ఈ రోజు వేగంగా కడుతూ కనిపిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 80 శాతం పైచిలుకు నా ..నా..నా.. అంటూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాను.
- సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ..రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్ట్‌లు ఏకంగా 50 శాతం నా..నా..నా అంటూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీలకు చట్టం చేసి మరీ ఈ రోజు ఇవ్వగలిగాను.
- స్థానిక సంస్థలు మొదలు, రాష్ట్ర కేబినెట్ వరకు ఈ రోజు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన మన రాష్ట్రంలో, మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
- బీదసాద, బడుగు బలహీన వర్గాలు అందరూ నా వాళ్లు..అంతా నా కుటుంబం. అందరి కోసమే ఈ ప్రభుత్వం అనిచెప్పి నిరూపించుకుంటూ ఈ 53 నెలలు అడుగులు వేశాను.
- విద్యా వైద్య రంగాలను చూడండి, వ్యవసాయ రంగాన్ని గమనించండి. ఈ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కుటుంబాలకు మంచి జరుగుతుందని నమ్మి ఈ మూడు రంగాల్లో గతంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాను.
- ఈ మార్పుల వల్ల పేదరికం నుంచి పైస్థానంలోకి రావాలని ఈ మూడు రంగాలను బలపరిచాను.
- సామాజంలో 60 శాతం ఉన్న రైతులు, రైతు కూలీలను, వ్యవసాయ అనుబంధ రంగాలను, మహిళా సాధికారతను గతంలో ఏఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి కూడా సహసించలేదు. ఈ రోజు ఈ వర్గాలన్నింటికి తోడుగా నిలబడ్డాను. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా చేశానని సవినయంగా చెబుతున్నాను.
- నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో నేను కళ్లారా చూసిన అన్ని వర్గాలను, వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగామని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను.
- ఈ రోజు గర్వంగా సవినయంగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నాను. మన పార్టీ తప్ప ప్రజలకు ఇచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను.
- 52 నెలల్లోనే వ్యవస్థలోనూ, పరిపాలనలో ఇన్ని మార్పులు తీసుకువచ్చిన పార్టీ దేశ చరిత్రలో మరెక్కడ కూడా లేదు..అది మన పార్టీనే అని సగర్వంగా చెబుతున్నాను.
- ఇవన్నీ కూడా చేయగలిగామంటే దానికి కారణం మీరు నాపై ఉంచిన నమ్మకం, ప్రజలు మనపై ఉంచిన నమ్మకం, ఆ దేవుడి దయ, ప్రజలందరీ చల్లని దీవెనలతో కనివినీ ఎరుగని రీతిలో మార్పులు చేశాం.
- ఇంతగా పేదల కోసం నిలబడగలిగామని సవినయంగా చెబుతున్నాను. ఇప్పటి వరకు చాలా అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో ..బహుష్య మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు ఉంటాయి. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో పాలు పంచుకుంటాను. ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలి. గ్రామ స్థాయిలో వీటిని కచ్చితంగా అమలు అయ్యేటట్టుగా మీరు పర్యవేక్షించాలి. గ్రామ స్థాయిలోకి ఈ బాధ్యతలు మీరు తీసుకెళ్లాలి. మీరు అర్థమయ్యేలా చెప్పి గొప్పగా అడుగులు పడేలా చూడాలి.
- మీ అందరి భాగస్వామ్యంతో రాబోయే నెలల్లో ఏమేమి చేస్తామో చెబుతున్నాను. మరో నాలుగు కార్యక్రమాల గురించి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను.
- 1. జగనన్న ఆరోగ్య సురక్ష:
ఈ కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి.ఈ కార్యక్రమం నవంబర్ 10 వరకు కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎందుకు తీసుకువచ్చామో దానికి కారణం ఏ ఒక్క కుటుంబం వ్యాధుల బారిన పడకూడదనే తపన, తాపత్రయంతో తీసుకువచ్చాం. ఒకవేళ వ్యా«ధిబారిన పడినా చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం. రోగాల స్థాయికి వెళ్లక ముందే పేదవాడిని కాపాడగలిగితే..ఆ కుటుంబానికి ఎంతో మంచి చేసిన వారమవుతాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో 15 వేల సచివాలయ పరిధిలో ఈ జగనన్న సురక్ష హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రతి సచివాలయం పరిధిలో క్యాంపు ఉంటుంది. కోటి 60 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఆ ఇంట్లో జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మ్యాప్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దే పరీక్షలు చేస్తున్నాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా చెయ్యి పట్టుకుని నడిపించడమే కాకుండా అన్ని రకాలుగా తోడుగా ఉంటున్నాం. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేస్తున్నాం.
గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..ఇది కేవలం ప్రివెంటివ్ కేర్ మాత్రమే కాదు..వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తూ..వ్యా«ధి నయం అయ్యేదాకా తోడుండే కార్యక్రమం ఇది.
ఐదో దశ చాలా కీలకమైంది. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి వ్యాధి నయం అయ్యేంత వరకు ఉచితంగా పూర్తిస్థాయిలో చేయూతనిచ్చే కార్యక్రమం ఇది. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వో అధికారులు, ఫ్యామిలీ డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చొరవ చూపుతున్నారు.
ప్రజల పట్ల బాధ్యత గల పార్టీగా మనం పూర్తిస్థాయిలో మమేకం కావాలి. ప్రజలకు ఎంత ఎక్కువగా చేరువ చేస్తే..ఆ ఫలాలు అంత ఎక్కువగా పేదవాడికి అందుతాయి. ఆ పేదల ఆశీస్సులు మన పార్టీకి, మనందరికీ లభిస్తాయి. గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను.
ఇక్కడ హెల్త్ క్యాంపు ఒక్కటే ఇంపార్టెంట్‌కాదు. వ్యాధి నయం అయ్యే వరకు చెయ్యి పట్టుకుని నడిపించే ఈ కార్యక్రమం బాగా జరిగేలా మీ వంతు పాత్ర మీరు పోషించాలి.
ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ జరుగుతుంది. గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ఉంటాయి. విలేజి క్లినిక్స్ ఇందులో అనుసంధానం అవుతాయి. ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం నుంచి మందులు ఇస్తూ చెయ్యి పట్టుకుని నడిపించే పాత్ర మీ వంతు మీరు పోషించండి.
ఈ కార్యక్రమం వల్ల గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వానికి, మన పార్టీకి ప్రజలు మెండుగా ఆశీస్సులు ఇస్తారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటామని చెబుతున్నాను.
2. వై ఏపీ నీడ్స్ జగన్:
మనందరి ప్రభుత్వమే మళ్లీ ప్రజలందరీ ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయడానికి, మరింత మంచి జరిగించేందుకు కొనసాగించే అవసరాన్ని వివరించడమే ఈ కార్యక్రమం. ఏపీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ నుంచి మొదలై డిసెంబర్ 10 వరకు జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమం మెరుగ్గా జరిగించాలి. ప్రతి సచివాలయానికి మనం వెళ్లాలి. ఆ సచివాలయాన్ని సందర్శించిన తరువాత రెండో కార్యక్రమం ..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లేలా శ్రీకారం చుట్టాలి.
ప్రతి సచివాలయంలో పార్టీగా, ప్రభుత్వంగా మన చేయాల్సిన నాలుగు పనులు వివరిస్తాను. సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ వివరాలు తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా పాలుపంచుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ఎంత మందికి మంచి జరిగిందో బోర్డులు ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనాలి.
మండల స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి. సచివాలయాల పరిధిలో బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న తరువాత మరోచోట అదే గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. గ్రామంలో ఉన్న స్థానిక పెద్దల ఇంటికి వెళ్లి కలవాలి. వారితో సమావేశం కావాలి. వారి ఆశీస్సులు, దీవెనలు తీసుకోవాలి.
52 నెలల పాలనలో మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చామో ప్రతి అంశాన్ని మండల నాయకత్వం అర్థం చేసుకొని గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వంతో పాటు ప్రజలకు వివరించాలి.
మరుసటి రోజు ఇంటికి వెళ్లే కార్యక్రమానికి గ్రామ స్థాయిలో శ్రీకారం చుట్టాలి. సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వలంటీర్లు ప్రతి ఇంటిని విధిగా సందర్శించాలి. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అర్థమయ్యేలా చెప్పాలి. 2019లో మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం కాబట్టి మేనిఫెస్టోను చూపించాలి. ప్రతి ఇంటికి జరిగిన మంచి గురించి చెప్పాలి. రాష్ట్రంలో జరిగిన మంచిని వివరించాలి. మనం పూర్తి చేసిన వాగ్ధానాలు వివరించాలి.
