ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా లోకేశ్
మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను చేపట్టడం ఇది రెండోసారి. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రి పదవులు నిర్వహించిన వారిలో లోకేశ్ మూడో వ్యక్తి. లోకేశ్ 2016లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖమంత్రి శాఖలను నిర్వహించారు. మంగళగిరిలో ఐటీ పార్కును ఏర్పాటు చేయించి కొన్ని ఐటీ పరిశ్రమలను మంగళగిరి, గన్నవరం ప్రాంతాలకు తీసుకొచ్చారు. మంగళగిరిని ఐటీ హబ్‌గా, మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేశారు. మంగళగిరి నియోజకవర్గంపై అవగాహన ఏర్పాటు చేసుకున్న లోకేశ్ దేశంలోనే మంగళగిరిని ఓ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మంత్రి కావడం మంగళగిరి ప్రజల అదృష్టంగానే భావించాలి. లోకేశ్.. తనకు 53,350 ఓట్ల మెజారిటీ కావాలని అభ్యర్థించగా 91,500 ఓట్ల రికార్డు మెజారిటీని ఇచ్చి ఘనంగా ఆశీర్వదించారు. దీంతో మంగళగిరి అభివృద్ధిపై లోకేశ్ పట్టుదల మరింతగా పెరిగింది. మంగళగిరిలో సాధ్యమైనన్నీ ఐటీ పరిశ్రమలను నెలకొల్పడంతో పాటు ఇతర ఉపాధి పరిశ్రమలను ప్రోత్సహించాలని లోకేశ్ భావిస్తున్నారు. మంగళగిరిని గోల్డ్‌హబ్‌గా మార్చి వేలాదిమంది స్వర్ణకారులకు చేతినిండా పని కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. మంగళగిరి చేనేత ఉత్పత్తులకు జాతీయస్థాయిలో మంచి ప్రాచుర్యాన్ని తీసుకురావడంతోపాటు మరిన్ని వీవర్స్‌శాలలను స్థాపించి నేతన్నలను అన్నీవిధాలుగా ఆదుకునేందుకు కార్యాచరణను చేపట్టారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.
నాడు స్పీకర్.. నేడు మంత్రిగా నాదెండ్ల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతిగా చేసిన నాదెండ్ల మనోహర్‌కు నూతన మంత్రివర్గంలో మంత్రిగా పదవి లభించింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడైన మనోహర్ రాజకీయ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెనాలి నుంచి మూడోసారి విజయం సాధించిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మంత్రిగా అవకాశం దక్కటంతో తెనాలిలో ఆనందం వెల్లువెత్తుతోంది. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మనోహర్ తొలిసారిగా 2004 ఎన్నికల్లో తెనాలి నుంచే కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2009 లోనూ కంగ్రెస్ తరపునే పోటీలో నిలిచి రెండోసారి కూడా విజయాన్ని దక్కించుకున్నారు. అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన అపజయం పొందారు. 2019 ఎన్నికల నాటికి జనసేనలో చేరి, పోటీలో నిలిచి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున తెనాలి సీటును దక్కించుకున్న ఆయన గతంలో తెనాలి ఎన్నికల చరిత్రలో ఎవరికీ దక్కనంతగా 48,112 మెజారిటీ సాధించారు. తమ ఎమ్మెల్యే మంత్రి అయ్యారని అభివృద్ధి విషయంలో తెనాలి దశ మారిపోతుందన్న సంతోషంలో జనం ఉన్నారు. మనోహర్‌కు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తీర ప్రాంతం నుంచి అనగానికి..
హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు అమాత్యయోగం దక్కింది. బీఎస్సీ, కంప్యూటర్స్ చదవిని సత్యప్రసాద్ మాజీ ఆర్థిక మంత్రి అనగాని భగవంతరావు సోదరుడు రంగారావు కుమారుడు. తీర ప్రాంత నియోజకవర్గమైన రేపల్లె నుంచి సత్యప్రసాద్ 2014, 2019, 2024లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. బాపట్ల జిల్లా పరిధిలోనే అనగాని 40వేల పైచిలుకే అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. సత్యప్రసాద్‌కు మంత్రిగా అవకాశం దక్కడంతో తీరప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైసీపీ సునామీలో కూడా రేపల్లె నుంచి ఆయన అత్యధిక మెజార్టీతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజయకేతనం ఎగురవేశారు. తీర ప్రాంతంలో అప్పట్లో కూచినపూడి నుంచి టీడీపీ తరపున గెలిచిన ఈవూరి సీతారావమ్మ మంత్రి పదవి నిర్వహించగా ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో రేపల్లె నుంచి గెలిచిన సత్యప్రసాద్‌కు మంత్రి పదవి దక్కింది.
ఓటమెరుగని రవి.. మంత్రిగా
ఓటమెరుగని నేతగా కీర్తి గడించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తొలిసారిగా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది. వైసీపీ హయాంలో ఆయనను రకరకాలుగా వేధించారు. క్వారీలు మూయించారు.. వందల కోట్ల జరిమానాలు విధించారు.. కేసులు పెట్టారు.. పార్టీ మారాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు పెట్టారు.. వైసీపీ వేధింపుల ధాటికి పూర్తిగా వ్యాపారాల నుంచే తప్పుకునే పరిస్థితి రవికుమార్‌కు ఏర్పడింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారనే పేరును అటు కార్యకర్తల్లోనూ, ఇటు పార్టీ అధినేత దగ్గర రవికుమార్ తెచ్చుకోగలిగారు. గొట్టిపాటి కష్టాలను గుర్తించిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అద్దంకి నుంచి గొట్టిపాటి వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గొట్టిపాటి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నియోకవర్గాల పునర్విభజన అనంతరం అద్దంకి నుంచి 2009, 2014, 2019, 2024లో గెలుపొందారు.