వచ్చే ఏడాది ఆరు మాసాల వ్యవధిలో ఇండియా, అమెరికా సాధారణ ఎన్నికలు
ఎంపి విజయసాయిరెడ్డి
……………………………………………………………………………………..
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా, అత్యుత్తమ ప్రజాతంత్ర దేశంగా పేరొందిన అమెరికా ప్రజలు 2024లో తమ కేంద్ర ప్రభుత్వాలను ఆరు నెలల తేడాతో ఎన్నుకోబోతున్నారు. అనేక రాష్ట్రాలు, వాటికి చెప్పుకోదగ్గ అధికారాలున్న అమెరికా అధికారిక నామం అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్యే) కాగా, భారతదేశాన్ని భారత రాజ్యాంగం మొదటి షెడ్యూలులో ఇండియా అనే భార త్– రాష్ట్రాల సంఘం (యూనియన్ ఆఫ్ స్టేట్స్) అని పేర్కొన్నారు. అయితే, అమెరికాలోని రాష్ట్రాలకు ఇండియాతో పోల్చితే ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉంది. భారతదేశంలో కేంద్రమే (యూనియన్) బలమైనది. రెండూ ఫెడరల్ దేశాలేగాని ఇండియాలో అమలులో ఉన్నది క్వాజీ ఫెడరల్ (అర్ధ సమాఖ్య విధానం) వ్యవస్థ. అమెరికాలో ఉనికిలో ఉన్నది పూర్తి ఫెడరల్ విధానం. అమెరికా అనుసరిస్తున్నది అధ్యక్ష తరహా ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇండియాలో నడుస్తున్నది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. ఇండియాలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పార్లమెంటు దిగువ సభ లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలితప్రాంతాల్లో విస్తరించి ఉన్న 543 పార్లమెంటు నియోజవర్గాల నుంచి ఒక్కొక్క ప్రతనిధిని ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 272 సీట్లు అవసరం. ఇన్ని స్థానాలు గెలుచుకున్న ఒక పార్టీనిగాని, కొన్ని పార్టీల కూటమిని గాని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు రాష్ట్రపతి. అమెరికాలో మాత్రం అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఉమ్మడిగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ జాతీయ ఎన్నికలను ప్రతి నాలుగేళ్లకూ లీప్ సంవత్సరం నవంబర్‌లో సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహిస్తారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు పదవిలో ఉండగా మధ్యలో మరణిస్తే ఉపాధ్యక్షుడే అధ్యక్షుడవుతాడు. అయితే, అధ్యక్ష ఎన్నికలతోపాటే 435 మంది సభ్యులున్న అమెరికా దిగువసభ హౌసాఫ్ రిప్రెజెంటేటివ్స్‌కు కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఈ ప్రతినిధుల సభ పదవీకాలం రెండు సంవత్సరాలే. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం సగం (రెండేళ్లు) పూర్తయ్యే సమయానికి (అది కూడా నవంబర్‌లో) ప్రతినిధుల సభకు ఎన్నికలు నిర్వహిస్తారు.
భారత లోక్ సభ 18వ ఎన్నికలు, అమెరికా 60వ అధ్యక్ష ఎన్నికలు
……………………………………………………………………..
2024 వేసవిలో (ఏప్రిల్–మే) మాసాల్లో భారత పార్లమెంటు (లోక్ సభ) 18వ ఎన్నికలు నిర్వహిస్తారు. 1952 శీతాకాలం చివరిలో పూర్తయిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి 2019 ఏప్రిల్–మే వరకూ పార్లమెంటు దిగువసభకు 17సార్లు ఎన్నికలు నిర్వహించారు. 1952 నుంచి 1984 వరకూ జరిగిన 8 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయపక్షానికి మెజారిటీ రాగా, వరుసగా 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. 1991–96 మధ్య కేంద్రంలో మైనారిటీ సర్కారుగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మినహా మిగిలినవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. దాదాపు పదిహేనేళ్లకు 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో (16, 17వ ఎన్నికలు) మాత్రమే ఒక రాజకీయ పక్షానికి (బీజేపీ) మెజారిటీ వచ్చింది. అయినా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ జీ నాయకత్వాన వచ్చిన ఈ ప్రభుత్వాలు సంకీర్ణ మంత్రివర్గాలతోనే పరిపాలించాయి. మరో ఐదు నెలల్లో జరిగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు ప్రధాన రాజకీయపక్షాల్లో ఒకదానికి సంపూర్ణ మెజారిటీ వస్తుందా? లేక హంగ్ పార్లమెంటు (త్రిశంకు సభ) ఏర్పడుతుందా? అనే ప్రశ్నకు జవాబు 2024 మే చివరిలో తెలుస్తుంది. 2004 పార్లమెంటు ఎన్నికల నుంచీ ఇద్దరు ప్రధానమంత్రుల (డాక్టర్ మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీ) నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పూర్తిపదవీకాలం కొనసాగడం విశేషం. ఇది భారత రాజకీయ సుస్థిరతకు సంకేతం. కాగా, అమెరికాలో 1788–89లో మొదటి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న జరిగేది 60వ ఎన్నికలు. ఇప్పటి వరకూ 46 మంది నాయకులు ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. 2020 నవంబర్ ఎన్నికల్లో విజయం సాధించి 2021 జనవరి 20న పదవీ ప్రమాణం చేసిన ప్రస్తుత అమెరికా నేత జోసెఫ్ బైడెన్ 46వ అధ్యక్షుడు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కూడా డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తానని ఆయన ప్రకటించారు. అలాగే, భారత ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సూచిస్తున్నాయి.
శ్రీ వి.విజయసాయిరెడ్డి
(రాజ్యసభ సభ్యులు)