ఒకవైపు వలంటీర్ ఈ విషయాలను ప్రతి గడపలో చెబుతున్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను, ప్రతి వాగ్ధానాన్ని ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలి. టీడీపీ, దత్తపుత్రుడు ప్రతి ఇంటికి అప్పుడు ఏరకంగా లెటర్లు పంపించారో ప్రజలకు వివరించాలి. ఇటువంచన తరువాత ఇటువంటి వ్యక్తులను నమ్ముతామా అని మన గృహ సారధులు చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లాలి. పేదల ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఏరకంగా మంచి చేశామో చెప్పాలి. మోసపోకండి అని ప్రజలకు చెప్పాలి. మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు.
3. బస్సు యాత్రలు:
ఈ నెల 25న మొదలై డిసెంబర్ 31 వరకు దాదాపుగా 60 రోజులు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి. ఈ బస్సు యాత్రల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, సీనియర్ నాయకులు ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ మీటింగ్‌లు ఆ నియోజకవర్గాల్లో జరుగుతాయి. మూడు ప్రాంతాల్లో మూడు మీటింగులు జరుగుతాయి. ప్రతి రోజు రాష్ట్రంలో మూడు మీటింగ్‌లు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మీటింగ్ పెడతారు. ప్రభుత్వం చేసిన మంచి గురించి, మహిళా సాధికారత, మారిన మన స్కూళ్లు, ఆసుపత్రులు, వ్యవసాయం గురించి, అభివృద్ధి గురించి, తీసుకువచ్చిన మార్పుల గురించి వివరిస్తారు. సాయంత్రం మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్ మీటింగ్‌లు ఉంటాయి. బస్సుపై నుంచే ప్రసంగిస్తారు. మన పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీనాయకులు ఎమ్మెల్యేల అధ్యక్షతన ప్రసంగిస్తారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే లేదా, సమన్వయకర్త అధ్యక్షత వహిస్తారు.
బస్సు యాత్రలో మీరంతా పాల్గొనాలి. మమేకం కావాలి. ఇది మామూలు బస్సు యాత్ర కాదు. ఇది సామాజిక న్యాయ యాత్ర. పేద సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లే యాత్ర. పేదలకు మంచిని వివరించే యాత్ర, పేదవాడి తరఫున నిలబడే యాత్ర. రాబోయే కురక్షేత్ర సంగ్రామంలో జరుగబోయే యుద్ధం..పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరుగబోయే యుద్ధం ఇది. ఆ పేదవాడి పార్టీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో 60 రోజుల్లో 175 నియోజకవర్గాల్లో మీటింగ్‌లు జరుగుతాయి. సభలు జరుగుతాయి. నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, ఓసీలోని నా నిరుపేదలు..రేపు పొద్దున జరుగబోయేది క్లాస్ వార్..పేదవాడు ఒకవైపు..పెత్తందార్లు మరోవైపు ఉంటారు. ఇందులో పేదవారంతా ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను గట్టిగా ఎదుర్కుంటాం. మన జెండా మోసేది..ప్రతి మీటింగ్‌లోనూ ఆ పేదవాడే పాల్గొంటాడు.
4. ఆడుదాం..ఆంధ్ర:
డిసెంబర్ 11వ తేదీ నుంచి ఆడుదాం..ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుంది. సంక్రాంతి వరకు జనవరి 15 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం..ఆంధ్ర..ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహిద్దాం. మన దేశ టీమ్‌లో వైనాట్ ఏపీ అన్నట్లుగా సాగాలి. గ్రామ వార్డు సచివాలయాల్లో మొదలు మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమంలో మీరంతా తప్పకుండా భాగస్వాములు కావాలి. మరుగున పడి ఉన్న మన పిల్లల ట్యాలెంట్‌ను దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దేశ టీమ్‌లో వై నాట్ ఏపీ అన్నట్లుగా ప్రతి క్రీడలోనూ మనపిల్లలు ఉంటారు.
- ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా జనవరి 15 వరకు జరిగే ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా జనవరి 1వ తేదీన ఇక్కడి నుంచి మరో మూడు కార్యక్రమాలు మొదలవుతాయి. జనవరి 1న నా అవ్వ తాతలకు, వితంతువు అక్కచెల్లెమ్మలకు పింఛన్ పెంపు కార్యక్రమం 3 వేల దాకా పెంచుకుంటూ పోతామని చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.3 వేల వరకు పింఛన్‌ను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం. ఈ కార్యక్రమం 10 రోజుల వరకు జరుగుతుంది. గ్రామ స్థాయిలో సంబరాలు జరగాలి. మీరంతా ఈ సంబరంలో మమేకం కావాలి. గ్రామస్థాయిలో అవ్వతాతలు, అక్కచెల్లెమ్మల సంతోషంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. మైక్ పట్టుకుని మరీ మీరు చెప్పాలి. ఎన్నిలకు మూడు నెలల ముందు జగనన్న రాకముందు అవ్వా..మీ పింఛన్ ఎంతా అని అడగాలి. రూ.1000 ఇచ్చారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్‌ను రూ.2,500లకు తీసుకెళ్లారు. రూ.3 వేలకు పింఛన్ పెంచుతానని మాట ఇచ్చింది గుర్తు చేయాలి. మనం అధికారంలోకి రాకముందు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్‌ఇచ్చారు. ఇప్పుడు 63 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారని చెప్పాలి.
- పింఛన్ల ఖర్చు గతంలో కేవలం రూ.400 కోట్లు ..ఈ రోజు చిరునవ్వుతో మీ బిడ్డ పింఛన్ల కోసం నెలకు రూ.2000 కోట్లు భరిస్తున్నాడు. ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వు చూస్తూ జగనన్న మీకు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారన్న సందేశాన్ని తీసుకెళ్లాలి.
- జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం ..వైయస్‌ఆర్ చేయూత కార్యక్రమం మొదలవుతుంది. జనవరి 20వ తేదీ దాకా ప్రతి గ్రామంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అక్షరాల మూడు దఫాల్లో రూ.14,109 కోట్లు ఇచ్చాను. మరో 5 వేల కోట్లు కలిపితే..మొత్తంగా అక్షరాల రూ.19 వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. ప్రతి ఏటా రూ.18,750 అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. వారికి బ్యాంకు రుణాలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేయించాం. అక్కచెల్లెమ్మల పండుగలో మీరంతా భాగస్వాములు కావాలి.
- జనవరి 20 నుంచి 30వ తేదీ వరకు వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమం ఉంటుంది. చివరి విడత నిధులను జగన్ మాటిచ్చాడు..మాట నిలబెట్టుకున్నాడు..మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని చెప్పాలి. నాలుగు దఫాల్లో మీ రుణాలు చెల్లిస్తానన్న మాటను జగనన్న నిలబెట్టుకున్నాడని చెప్పాలి. ఈ రోజు పొదుపు సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, జగనన్నకు ఆశీస్సులు ఇవ్వాలని అక్కచెల్లెమ్మలకు వివరించాలి. ఇప్పటికే రూ.1970 కోట్లు ఇచ్చాను. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు ఇచ్చి ప్రతి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా రూ.26 వేల కోట్లు వైయస్‌ఆర్ ఆసరా ద్వారా, సున్నా వడ్డీ ద్వారా మరో 5 వేల కోట్లు ఇచ్చాను. పొదుపు సంఘాలకే అక్షరాల రూ.31 వేల కోట్లు ఇచ్చాను. పొదుపు సంఘాల ఆశీస్సులు తీసుకోవాలి.
- ఫిబ్రవరిలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిని చేసుకుందామని, ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను తీసుకెళ్దాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుదాం. మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన ఇంటింటా అందరికీ తెలియజేసే బాధ్యతను మీ భుజస్కందాలపై మోపుతున్నాను. మీరందరూ కూడా మండల స్థాయి నుంచి పైస్థాయిలో ఉన్నారు. ప్రతి కార్యక్రమం బాగా జరిగేలా చూసే బాధ్యత మీదే. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. గృహసారధులు, వలంటీర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీటిపై అవగాహన కల్పించి అందరిని ఒక తాటిపైకి తీసుకురావాలి. అందరిని అడుగులు ముందుకు వేయించే బాధ్యత మీ భుజస్కందాలపై మోపుతున్నాను.
- ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుంచి అందరిని పిలువలేకపోయినా కూడా అనేక మంది నా సేనానులు ఇంటి వద్దనే ఉండి ఇక్కడికి రాలేకపోయినా కూడా..వారందరూ కూడా నా దళపతులే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. అందరిని కూడా పేరు పేరునా అభ్యర్థిస్తున్నాను. మీరంతా కూడా నేను ప్రస్థావించిన అంశాలను అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- జరుగబోయే ఎన్నికల సంగ్రామంలో మన పొత్తు ప్రజలతోనే..మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తరువాత ప్రజలను నేరుగా నమ్ముకున్నాడు. మన పొత్తు ప్రజలతోనే నేరుగా ఉంటుంది. మన ధైర్యం దేవుడి దయతో ప్రజలకు చేసిన మంచి, ఇదే మన ధైర్యం, ఇదే మన ఆత్మ విశ్వాసం.
- ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాలు ఇప్పటికే 99 శాతం అమలు చేసిన ప్రభుత్వం మనది. ఇది మన ధైర్యం..రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనది. నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించాను. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
- సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ అందే పింఛన్లు, రేషన్ బండి, బర్త్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, మారుతున్న స్కూళ్లు, ఆసుపత్రులు, గ్రామస్థాయిలో మనకు కనిపించే ఆర్‌బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఇలా మనం అమలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవమే. ఇంతకుముందు ఎప్పుడు జరగనట్లుగా జరిగించాం. ఎవరైనా కలలో అనుకున్నారా? ఇటువంటివి సాధ్యమవుతాయా అని ఎవరైనా అనుకున్నారా? లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ వస్తుందని ఎవరైనా కల కన్నారా?. గ్రామ స్థాయిలో అర్హతే ప్రమాణికంగా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతాయని గతంలో ఎవరైనా అనుకున్నారా? అలాంటి విప్లవం మన సొంతం. ఇది జగనన్న ప్రభుత్వం వల్ల జరిగిన మార్పు.
- నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే. మనం ఇంటింటికీ అందించిన సంక్షేమం..ఆ ఇంటికి అందించిన మంచిని ఒక లేఖ తీసుకెళ్లి..వారి ఆశీస్సులు అడిగిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడైనా, ఎవరైనా చేశారంటే అది మన పార్టీనే అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది కూడా ఒక విప్లవమే.
- మన మాదిరిగా ఎన్నికలు అయిన తరువాత కూడా నాయకులు నిరంతరం జనంలో ఉన్నది మన పాలనలోనే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కొంత తిట్టుకున్నా..ఇప్పుడు మాత్రం వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మన ప్రభుత్వం చేసిన మంచే మన బలం. మన బలం కోవిడ్ సమయంలో కూడా ఖర్చులు పెరిగిన సమయంలో కూడా సాకులు చెప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టమైన నష్టమైనా చిరునవ్వుతో ప్రజలకు మంచి చేశాం.
- మన బలం మాట నిలబెట్టుకోవడం, మన బలం విశ్వసనీయత నిలబెట్టుకోవడం, ఎస్సా, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మనసుతో చేసిన మంచినే మన బలం. రైతులు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు చేసిన మంచినే మన బలం. వ్యవసాయంలో తీసుకువచ్చిన మార్పులు, విద్యా వైద్య రంగాల్లో మనం తీసుకువచ్చిన మార్పులే మన బలం. డిసెంట్రలైజేషన్‌తో పారదర్శక పాలనతో లంచాలు లేని వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడమే మన బలం. ఈ విషయాలన్నీ కూడా గడప గడపకు కార్యక్రమంలో చూశారు. ఇన్ని బలాలతో మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని ఎల్లప్పుడు గుర్తించుకోండి. ప్రతి ఇంటిలో మనం చేసిన మంచినే కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం ఇళ్లలో మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ జరిగిన మార్పు కనిపిస్తుంది. ఈ మార్పును మరి వై నాట్ 175 అని అడుగుతున్నాను. మన గురించి గిట్టని వారు అనవచ్చు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ మార్పు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో వై నాట్ 175 అని ఎందుకు అడగకూడదు.
- మరొక్క విషయం కూడా చెబుతున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్న, జైల్లో ఉన్నా పెద్ద తేడా కనిపించదు. కారణం ఏంటంటే ఆయనకు క్రెడిబులిటి లేదు. ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే. చంద్రబాబు పాలన, పార్టీని చూసినప్పుడు పేదవాడికి గుర్తుకు వచ్చేది ఒక్కటే మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలు, వంచనలు ప్రజలకు గుర్తుకు వస్తాయి.
- మన పార్టీని చూసినప్పుడు, మన పాలనను చూసినప్పుడు ప్రతి రైతుకు, ప్రతి అక్క చెల్లెమ్మకు సామాజిక న్యాయం గుర్తుకు వస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం గుర్తుకు వస్తుంది. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ గుర్తుకు వస్తుంది.
- అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్న సమయంలో సెల్‌ఫోన్ ఐదుసార్లు ఊపినా, ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా కూడా పోలీసులు వారి వద్ద ఉంటారు. రాష్ట్రంలో మంచి పోలీసు అన్న, జగనన్న ఆ మహిళలకు గుర్తుకు వస్తుంది.
