పోస్టల్ బ్యాలెట్లకు 7,8 తేదీల్లో మరో అవకాశం
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్
రూ.450 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువుల సీజ్
సున్నిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
విజయనగరం, మే 05: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్‌లు, క్యూలెన్లు, పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏర్పాట్లపట్ల ఉద్యోగులు సిఇఓ వద్ద సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో పోస్టల్ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, ఎన్నికలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి వివరించారు.
ఈ సందర్భంగా సిఇఓ మీనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం ధరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి, ఓటు పొందవచ్చునని సూచించారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7,8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. అన్నిఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తయ్యిందన్నారు. వివిధ విభాగాలనుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సి-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు సుమారు 16000 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99 శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వయంగా తమ కార్యాలయానికే 500 ఫిర్యాదులు అందాయని, వీటిలో 450 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా సంబంధిత పోస్టులను ఆ సోషల్ మీడియా వేదికల నుంచి తొలగిస్తున్నామని, సంబంధిత పార్టీ లేదా అభ్యర్ధిపై కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.450కోట్లు విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రతీ మండలంలో మండల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రమ మద్యం రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. మద్యం ఉత్పత్తి కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లవద్ద సిసి కెమేరాలను ఏర్పాటు చేశామని, వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసి, మద్యాన్ని ఎక్కడికి రవాణా చేస్తున్నదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి మన రాష్టంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 12,400 సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, కేంద్ర బలగాలను వినియోగించడం, మైక్రో అబ్జర్వర్ల నియామకం, వీడియో గ్రఫీ తదితర చర్యలను చేపడుతున్నట్లు వెళ్లడించారు. ఇవే కాకుండా రాజకీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు సూచనల మేరకు, అదనపు భద్రతా చర్యలు చేపట్టామని, వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ రోజు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎండ తగలకుండా క్యూలైన్ల వద్ద నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు, వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్రాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు కూడా ఎండ నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిఇఓ మీనా సూచించారు.
సిఇఓ ముఖేష్‌కుమార్ మీనా పర్యటనలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ ఎస్డి అనిత, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ కె.సందీప్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి ఏ.కల్యాణచక్రవర్తి, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి సుధారాణి, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.