కవి కరీముల్లా సామాజిక వ్యాసం
——————————————————
మదరసాలు – ఆధునిక విద్యా కేంద్రాలు
————————————————–
నేడు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలకారణం నిరక్షరాస్యత. అన్ని సామాజిక వర్గాలకంటే ముస్లిం సమాజం విద్యాపరంగా వెనుకబడి ఉంది, దీని వల్ల సామాజిక చైతన్యం,ఐక్యత కొరవడింది.ఈ ఆధునిక కాల వేగాన్ని అందుకోలేక పోతున్నది. ఒకానొకప్పుడు విద్యాచైతన్యానికీ, సామాజిక చైతన్యానికీ నిలయాలుగా భాసిల్లిన మదరసాలు కొందరు మతపండితులు, వర్గాల వైఖరుల కారణంగా కేవలం ఆధ్యాత్మిక విద్యకే పరిమితమయ్యాయి. అయితే ఇటీవల మదరసాల నిర్వాహకుల వైఖరిలో మార్పు వస్తోంది. ఈ మార్పు మరింత వేగంగా జరిగి మదరసాలను ఆధునిక విద్యాకేంద్రాలుగా మలచవలసిన అవసరం ఉంది.
పవిత్ర ఖురాన్లో మొదటి పదం ‘ఇఖ్రా’ అంటే చదువు అని అర్ధం. దీనిని బట్టి ఇస్లాంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. కొందరు మతవాదులు ‘ఇల్మ్’ (జ్ఞానం) అనే పదాన్ని వక్రీకరించారు. ఇల్మ్ అంటే ధార్మిక విద్య మాత్రమే కాదు, ప్రాపంచిక విద్య కూడా అందులో భాగమే. ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి ఊహాలోకాల్లో విహరించమని ఇస్లాం చెప్పదు. ముస్లింలు ఇప్పటికైనా మదరసాల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టాలి. ప్రవక్త కాలంలో, ఖలీఫాల కాలంలో విద్యకు బాగా ప్రోత్సాహం లభించింది. స్వయాన ప్రవక్త (స) తన సహచరులను ఇతర భాషాశాస్త్రాలను అధ్యయనం చేయమని, పరిశోధనలు సాగించమని ప్రోత్సహించేవారు. విద్య కోసం భూమి చివరి అంచుల వరకైనా సరే వెళ్ళండని చెప్పేవారు. కనుకనే నాటి కాలంలో మదరసాలు శాస్త్ర, సామాజిక, సాంకేతిక, పరిశోధనా కేంద్రాలుగా భాసిల్లాయి. మధ్యయుగ కాలంనాటి చీకటి యుగంలో యూరోపియన్లు భూమి స్థిరంగాను, బల్లపరుపుగా ఉందని భావిస్తున్న దశలో భూమి గుండ్రంగా ఉందని , భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని, భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని పవిత్ర ఖురాన్ జ్ఞానంతో చెప్పగలిగారు. వారంతా మదరసాల నుంచి వచ్చినవారే.అల్జిబ్రా గణితం కనిపెట్టింది మదరసాల్లో చదువుకుని వచ్చిన అల్జిబ్రా అనే అరబ్బు ముస్లిం.అనేక వైద్య శాస్త్రాలను,ఖగోళ శాస్త్రలను,తాత్విక రచనలను అందించిన వారు ఈ మదరసాలలో చదువుకుని వచ్చిన వారే.వారే ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించారు..వీరి శాస్త్రాలను తరలించుకు పోయిన యూరోపియన్లు వాటి నుండి జ్ఞానాన్ని పొంది నేడు సైన్స్ అభివృద్ధి చేసుకున్నారు.విలువైన తమ జ్ఞానాన్ని పోగొట్టుకున్న ముస్లిం సమాజం సైన్స్ పరంగా వెనుకబడింది. ప్రవక్త ముహమ్మద్ (స)జ్ఞానాన్వేషణలో మరణం సిద్ధిస్తే అమరగతి లభిస్తుందనిచెప్పారు.విద్యకు,విజ్ఞానానికి, హేతువుకు ఇస్లాం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.
