పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపిన మంత్రుల బృందం
అమరావతి, జనవరి 6: పారిశుధ్య కార్మికుల డిమాండ్ల పరిష్కారానికై సంబందిత సంఘాల ప్రతినిధులతో మరోసారి మంత్రుల బృందం శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రుల బృందంలో సభ్యులైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగాను, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్సరెన్సు ద్వారాను ఈ చర్చల్లో పాల్గొని సంబందిత సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పారిశుధ్యానికి సంబందించి అన్ని రకాల కార్మికులను అందరినీ క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ గా పరిగణిస్తూ వీరందరికీ రూ.21 వేలు వేతనం చెల్లించడం, జి.ఓ..1 ప్రకారం అండర్ గ్రౌండ్ కార్మికులకు, డ్రైవర్లకు రూ.24,500 వేతనం చెల్లించడం, పాఠశాలలో పనిచేసే కంటిజన్స్ వర్కర్లకు ఇక నుండి సంబంధిత పురపాలక సంఘాల ద్వారా జీతాలు చెల్లించడం, పారిశుధ్యకార్మికులు కానివారి కేటగిరీల మార్పుల విషయంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో నున్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకోవడం, సివరేజ్ డెత్స్ కు సంబందంచి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరిహారం చెల్లించడం, కోవిడ్ మరణాలకు సంబందించి ఎక్స్ గ్రేషియా చెల్లింపుకై మరొక సారి ధరఖాస్తులు చేసేందుకు అవకాశం కల్పించడం, ప్రమాదవశాత్తు మరణించిన పొరుగుసేవ కార్మికులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను పెంచడం, వాటర్ సప్లైలో పనిచేసే నైపుణ్యం కలిగిన పొరుగుసేవల కార్మికులకు స్కిల్ డవలెప్మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికేట్లు అందజేయడం, మరణించిన పొరుగుసేవల కార్మికుల దహన సంస్కారానికై ప్రస్తుతం అందజేచే ఖర్చులను పెంచడం, పొరుగుసేవ కార్మికుల పదవీ విరమణ భద్రత క్రింద నిర్ణీత సొమ్మును చెల్లించడం, పెండింగ్ లోనున్న రెగ్యులర్ కార్మికుల సరెండర్ లీవు బిల్లులకు పది రోజుల్లో చెల్లించడం, వీరి పి.ఎఫ్. ఖాతాలను తెరిపించడం, అర్హులైన పొరుగుసేవ కార్మికులకు నవరత్నాల పథకాలను అందజేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి.
ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (YSRTUC), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), కె. ఉమామహేశ్వర రావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), బాబా ఫకృద్దీన్ (AP MEWU ), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ), ఆర్.సత్యం (GVMC ఎంప్లాయీస్ యూనియన్ ), ఇ. మధుబాబు (AP Engineering Town Planning & Sanitation Workers Trade Union) తదితరులు నేరుగా పాలొనగా పలు జిల్లాలకు చెందిన పలు కార్మిక సంఘాల ప్రతినిధులు వీడియో కాన్సరెన్సు ద్వారా పాల్గొన్నారు.