GOOD TIMES AHEAD…
మళ్లీ మంచి రోజులు!
ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ప్రజల తాజా తీర్పుతో రాష్ట్రం ముందడుగు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
గతంలో యునైటెడ్ ఫ్రంట్‌లో బాబు కీలకం
వాజపేయి సర్కారు ఏర్పాటులోనూ అంతే
కేంద్రంలో పరపతితో రాష్ట్ర ప్రయోజనాల సాధన
ఇప్పుడు మరోసారి ఎన్డీయేలో కీలక పాత్ర
ఉదారంగా నిధులు, ప్రాజెక్టులకు అవకాశం
అమరావతి
ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ప్రజల తాజా తీర్పుతో రాష్ట్రం ముందడుగు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. అభివృద్ధికి పాతరేసి, అరాచక పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఓడించి టీడీపీని గద్దెనెక్కించడం ఒక ఎత్తు! కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారడం మరో ఎత్తు! కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించిన ప్రతిసారీ… రాష్ట్ర ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో సాధించారు. తాజా ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడాల్సి వచ్చింది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు టీడీపీకే ఉన్నాయి. చంద్రబాబు ఎటువంటి శషబిషలకు, ఊహాగానాలకు తావివ్వకుండా ఎన్డీయే కూటమికి విస్పష్టమైన మద్దతు ప్రకటించారు. దీంతో జాతీయ రాజకీయాల్లో మరోసారి ఆయన పేరు మార్మోగడం మొదలైంది. చంద్రబాబుకు కేంద్రంలో పెరిగిన పరపతి రాష్ట్రానికి బాగా ఉపయోగపడే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జగన్ విధానాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమంతోపాటు తమ మార్కు అభివృద్ధిని చూపించడమెలా అనే చర్చ టీడీపీలో జరిగింది. ఇప్పుడు… కేంద్రం నుంచి ఉదారంగా సహాయం అందుతుందని, మంచి శకునాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
గతంలో ఇలా…
గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు పలుమార్లు కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. మొదట యునైటెడ్ ఫ్రంట్, తర్వాత ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతుతోనే నడిచాయి. దీనిని అవకాశంగా తీసుకొని చంద్రబాబు ఆ సమయంలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గరిష్ఠ స్థాయిలో నిధులూ సాధించారు. అప్పట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మరే రాష్ట్రమూ ఉపయోగించుకోలేదనడం అతిశయోక్తి కాదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏర్పడిన ఎన్డీయే సర్కారులోనూ టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ… అప్పుడు బీజేపీకి సొంతంగానే ఆధిక్యం ఉండింది. అయినప్పటికీ… ఉన్నత విద్యా సంసల ఏర్పాటుతోపాటు విభజన హామీలను కొంతమేరకు సాధించుకోగలిగారు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ‘మాకు కేసుల గొడవులు లేవు. చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడిని రాష్ట్రం కోసమే వాడతారు. ఆ విషయంలో ఆయన పట్టుదల ఎవరూ కాదనలేనిది. అన్ని రాష్ట్రాలను కాదని కేంద్రం ఒక రాష్ట్రానికే అన్నీ చేయలేదు. ఆ విషయం మాకూ తెలుసు. కానీ, ఉన్న పరిస్థితుల్లో కొంత మెరుగ్గా సాయం తెచ్చుకోగలం’ అని టీడీపీ ఎంపీ ఒకరు చెప్పారు. కేంద్ర నిధులు, పథకాలు, ఇతర అంశాల పరిష్కారంలో కేంద్ర అధికారుల పాత్ర చాలా కీలకం. సాధారణంగా వీరు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోరు. కానీ… కేంద్రంతో సాన్నిహిత్యం ఉన్న రాష్ట్రాలకు మాత్రం ప్రాధాన్యమిస్తుంటారు. ప్రతిదీ ప్రధా ని లేదా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఇప్పుడు… కేంద్రంలో తెలుగుదేశానికి మరోసారి ప్రాధాన్యం దక్కింది. ఈ నేపథ్యంలో నిధులు, బకాయిల విడుదల, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, నిబంధనల్లో వెసులుబాటు, విన్నపాలపై స్పందించే తీరు… అన్నీ మారుతాయి. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే జరగనుందని అధికార వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.
కేంద్ర బిందువుగా చంద్రబాబు…
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జాతీయ రాజకీయాల్లో మరో సారి చంద్రబాబు నాయుడు ప్రాభవం స్పష్టంగా కనపడింది. శుక్రవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ పక్కనే కూర్చున్న చంద్రబాబు మొత్తం ఎన్డీయే నేతలందరికీ కేంద్ర బిందువుగా వ్యవహరించారు. సమావేశం జరుగుతున్నప్పుడు మోదీ పలుసార్లు చంద్రబాబుతో మాట్లాడుతూ ఉండడం, ఇరువురూ ఛలోక్తులు విసురుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు 1999 లోక్‌సభ ఎన్నికల తర్వాత చంద్రబాబుకూ, అప్పటి ప్రధాని వాజపేయికీ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేశాయి. నిజానికి 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు కేంద్రంలో 13 పార్టీల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత దేవెగౌడ , తర్వాత ఐకే గుజ్రాల్‌ను ప్రధానమంత్రులుగా నియమించడంలో చంద్రబాబు ప్రమేయం కీలకం. ఏపీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లోనే యునైటెడ్ ఫ్రంట్ సమావేశాలు జరిగాయి. యునైటెడ్ ఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నది. ఆ తర్వాత 1999 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బలమైన మద్దతు నిచ్చారు. ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో ఆయన కీలక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం కలిసి పోటీ చేసి 36 ఎంపీ స్థానాలను గెలుచుకున్నాయి. 29మంది ఎంపీలున్నప్పటికీ… చంద్రబాబు అంశాల ప్రాతిపదికన మాత్రమే మద్దతు నిచ్చారు. వాజపేయి 8 కేబినెట్ పోస్టులను ఇవ్వజూపినప్పటికీ ఆయన అంగీకరించలేదు. లోక్‌సభ స్పీకర్ పదవి తీసుకునేందుకు మాత్రం అంగీకరించారు. అప్పట్లో రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ నియామకం ఏకగ్రీవంగా జరగడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. టీడీపీ 2019లోనూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ… ఇప్పుడున్న పరిస్థితులు వేరు. బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. దీంతో వాజపేయి ప్రభుత్వంలో మాదిరి చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకునే అవకాశం ఏర్పడింది.