కవి కరీముల్లా సామాజిక వ్యాసం
———————————
నల్లజాతి సూర్యుడు హజ్రత్ బిలాల్ (రజిఅన్ )
————————————————–
అది అరేబియా గడ్డ.మండే ఎండలకు, పాషాణ హృదయాలకు అడ్డా.ఎటుచూసినా ఖురైష్ సర్దారుల దాష్టీకాలకు,అగ్రవర్ణ అహంకారం తలకెక్కిన అరబ్బుల ఆగడాలకు అంతే లేని కాలం.. నల్లజాతి వారిని బానిసలుగా నడిబజారులో నిలబెట్టి వేలం వేసి పశువులను కొన్నట్టు కొని ఇంత తిండి పెట్టి జీవితాంతం ఊడిగం చేయించుకుని వృద్ధాప్యం వచ్చాక వదిలేసే దుష్ట కాలం.అరబ్బుల ముందు నల్లజాతి నీగ్రోలు అణిగిమణిగి ఉండాలి.తల ఎత్తి మాట్లాడకూడదు.కనీసం చెప్పులు వేసుకుని నడవకూడదు.శరీరంలో నడుముకు తప్ప శరీరంపై దుస్తులు ధరించరాదు.నల్లజాతి వారి కష్టాలకు,కన్నీళ్లకు అంతేలేదు.సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓ విప్లవ స్వరం వినిపించింది.ఆయనే దైవ ప్రవక్త ముహమ్మద్ (స).ఆయన సందేశం ఏమంటే మానవులంతా ఒక్కటే.మానవులందరి దైవం ఒక్కడే.మనుషులంతా పుట్టుక రీత్యా అందరూ సమానులే.
ఎవరూ అధికులు కాదు.ఎవరూ అల్పులూ కాదు.నల్లజాతి వారు బానిసలు కాదు.వారు అరబ్బులకు సమానులు అనే ప్రవక్త మాట ఖురైష్ సర్దారులకు కంటగింపైంది..ఎవరైనా ప్రవక్తను అనుసరిస్తే దారుణంగా శిక్షించే వారు.ఇటువంటి క్లిష్ట సమయంలో నేను ప్రవక్తను అనుసరిస్తాను అని ఒక నల్లజాతి సూరీడు మక్కాలో నినదించటం ఆరంభించాడు.ఆయనే హజ్రత్ బిలాల్ రజిఅన్.
ఇధియోపియా నుండి కొనుగోలుపై వచ్చిన నీగ్రో బానిస రబాహ్,హమామా దంపతులకు తొలి చూరు బిడ్డ బిలాల్.బాల్యం నుండే మంచి దేహదారుఢ్యంతో నేరేడు పండు రంగులో నిగనిగలాడేవారు.అగ్రవర్ణ అహంకారి ఉమయ్య వద్ద బానిసగా ఉండేవారు.ప్రవక్త ముహమ్మద్ స ఇచ్చిన ఏకేశ్వరరాధన, సామాజిక సమానత్వ పిలుపు బిలాల్ ఆలోచనలు మార్చాయి.అవును! మనిషి సాటి మనిషికి ఎందుకు దాస్యం చేయాలి.ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఏమిటి ?అనే ఆలోచనలో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు.అలా బాధ పడి మౌనంగా ఉంటే చరిత్ర బిలాల్ ను పట్టించుకునేది కాదు.కలిమా చదివి ప్రవక్తను అనుసరించాలని నిర్ణయించుకున్నారు.కలిమా చదివి అగ్రవర్ణ బానిసత్వం నుండి విముక్తి పొందిన అమ్మార్ను ఖురైష్ సర్దారులు బంధించారు.
