కల నెరవేరిన వేళ..
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యింది. కృష్ణశిలతో అరుణ్ యోగి చేసిన ఈ విగ్రహం అందరినీ మంత్రముగ్ధులని చేస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలే వినిపించాయి. ప్రతి ఒక్కరూ రామ నామ జపంతో పునీతులయ్యారు.
ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సంబరాలు జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకి సినిమాకి చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. సామాన్య ప్రజలకి ఈరోజు ఎటువంటి దర్శన భాగ్యం ఉండదు. జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకి శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం 7.30 హారతి కార్యక్రమం జరిగింది.
శ్రీరాముడి దర్శనం ఎలా చేసుకోవాలి?
బాల రాముడికి ప్రతి రోజు మూడు సార్లు హారతి ఇవ్వనున్నారు. ప్రతి హారతికి ముందు భోగ్ సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి 11.30 వరకు భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శించుకునేందుకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం రెండున్నర గంటల పాటు మాత్రం ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
హారతిలో ఎలా పాల్గొనాలి?
రామ్ లల్లాకి మూడు సార్లు హారతి ఇస్తారు. ఉదయం 6.30 గంటలకి తొలి హారతి ఇవ్వనున్నారు. దీన్ని శృంగార్ హారతి అని పిలుస్తారు. మరల మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఇస్తారు. రాత్రి 7.30 గంటలకి సంధ్యా హారతి ఇస్తారు. రామ మందిర నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకి అప్పగించింది. రామలయంలో ఇచ్చే హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా ఈ ట్రస్ట్ నుంచి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. పాస్ పొందటం కోసం చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ చూపించాలి. హారతిలో పాల్గొనేందుకు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పెట్టిన నియమాల ప్రకారం ఒకేసారి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ హారతిలో పాల్గొనాలంటే మాత్రం తప్పనిసరిగా పాస్ తీసుకోవాలి.
పాస్ పొందటం ఎలా?
శ్రీరామ భక్తులు హారతిలో పాల్గొనాలంటే పాస్ పొందాల్సి ఉంటుంది. సింపుల్ దశలు అనుసరించి మీరు హారతి కోసం పాస్ పొందవచ్చు. ముందుగా భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్ సైట్ online.srjbtkshetra.org కి వెళ్ళాలి. మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవాలి. ఆ తర్వాత రిజిష్ట్రేషన్ కోసం ఓటీపీ నెంబర్ వస్తుంది.
ఇప్పుడు మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి హారతి లేదా దర్శనం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత అందుకు కావాల్సిన సమాచారం మొత్తం ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీకు పాస్ కనిపిస్తుంది. ఆలయానికి వెళ్ళే ముందు టెంపుల్ కౌంటర్ నుంచి పాస్ తీసుకోవాలి. ఇది చూపిస్తే హారతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.