గన్నవరం/విజయవాడ, జూన్ 12, 2024
నారా చంద్రబాబు నాయుడు అనే నేను…
– అతిరథ మహారథుల మధ్య, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య
ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం
చేయించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్
– కొణిదెల పవన్ కళ్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
– నూతన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, మంత్రులకు దేశ ప్రధాని
శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన అతిరథ మహారథులు.. వేలాది మంది అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
బుధవారం గన్నవరం మండలం, కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రిగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. సీఎం.. సీఎం.. అంటూ అభిమానుల కేరింతల నడుమ నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. అంటూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ, జనసేన అధినేత అయిన కొణిదెల పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం 24 మంది మంత్రివర్గ సహచరులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆహ్వానం మేరకు వరుసగా.. నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, డా. పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, వీసీ జనార్థనరెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎం.రాంప్రసాద్‌రెడ్డిలతో రాష్ట్ర మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ తెలుగులో ప్రమాణం చేయగా.. టీజీ భరత్ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు.
నూతన ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రధాని అభినందనలు:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడును భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్‌లు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం నూతన ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ప్రముఖ నటులు రజనీకాంత్ దంపతులు, కొణిదెల చిరంజీవి, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, పలుపురు పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన భారత ప్రధానమంత్రి శ్రీ
నరేంద్రమోదీని నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్‌లు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపి.. వారితో గ్రూప్ ఫొటో దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంతో కార్యక్రమ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది. తొలుత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రధాన వేదిక సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నిర్వహించిన వైవిధ్య సాంస్కృతిక కళారూపాలు ఆహూతులను, అభిమానులను, కార్యకర్తలను అలరించాయి.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు: గౌరవ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్ యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పటేల్ తదితరులు హాజరయ్యారు.