కవి కరీముల్లా సామాజిక వ్యాసం
ముస్లిం స్త్రీ–చైతన్యం
నేటి పురుషాధిక్య వ్యవస్థలో అన్ని సమాజాల్లోనూ స్త్రీలు వివక్షత ఎదుర్కొంటున్నారు.కేవలం ముస్లిం స్త్రీలు మాత్రమే అణిచివేతకు గురవుతున్నారనేది దుష్ప్రచారం మాత్రమే.ముస్లిం స్త్రీల సామాజిక వెనుకబాటుతనానికి మూల కారణం అవిద్య.”ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు మహిళలకూ వున్నాయని”పవిత్ర ఖుర్ఆన్ ఘోషించినా పురుషాహంకారం స్త్రీని కట్టడి చేస్తుంది.ధార్మిక పరిజ్ఞానం లేని కొంతమంది అవలంబించే విధానాలు ముస్లిం సమాజంపై అపోహలను పెంచుతున్నాయి.
ఇస్లాం అత్యంత ప్రగతిశీల ధర్మం.వరకట్నాన్ని నిషేధించి స్త్రీ ఆర్థిక భధ్రత కొరకు పురుషుడు ఖచ్చితంగా మహర్ చెల్లించాలని చెప్పింది.ఆర్థికంగా పురుషుడిపై ఆధారపడే దుస్థితి నుండి తప్పించేందుకు తండ్రి ఆస్థిలో,భర్త ఆస్థిలో,కుమారుని ఆస్థిలో,సోదరుని ఆస్థిలో హక్కును కల్పించింది.ఇస్లాం పురుషుల్లోనూ ,,స్త్రీలల్లోనూ శీల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.అలాగని శీలం ముసుగులో భర్త చనిపోయిన స్త్రీ జీవితాంతం విధవగా ఉండాలనే దురాచారాన్ని తిరస్కరించి వితంతు వివాహాలను ప్రోత్సహించింది.భ్రూణ హత్యలను నిరోధించింది.ఆడపిల్ల పుట్టగానే ఎడారిలో సజీవంగా పాతిపెట్టే అరబ్బులు దురాచారాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) తుత్తునియలు చేశారు.ఎవరైతే ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూస్తారో, విద్యాబుద్దులు,వివాహాది కార్యాలు ఎటువంటి అరమరికలు లేకుండా నిర్వహిస్తారో అటువంటి తల్లిదండ్రులకు స్వర్గం లభిస్తుంది అని ప్రవక్త బోధించారు.ఆచరణలో ముస్లిం సమాజం విస్మరించటం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి.ఇస్లాం వెలుగులో ముస్లిం పురుష ప్రపంచాన్ని మార్చేందుకు ముస్లిం స్త్రీలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.”జ్ఞానార్జన ముస్లిం స్త్రీ,పురుషుల విధియై ఉన్నది”అని బోధించిన దైవ ప్రవక్త ముహమ్మద్(స) బోధను మననం చేసుకుంటూ ముస్లిం స్త్రీల విద్యాభివృధ్ధికై కృషి చేయాలి.ముస్లిం స్త్రీలు ధర్మబధ్ధమైన అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చూపించవచ్చు.స్వయాన ప్రవక్త(స)సతీమణి ఖతీజా(ర)వ్యాపార బాధ్యతలు నిర్వహించారు.కుమార్తె ఫాతిమా(ర)యుధ్ధరంగంలో సైనికులకు సేవలందించారు.మేనత్త సఫియా(ర)కోట గోడ రక్షణకు నిలబడ్డారు.ప్రవక్త కాలంలో ఇస్లాం ఆణిముత్యాలుగా కీర్తించబడ్డ అస్మాసాలెహా(ర)గొప్ప మహిళా నాయకురాలిగా పేరుగాంచారు.రబియా బస్రీ గొప్ప సూఫీ కవయిత్రి గా నిలిచారు.ప్రవక్త కాలంలో లేని ఛాందసం ఇప్పుడీ ఆధునిక కాలంలో సైతం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై వుంది.
ప్రతి పురుషుడు తన గృహంలో ప్రవేశించే ముందు తన భార్యకు సలాం చేసి మరీ వెళ్ళాలని చెప్పి ప్రవక్త ముహమ్మద్(స)పురుషాహంకారాన్ని తుత్తునియలు చేశారు.
రాజరిక వ్యవస్థలో స్త్రీని బానిసగా,ఫ్యూడల్ వ్యవస్థలో పనిముట్టుగా,ఈ ఆధునిక వ్యవస్థలో కేవలం అవయవంగా మార్చిన నేటి పురుష ప్రపంచ కుట్రల్ని ఆధునిక స్త్రీ అర్థం చేసుకోవాల్సి వుంది.ముస్లిం స్త్రీలు తమ సంస్క్రతిని పరిరక్షించుకుంటూనే హక్కుల కోసం గళమెత్తాలి.జకాత్ సొమ్ముతో ముస్లిం బాలికల విద్య కొరకు మదరసాలు నడుం బిగించాలి.ఇందులో ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్య ఉండాలి.చేతి వృత్తుల నైపుణ్యం మెరుగు పర్చేందుకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.అప్పుడే ముస్లిం స్త్రీలలో సామాజిక చైతన్యం,ఆర్థిక స్వావలంబన పెంపొందుతాయి.
