అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా- నారాయణ తోడు దొంగల దోపిడీ
-అంకంరెడ్డి నారాయణమూర్తి
ఇన్నర్ రింగ్ రోడ్డే లేకపోతే, పెద్ద కుంభకోణం జరిగి, దోపిడీకి ఎవరైనా ఎలా పాల్పడతారంటూ, అలాంటివేమీ మాకు తెలియదంటూ బుకాయిస్తున్న, అమరావతి భూ దోపిడీలో నారా-నారాయణ తోడుదొంగలై భారీ లబ్ది పొందేందుకు అలైన్మెంట్లో మూడుసార్లు మార్పులు చేసి ఖరారు చేశారని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. వాస్తవానికి సిఆర్డిఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం అమరావతి నుంచి కృష్ణా నదిపై వంతెన నిర్మించి, దానిపై నుండి నున్న, అక్కడ నుంచి ఎనికేపాడు మీదుగా తాడిగడప, ఆపై పెదపులిపాక నుండి కృష్ణా నదిపై మరో వంతెన గుండా నూతక్కి, ఆపై చినకాకాని, అక్కడి నుండి అమరావతికి రింగ్ రోడ్ నిర్మించాల్సి ఉన్నది. అలా నిర్మిస్తే కృష్ణా జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి రావడంతో విద్యాసంస్థల అధినేత, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సిఆర్డిఏ అధికారులపై తీవ్ర ఆగ్రహ వేషాలతో, పరుష పదజాలంతో దూషించి, అలైన్మెంట్ ను మూడు కిలోమీటర్లు తూర్పు దిశగా మార్పించారన్నారు. దీనితో గుంటూరు జిల్లాలోని రామచంద్రపురం – కృష్ణాజిల్లాలోని చోడవరంల మధ్య నదిపై వంతెన వచ్చి, అక్కడ నుండి పెనమలూరు మీదుగా నిడమానూరు నుండి నున్న వరకు కొత్త రింగ్ రోడ్డు అలైన్మెంట్ రావడంతో, నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యాసంస్థల భవనాలను ఆనుకొని వెళ్లేలా, తమ ఆస్తుల విలువ అమాంతంగా పెరిగేలా ఐ ఆర్ ఆర్ అలైన్మెంట్ను ఖరారు చేశారన్నారు.
అసలు ఐ ఆర్ ఆర్ అలైన్మెంట్ను గాని, అమరావతి మాస్టర్ ప్లాన్ గాని అధికారికంగా ప్రకటించడానికి ఏడాది ముందునుండే కొండపల్లి, నున్న, నిడమానూరు, పోరంకి తదితర ప్రాంతాలలోని 70 లేఔట్లకు అనుమతులు తిరస్కరించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవన నిర్మాణాల అనుమతులను సైతం తిరస్కరించడం ద్వారా, చంద్రబాబు – నారాయణ లు ఒక ప్రణాళిక ప్రకారం, ముందే తాము రూపొందించుకున్న అలైన్మెంట్ ప్రకారం భారీ లబ్ది పొందేందుకేనని సిఐడి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు. కంతేరుల వరకు వెనక్కి లాగి, వంకర టెంకర్ గా మళ్ళించి, లింగమనేని రమేష్ 355 ఎకరాల మధ్యలో నుంచి వచ్చేలా, అందులో హెరిటేజ్ భూములు, నారాయణ కాలేజీల పక్కగా వెళ్లేలా, అలైన్మెంట్ ప్లాన్ మార్చారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తాడిగడప నుండి తూర్పుగా వెనక్కి లాగి పెనమలూరుకు, గుంటూరు జిల్లాలో చినకాకాని నుండి దక్షిణంగా వెనక్కి లాగి కాజ, కంతేరు వరకు ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పచ్చ బ్యాచ్, వారి బినామీల భూముల విలువ అమాంతంగా పెంచుకునేందుకు, వాటిని తిరిగి అమ్ముకోవడం ద్వారా వందల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారన్నారు. చంద్రబాబు, నారాయణ, హెరిటేజ్ సంస్థ, లింగమనేని రమేష్ తదితరులు తొలుత ఎకరం రూ 4 లక్షల నుండి, రూ 10 లక్షల లోపు కు కొని, తిరిగి రింగ్ రోడ్డు అలైన్మెంట్ వారి భూముల దగ్గరకు రప్పించుకొని, భూ విలువలు భారీగా పెంచుకోవడం ద్వారా, తిరిగి వాటిని వేరే కంపెనీలకు ఒక్కో ఎకరం రూ 30 లక్షల నుండి రూ 2 కోట్లు వరకు అమ్ముకొని, వందలాది కోట్లు కొట్టేశారన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తుంటే రింగ్ రోడ్డు నిర్మాణం జరగకపోయినా, అలైన్మెంట్ మార్పు పేరుతో భారీ అవినీతికి వీళ్ళు పాల్పడ్డారా?.. లేదా?.. అనేది ప్రజాకోర్టులో ముందుగా తేలుతుంది. ఆపై అసలు కోర్టుల్లో తప్పక వీరి అవినీతి బాగోతం బయటపడి అందరిని శిక్షించబడక తప్పదని నారాయణమూర్తి అన్నారు.
అమరావతి భూ సమీకరణలో, అసైన్డ్ భూముల దురాక్రమణలో, స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఐ.ఆర్.ఆర్, అంగళ్లు విధ్వంసం కేసుల్లో A-1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A-2, A-14 గా ఉన్న నారాయణ, లోకేష్ లు దర్యాప్తు సంస్థలకు, కోర్టులకు సహకరించి, తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా, రాజధాని రైతుల, పేదల పొట్టగొట్టి, ఇన్నిన్ని అక్రమాలకు, అవినీతికి చంద్రబాబు పాల్పడితే, అదృష్టవశాత్తు 2019లో జగనన్న ప్రభుత్వం రాబట్టి, ఇవన్నీ బయటకు తెలిశాయని, వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసి, వ్యవస్థలపై విశ్వాసాన్ని పోగొడితే, పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు 50 వేల మంది పేదలకు అక్కడే ఇళ్ల స్థలాలను ఇచ్చి, శాసన రాజధాని అమరావతిలో జనాభాను పెంచడం ద్వారా, మళ్లీ ప్రజల్లో విశ్వాసాన్ని నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.
-అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్