పోలింగ్ కు అంతరాయం కలిగిస్తే…
ఈసీ అధికారాలు
ప్రతి ఓటు విలువైనదే..
ఈవీఎంలను డామేజ్, బూత్ కాప్చరింగ్ , పోలింగ్ కు అంతరాయం, లేదా ప్రకృతి విపత్తులు, అభ్యర్థి మరణం వంటివి జరిగితే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగుతుంది. రీపోలింగ్ , ఎన్నికల వాయిదా, వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ… నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటుంది.
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 58(2), సెక్షన్ 58A(2) ప్రకారం పారదర్శకంగా జరగని ఎన్నికలను రద్దు చేసి.. రీపోలింగ్ జరిపే అధికారం భారత ఎన్నికల కమిషన్ కు ఉంది. ఈ సెక్షన్ల ప్రకారమే మణిపూర్ లో 11 పోలింగ్ స్టేషన్లలో, అరుణాచల్ ప్రదేశ్ లోని 8 బూత్ ల్లో ఎన్నికలను మళ్లీ నిర్వహిస్తున్నారు. మధ్య ప్రదేశ్ లోని బెతుల్ లోక్ సభ స్థానంలో ఎన్నికల ముందు అభ్యర్థి మరణించడంతో పోలింగ్ ను వాయిదా వేశారు. సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తూ చట్టవ్యతిరేకంగా ఈవీఎంలను తీసుకొని ఉద్దేశ పూర్వకంగా పారిపోతే సెక్షన్ 58 RPA ప్రకారం మళ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. అదే విధంగా అనుకోకుండా కాని, ఉద్దేశపూర్వకంగా గాని ఈవీఎంలు పగిలినా, టాంపరింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి ఈసీకి ఫిర్యాదు చేసినా.. పోలింగ్ ను వాయిదా వేసి రీపోలింగ్ తేదీని ఈసీ ప్రకటిస్తుంది. ఎన్నికల ఏజెంట్లు లేదా ఆయా పార్టీల అభ్యర్థులు ఇదే విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేసి.. అక్కడ ఆందోళన చేపడితే ఈసీ వెంటనే స్పందించి దండోరా వేయించి రీపోలింగ్ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లంతా పాల్గొనవచ్చు. అప్పుడు ఎడమ చేయి మధ్య వేలు గోరుపై సిరాతో గుర్తు పెడతారు.
పోలింగ్ బూత్ ను స్వాధీనం చేసుకుంటే RPA సెక్షన్ 135 A ప్రకారం పోలింగ్ స్టేషన్ ను సీజ్ చేస్తారు. లేదా పోలీసులు పోలింగ్ స్టేషన్ ను ఆధీనంలోకి తీసుకొని ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దుండగులను లోనికి వెళ్ల కుండా అడ్డుకుంటారు. చట్టవ్యతిరేకంగా బూత్ ను స్వాధీనం చేసుకున్న వారికి ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల హస్తమున్నట్లు తెలిస్తే ఐదేళ్ల శిక్ష పడుతుంది. Section 58A ప్రకారం బూత్ కేప్చరింగ్ కు పాల్పడితే ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ ను వెంటనే మూసి వేసి, ఈవీఎంలను బ్యాలెట్ బాక్సుల యూనిట్ల అనుసంధానాన్ని తొలగిస్తారు. ఈ విషయాన్ని అత్యాధునిక కమ్యూని కేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ కు తెలియచేస్తారు. దీంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించే వెలుసుబాటు ఉంటుంది. ఎక్కువ పోలింగ్ బూత్ లను అగంతకులను స్వాధీనం చేసుకున్నా.. ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగినా..ప్రకృతి విపత్తుల సంభవించినా.. భారీ వర్షాలు, తుపానుల్లో ఎన్నికల సామాగ్రి కొట్టుకు పోయినా ఎన్నికలను వాయిదా వేసే హక్కు section 57(1) of the Representation of the People Act, 1951 ప్రకారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.
ఎన్నికలు నిర్వహించే అధికారులు బూత్ కు సకాలంలో చేకుకోలేకపాయినా..పోలింగ్ సమయం మొదలై 2 గంటలు దాటిపోయినా.. పోలింగ్ ప్రకటన వెలువడకున్నా.. ఈవీఎంలు పనిచేయకపోయినా….పోలింగ్ ను వాయిదా వేయడానికి భారత ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి హఠాత్తుగా మరణిస్తే జాతీయ పార్టీ అయితే భారత ఎన్నికల సంఘానికి, ప్రాంతీయ పార్టీ అభ్యర్థి అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలియచేసి సెక్షన్ 52 ఆఫ్ RPA, 1996 సవరణ ప్రకారం పోలింగ్ ను వాయిదా వేయాలి. ఈ విషయాన్ని మిగతా అభ్యర్థులకు వారి ఏజెంట్లకు తెలియచేయాలి.
భారతదేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్త, రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, భారత రాష్ట్రపతి కార్యాలయం దీనికి దిశానిర్దేశం చేస్తాయి. ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణా అధికారాన్ని మంజూరు చేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదే..