సీతారాముల కళ్యాణం.. చూతము రారండి
దుష్టశిక్షణ – శిష్టరక్షణే ధ్యేయం
హిందువులకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి శ్రీరామ నవమి. స్వామివారి పెళ్లి తర్వాతే ఇంట్లో పెళ్లి జరపాలన్నది హిందువుల నియమం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 ఏళ్ల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని హిందువుల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయినా ఆయనకు సంతానం లేదు. సంతానం లేకుంటే రాజ్యానికి వారసులుండరని ఆయన బాధపడుతుండే వారు. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు.
కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని ఆశించాడు.
సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా రాముడు, ఆయన సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో శోభా యాత్ర సాగిపోతుంది.
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.
ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది పురాణ,ఇతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.
రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ అత్యంత జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరణార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరాముడి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో హాజరవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం లాంఛనాలతో శ్రీరాముడి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ రామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచాలి.
శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృత అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను తప్పనిసరిగా ధరించాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది.
నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
పానకం ఎలా చేయాలో చూద్దాం.. కావలసిన పదార్థాలు : బెల్లం – 3 కప్పులు మిరియాల పొడి – 3 టీ స్పూన్లు, ఉప్పు : చిటికెడు, శొంఠిపొడి : టీ స్పూన్, నిమ్మరసం : మూడు టీ స్పూన్లు, యాలకుల పొడి : టీ స్పూన్ నీరు : 9 కప్పులు తయారీ విధానం : ముందు బెల్లాన్ని మెత్తగా కొట్టుకుని.. నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం సిద్ధమైనట్లే.
అలాగే వడపప్పు ఎలా చేయాలంటే.. కావలసిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు, కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత
తయారీ విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ అయినట్లే. ఈ ప్రసాదాలను స్వామివావికి నివేదన చేసి భక్తులకు వితరణ చేయాలి.