- చంద్రబాబును ఎవరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబుపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఆయన అరెస్టు కూడా జగన్ దేశంలో లేనప్పుడు, జగన్ లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు. చంద్రబాబును ఎవరు కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికే అంటున్నాడు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్‌కం ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిని నిరూపించింది. దోషులను అరెస్టు కూడా చేసింది. చంద్రబాబు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేంద్రం నోటీసులు ఇచ్చింది. సీబీఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అనుమతులు కూడా ఇవ్వలేదు. ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన చంద్రబాబుపై విచారణ చేయకూడదట. ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట. కోర్టులు ఆధారాలతో రిమాండుకు పంపినా కూడా చంద్రబాబును కానీ, గజదొంగల ముఠా వీరప్పను చట్టాలకు పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ఆలోచన చేయండి.
- మరొక్క విషయం ప్రజల్లోకి వెళ్లి తెలియజేయాలి. చంద్రబాబును సమర్ధించడం అంటే రాష్ట్రంలోని పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అని ప్రజలకు వివరించాలి. పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే చంద్రబాబును సమర్ధించినట్లే. పెత్తందారి వ్యవస్థను, నయా జమీందారి తనాన్ని సమర్ధించినట్లే. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా చూసిన చంద్రబాబుకు సమర్దించడం అంటే వారికి పేదవర్గాలు ఎప్పుడు పేదలుగా, కూలీలుగా ఉండాల్సినట్టే. చంద్రబాబు మనస్తత్వం ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? బీసీల తోకలు కత్తరిస్తానంటాడు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
పొత్తుల విషయం:
మన ప్రతిపక్షాలు అన్ని కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. ఎంత మంది కలిసినా కూడా ..రెండు సున్నాలు కలిస్తే..నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నానే. ప్రజలకు వారు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి..ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే. వారి మీద వారికి నమ్మకం ఉంటే..ఒకరు 15 సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఇవాళ్టికి ఒక అభ్యర్థి లేదు. జెండా మోసేందుకు కార్యకర్తలు లేరు. ఆయన జీవితమంతా కూడా చంద్రబాబును భుజానికి ఎత్తుకోవడం. చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడంలో ఆయన పార్ట్‌నర్. ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. నిజంగా ప్రజలకు మంచి చేయాలి. నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలని ఆలోచన చేసే మనస్తత్వం వీరికి లేదు. దోచుకున్న దాంట్లో చాకెట్లు పంచినట్లు పంచుకుంటున్నారు. తింటున్నారు. ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని వీరికి తెలియదు. చనిపోయిన తరువాత ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలనే ఆలోచన లేదు. వీరికి తెలిసిన రాజకీయమంతా కూడా అధికారంలోకి రావడం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. ఇది కాదు రాజకీయమంటే..చనిపోయిన తరువాత ప్రతి మనిషి గుండెలో బతికి ఉండటమే. ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండటం రాజకీయం అన్నది మనకు తెలిసిన రాజకీయం.
ఈ రోజు మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు. అందుకే మీ బిడ్డ దేవుడిని నమ్ముకున్నాడు. మంచి చేసిన ప్రజలను నమ్ముకున్నాడు. రాజకీయ చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరూ కూడా అనని మాటలు మీ బిడ్డ అంటున్నాడు. ప్రతి మీటింగ్‌లోనూ మీ బిడ్డ చెబుతున్నాడు. అబద్ధాలు, మోసాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీరే మీ బిడ్డకు సైనికులుగా మారండి అని చెబుతున్నాడు. రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఈ విధంగా అడగలేదు. ఈ రోజు మన ధైర్యం మనం చేసిన మంచి. ఆ మంచి ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అందుకే వై నాట్ 175 పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తున్నాను.
ఈ రోజు నేను చెప్పిన మాటలు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గ్రామస్థాయిలో మన çసచివాలయ కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గృహసారధులు, వలంటీర్లు, మన కార్యకర్తలు, మనల్ని అభిమానించే అందరిని సమాయత్తం చేయండి. ప్రతి విషయాన్ని అందరికి చెప్పండి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రతి గ్రామంలో మన పార్టీ జెండాను రెపరెపలాడించాలి.ప్రతి ఒక్కరి ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ..మీ అందరికీ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ సందేశాన్ని చేరవేయాలని మనసారా కోరుతూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.