చట్టసభల్లో నేరస్తులు
నేర చరిత్రుల్లో బీజేపీ టాప్
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యయుతంగా జరగవలసిన లోక్ సభ ఎన్నికల్లోకి నేర చరిత్రులు దూసుకొస్తు్నారు. సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు, సుప్రీంకోర్టు, నేరస్తులను పార్టీల్లోకి ఆహ్వానించవద్దని ఆదేశించినా ఫలితం లేకుండా పోతోంది. దీనిపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏ డి ఆర్ వెల్లడిచిన మరిన్ని వాస్తవాలను తెలుసుకుందాం..
గత లోక్ సభలో బీజేపీ పార్టీ కి చెందిన 294 మంది సభ్యులలో తీవ్రమైన కేసులున్న వారి జాబితాలో 118 మంది ఉన్నారు. అందులో 87 క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. 46 మంది కాంగ్రెస్ ఎం పి లలో 14 మంది పై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏ డి ఆర్ తెలిపింది. తదుపరి నేర చరిత్రుల కలిగిఉన్న జాబితాలో, జె డి యూ పార్టీ కి చెందిన 8 మంది, తమిళనాడులోని డి ఎం కే పార్టీ కి చెందిన ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నలుగురు, వై ఎస్ ఆర్ పార్టీ కు చెందిన ఏడుగురు ఉన్నట్లు నిర్థారించింది.
మనరాష్ట్ర పరిస్థితి
ఇక మన రాష్ట్రానికి వస్తే ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం జరగ బోయే లోక్ సభ స్థానాలకు బరిలో ఉన్నవారిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులు, బి జె పి నుండి బరిలో ఉన్న 12 మంది అభ్యర్థులపై నేర పూరిత కేసులు నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఉపసవహరణ గడువు ముగిసిన తదుపరి 17లోక్ సభ స్థానాలకు మొత్తం 525 మంది బరిలో ఉన్నారు. అందులో కాంగ్రెస్, బి జె పి పార్టీలకు చెందిన 12 మంది, బి ఆర్ ఎస్ కు చెందిన 9 మంది అభ్యర్థులు, ఎం ఐ ఎం కు చెందిన ఒకరి పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.
తెలంగాణాలోని మల్కాజి గిరి నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నఈటల రాజేందర్ పై అత్యధికంగా 54 కేసులు ఉండగా, కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న బండి సంజయ్ పై 42 కేసులున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 50 కేసులు, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై 47 కేసులు, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 14 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై 5 కేసులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించారు. తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడితలో జరగ బోయే ఎన్నికలకు ఈసీ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది