నిర్ణీత వ్యవధిలో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తాం
విజయవాడ, తేదీ: 21-06-2023.
— బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావజాలాన్ని, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం మేరకు 125 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
బుధవారం స్వరాజ్ మైదానం లో విగ్రహ ప్రతిష్టాపన స్థలంలో విగ్రహ నిర్మాణ పనులను సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ విగ్రహం ప్రతిష్టించలేదన్నారు. 80 అడుగుల పెడస్టల్ పై 125 అడుగుల విగ్రహం నిర్మిస్తున్నామన్నారు.
దేశ చరిత్రలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఇంత భారీగా ప్రతిష్టించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రయత్నాన్ని రాష్ట్రంలోని దళితులందరూ అభినందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితులందరికీ దక్కిన గౌరవం అన్నారు. ఈ ప్రాంతంలో రూ. 400 కోట్ల ఖర్చుతో విగ్రహ ప్రతిష్ట మాత్రమే కాకుండా అంబేద్కర్ జీవిత చరిత్ర మ్యూజియం, ఆయన జీవిత కాలంలో కొన్ని వస్తువులతో ప్రదర్శనశాల కూడా ఈ ప్రాంగణంలో నిర్మిస్తున్నారన్నారు. విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న బందరు రోడ్డులో ఎంతో విలువైన స్థలాన్ని అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు కేటాయించడం దళితుల పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుందన్నారు. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కూడా పనులు వేగంగా జరగడానికి ఒక కారణమన్నారు. తాను కూడా పనుల పురోగతిపై తరచుగా సమీక్షలు చేస్తున్నానన్నారు. ప్రధానంగా ఈ విగ్రహ నిర్మాణ ప్రాంతం దేశంలోనే ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దేశంలోని అంబేద్కర్ వాదులందరూ ఈ విగ్రహప్రతిష్ట నిర్ణయాన్ని ప్రశంసించారని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. అనంతరం విగ్రహ నిర్మాణ పనులను అధికారులతో సమీక్షించారు. విగ్రహ నిర్మాణం పనుల పరిశీలనలో మంత్రితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయలక్ష్మి ఆ శాఖ డైరెక్టర్ పి విజయ కృష్ణన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు ఉన్నారు