“అజరామరం జాషువా సాహిత్యం”
మహాకవి గుఱ్ఱం జాషువా గారి జయంతి (28-09-2023) సందర్భంగా ఈ రోజు ఉదయం 10.30 ని.ల కు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం ప్రాంగణం నందు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పి. విజయ బాబు గారు, విజయవాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు, విజయవాడ పశ్చిమ శాసనసభ సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు మరియు ఇతర సాహితీ ప్రముఖులు హాజరై గుఱ్ఱం జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తదనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పి. విజయ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ, జాషువా గారి సాహిత్యం అజరామరం అని, జాషువా గారు ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు అని, జాషువాలోని గొప్పతనం ఏమిటంటే తను ఎన్ని అవమానాలకు గురియైనా ఏనాడు దురాగ్రహం ప్రదర్శించలేదని, అక్షరాస్త్రాలతో ధర్మాగ్రహాన్ని ప్రదర్శించి జాషువా గారికి సాటి వేరెవరూ లేరని నిరూపించుకున్నారని తెలిపారు. రాజు మరణించె నొకతార రాలిపోయె కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాలుకల యందు అన్న జాషువా కవితాక్షరాలకు ఆయనే నిదర్శనం అని కొనియాడారు.
విజయవాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గుఱ్ఱం జాషువా గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తుందని తెలిపారు. విద్యార్ధులంతా ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. అగ్రవర్ణాలలో కొంతమంది ఆయన రచనలను ప్రోత్సహించి తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. విజయవాడ పశ్చిమ శాసనసభ సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జాషువా గారు అవమానాలను సన్మానాలుగా మార్చుకొని విశ్వనరుడిగా ఎదిగారని పేర్కొన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు ఆదర్శమూర్తి జాషువా గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య గాజుల రామచంద్రా రెడ్డి గారు, యస్.సి. కమీషన్ అధ్యక్షులు శ్రీ విక్టర్ ప్రసాద్ గారు, రాష్ట్ర యస్.సి. సెల్ ప్రెసిడెంట్ బూదాల శ్రీను గారు, పలువురు సాహితీవేత్తలు మరియు ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు.
-ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం.