ఒకే దేశం-ఒకే ఎన్నికలతో మంచి- చెడు
దేశంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికలతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం “ఒకే దేశం –ఒకే ఎన్నిక”లను బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కూడా ఈనెల 18 నుంచి 22 వరకు అంటే 5 రోజులపాటు నిర్వహించనుంది. వాస్తవానికి ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు దఫాలవారీగా జరుగుతూనే ఉంటాయి. దేశంలోని అన్నిరాష్ట్రాలకు, లోక్ సభకు ఒకే సారి ఎన్నికలు జరిపితే ఉండే లాభ- నష్టాలను గురించి తెలుసుకుందాం.
1. ఒకే దేశం- ఒకే ఎన్నికలతో ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చు. 2019 లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 60 వేల కోట్లను ఖర్చు చేసింది. అదే రాష్ట్ర , కేంద్ర ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల భారీగా ఆర్థిక వ్యయం తగ్గుతుంది.
2. ఏడాదిలో రెండు సార్లయినా దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల పాలన, భద్రతా సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపించడం వల్ల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఎన్నికల నిర్వహణా భారం తగ్గాలంటే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపడం ఉత్తమం.
3. ఎలక్షన్ ప్రొటోకాల్ ను అనుసరించి దేశంలో సంక్షేమ పథకాలను ప్రకటించడం, లేదా అమలులోకి తీసుకురావడం ఎన్నికల కోడ్ లోకి వస్తుంది కాబట్టి, ప్రజలకు నష్టం జరుగుతుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే దేశం అంతాటా ఒకేసారి ఎన్నికలు జరపాలని ఎన్డీఏ చెబుతోంది.
4. ప్రభుత్వం చాలినంత సిబ్బందిని దేశం అంతటా నిజాయితీగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి నియమించాలి. దీనిలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలి. విద్యాసంస్థల టీచర్లు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు తమ రోజూవారీ పనులతోపాటు ఎన్నికలపై కూడా సమయం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి.
5. పాఠశాలలు, కాలేజీలు , ఇతర ప్రభుత్వ భవనాలు ఓట్ల కోసం వినియోగించడం వల్ల ప్రజలకు రోజూవారీ జరగాల్సిన పనులకు అంతరాయం కలుగుతుంది. బడులన్నీ ఓటింగ్ కోసం వినియోగించడం వల్ల, టీచర్లందరూ ఎన్నికల పనుల్లోనూ బిజీగా ఉండటం వల్ల విద్యార్థులు తమతరగతి గదిలోని పాఠ్యాంశాలను నష్టపోతారు. అలాగే ప్రభుత్వ బస్సులను ఓట్లపెట్టెల రవాణాకు ఉపయోగించడంతో రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. ప్రభుత్వ అధికారులు, శాఖలు, తమ డ్యూటీలను పక్కన పెట్టి ఎన్నికల బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు నష్టపోతున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నికలతో ఈ సమస్యలను నిరోధించవచ్చు.
6. దేశంలో ప్రతి ఏడాది ఎన్నికలు ఉండటంతో రాజకీయ నాయకులు ప్రజలపై తమ ముద్రను వేయడానికి చాలా అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థి సమర్థవంతుడు కాకపోయినప్పటికీ ప్రజలకు గొప్ప నాయకుడని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది.
7. ఎన్నికలు ఒకసారి జరిగిన తర్వాత రెండో సారి ఓటర్ల శాతం పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. ఎలాగంటే ఒకచోట నుంచి మరోచోటికి తరలివచ్చి దొంగ ఓట్లు వేసే బెడద ఉంటుంది.
ఒకే దేశం- ఒకే ఎన్నికలతో నష్టం కూడా లేకపోలేదు..
1. జాతీయపార్టీలు దేశసమస్యలను చర్చిస్తాయి. అప్పుడు స్థానిక సమస్యలకు ప్రాధాన్యంతగ్గుతుంది.
2. ఎన్నికల ప్రచారం ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి స్థానిక పార్టీలు (అసెంబ్లీ) జాతీయ పార్టీలతో పోటీపడలేవు.
3. దీంతో స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయి. అంటే రాష్ట్ర ఎన్నికలు తమ ప్రాధాన్యతను కోల్పోతాయి.
4. రాష్ట్ర పార్టీలు తమను తాము ప్రమోట్ చేసుకునే అవకాశాలు కోల్పోతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు, దేశరాజకీయాలు మధ్య అగాధం ఏర్పడుతుంది. అందువల్ల రాష్ట్రాలు , స్థానిక పార్టీలు ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తాయి.
5. ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. అందుకోసం రాష్ట్రాల అసెంబ్లీల అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పటికే జీఎస్టీలతో దెబ్బతిన్న రాష్ట్రాలు జాతీయపార్టీలను తమ భుజాలపై మోస్తాయని అనుకుంటానికి వీలులేదు.
6. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపినంత మాత్రాన రాష్ట్ర ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి ప్రజలు పట్టం కడతారనుకోవడం కల్ల.
7. ఒకే దేశం- ఒకే ఎన్నికలపై సమగ్ర అధ్యయనం అవసరం. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ప్రతిపక్షాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అప్పుడే ఒకే దేశం- ఒకే ఎన్నికలు అవసరమో లేదో తెలుస్తుంది.