కొందరు మతోన్మాదులు ప్రచారం చేస్తున్నట్టు మదరసాలు తీవ్రవాద కేంద్రాలు కావు. ముఖ్యంగా మన దేశంలో మదరసాలలో చదివే విద్యార్థులు శాంతస్వభావులుగా మార్తారు.తెలిసిందల్లా నమాజ్ చదవడం, రోజాలు పాటించడం, పవిత్ర ఖుర్ఆన్ కంఠస్థం చేయడం.అంతే తప్ప మరే విధమైన ప్రాపంచిక విషయాల తెలియవు.రాజకీయ ఆలోచనలకు దూరంగా ఉంటారు.తమ చుట్టూ,తమ సమాజం చుట్టూ జరిగే విషప్రచారాలు కూడా తెలియవు.మీడియాకు దూరంగా ఉంటారు.
ఆధునిక విద్యకు దూరమైనందువల్ల ,దీన్ లోనే దునియా కూడా ఉంది అని తెలియక పోవడం వల్ల ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఆధునిక కాలానికి అనుగుణంగా మదరసాల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. ఇప్పటికైనా మడరసాల్లోకి తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, గణితాలతో బాటు అన్ని సామాజిక శాస్త్రాలను, కంప్యూటర్ కోర్సులను బోధనాంశాలుగా ప్రవేశపెట్టాలి. వాటితో పాటు పవిత్ర ఖుర్ఆన్, హదీసులు తదితర ఆధ్యాత్మికాంశాలు కూడా బోధించాలి. తద్వారా ముస్లిం సమాజం సామాజికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా సంపూర్ణ చైతన్యాన్ని పొందగలుగుతుంది.
నేడు మదరసాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు లేనందున చాలీచాలని జీతాలతో మసీదుల్లో ఇమాంలుగానో, అరబ్బీ నేర్పే ఉపాధ్యాయులుగానో జీవిస్తున్నారు. వీరికి సామాజిక అవగాహన లేనందున వీరి బోధనలు పరలోక విషయాలకే పరిమితమవుతున్నాయి. పైగా ఇస్లాం అనుమతించని పూజారి వ్యవస్థ చోటు చేసుకుంటోంది. ఆధునిక విద్యను కోరుకునేవారు మదరసాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ధార్మిక విద్యను వాంఛించేవారు ఆధునిక విద్యకు దూరంగా ఉంటున్నారు. అందువల్ల ముస్లిం సమాజంలో సమతుల్యత లోపిస్తోంది. మానవీయ విలువలను విశ్వసిస్తూ, నైతిక ప్రమాణాలు పాటించడానికి ధార్మిక విద్య, ఆధునిక విద్య రెండూ అవసరమే. ఈ రెండు అవసరాలను తీర్చే సాధనాలుగా మదరసాలు మార్పు చెందాలి.
అంతేగాక ముస్లిం సమాజం ఇతర అన్ని సమాజాలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలి. మతతత్వ శక్తులు సమాజాన్ని మతపరంగా చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నాయి.తమ గుప్పిట్లో ఉన్న అన్ని రంగాల్లో ముస్లిం ఫోబియా,ఇస్లామోఫోబియా వ్యాపింపజేయబడుతుంది.దీని ప్రభావం ఎంత ఉందంటే మేం ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే వారు సైతం అంతరాలలో ముస్లింలను ద్వేషించేంతగా వ్యాపింపజేయబడింది. ఈ స్థితిలో మతసామరస్యం కోసం, ఇస్లాంపై నెలకొన్న అపార్థాలను తొలగించడం కోసం, అన్ని రకాల ఉగ్రవాదాలను నిరసించడం కోసం ముస్లింలు తామే పూనుకోవాలి.. తమ నిజమైన జీవన విధానం శ్రామిక విలువలతో,సామరస్య విలువలతో, మానవీయ విలువలతో ముడిపడి ఉందనే సత్యాన్ని అందరికీ ఎరుక పర్చాలి.ప్రభుత్వాలు సైతం నిజాయితీతో ముస్లింల విద్యాభివృద్ధికి కృషిచేయాలి.
