ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు ఆర్టీఐ ఇంటర్నేషనల్ సంస్థ ప్రసంశ.
విజయవాడ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్ (ఆర్టీఐ) ప్రశంసించింది. ఈఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆసంస్థ రాష్ట్రం లోని వివిధ జిల్లాల్లో ఒక అధ్యయనం నిర్వహించింది.ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు.
రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రత కు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్,ఆర్టీఐ ప్రతినిధి సత్య పేర్కొన్నారు.ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం రోగనిర్ధారణ పరీక్షల సేవలు పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పిహెచ్ సి,విహెచ్ సి ల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు,షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ అధికంగా జరుగు తున్నట్టు తెలిపింది.ఇంకా ఈకార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలు సలహాలు చేసింది.
అనంతరం సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య పరంగా ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు,మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,గ్రామ స్థాయిలో విలేజ్ హెల్తు క్లినిక్లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. దీని వల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.మహిళలు,బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ,రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఆర్టీఐ సంస్థ ఫ్యామిలీ డాక్టర్ విధానంపై మంచి అధ్యయనం చేసి పలు సూచనలు చేసినందుకు సిఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈసమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్,ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులు పాల్గొన్నారు.