అహంకారి ఉమయ్య ఏయ్ బిలాల్ అమ్మార్ను కొరడాతో కొట్టు అని ఆదేశించాడు.ఒక బానిసను మరో బానిసతో కొట్టిస్తానని హుంకరించాడు.బిలాల్ కళ్లు చింత నిప్పులయ్యాయి.అమ్మార్ ను కొట్టేదేలేదు.నేనూ కలిమా చదువుతున్నాను.అషహదు లాయిలాహ యిల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ (దైవం ఒక్కడే.ముహమ్మద్ దైవ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను )అని బిగ్గరగా పలికాడు.అంతే..ఖురైషు సర్దారుల కోపం కట్టలు తెంచుకుంది.ముహమ్మద్ ప్రారంభించిన ఈ ఉద్యమం బానిసల్లోను,దళితుల్లోనూ పాకుతోంది.ఇక సహించేదిలేదని కేకలు వేసుకుంటూ బిలాల్ను బంధించారు.మండుటెడారిలో నడుముకు ఉన్న గుడ్డ తప్ప మరేమీ లేని బిలాల్ను పరుండబెట్టి బరువైన బండరాయిని ఛాతీపై ఉంచారు.బండ వేడికి చర్మం కాలి కమురు వాసన వస్తుంది..ఏయ్ బిలాల్ ఇప్పటికైనా ప్రవక్త బాటను వీడుతావా!లేదా?అని గద్దించారు.ఎన్ని హింసలు పెట్టినా కలిమా చదువుతూ స్పృహ తప్పేవారు.మెడకు తాడు కట్టి లాగే వారు.అయినా బిలాల్ విశ్వాసంపై స్థిరంగా నిలబడ్డారు.విషయం తెల్సుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ సిద్ధిఖ్ రజిఅన్ ను పిలిచి బిలాల్ ను అతని యజమానికి రొక్కం చెల్లించి బానిసత్వం నుండి విముక్తి కలిగించి తీసుకురమ్మని పంపించారు.అలా విముక్తి పొందిన బిలాల్ నిత్యం ప్రవక్త ప్రారంభించిన విముక్తి ఉద్యమంలో ప్రధమంగా నిలబడ్డారు..
ఇస్లామియా చరిత్రలో తొలి అజాన్ పలికిన మువజ్జిన్ గా నియమితులయ్యారు.పవిత్ర కాబా మస్జీదు గోడపై ఎక్కి ప్రవక్త కోరిక మేరకు తొలి అజాన్ ఇచ్చారు.ఈ గౌరవం బిలాల్ కు దక్కటం కొంతమంది అగ్రవర్ణ మనస్థత్వం ఉన్న అరబ్బులకు నచ్చలేదు.గుసగుసలు ప్రారంభమయ్యాయి.ఏమిటీ నిన్నటి వరకూ అరబ్బుల బానిసగా ఉన్న వ్యక్తికి ఇంత గౌరవమా !అని గొణుక్కోసాగారు.ప్రవక్త గమనించి చూడండి వంశాలు,గోత్రాల,వర్ణాల అహంకారాలన్నీ నా పాదాల కింద తొక్కేశాను.మీరు నా సహచరులే ఐతే వాటిని వెలికి తీయకండి అని మందలించారు…అందరూ పశ్చాత్తాపంతో కన్నీరు కార్చారు.. హజ్రత్ ఉమర్ అంతటి వారు బిలాల్ ను ఓ మా సర్దార్ ఆజ్ఞాపించండి అని అనేవారు.బిలాల్ విముక్తి మొత్తం నల్లజాతికి ఆదర్శంగా నిలిచింది.ప్రవక్త వెంట నల్లజాతి వారు నడవటానికి స్ఫూర్తి ఇచ్చింది.అలా తన జీవితమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభించిన విముక్తి ఉద్యమంలో నడిచారు.ప్రవక్త పరమపదించాక శోకతప్తులై తొలి ఖలీఫా అబూబక్ర్ వద్ద సెలవు తీసుకొని పీడిత,తాడిత ప్రజల విముక్తి యుద్ధంలో పాల్గొనేందుకు సిరియా వెళ్తానని కోరారు.
జీవితమంతా ఎంతో కష్టాలకోర్చారు.ఇకనైనా మక్కాలో విశ్రాంతి తీసుకోరాదా!అని కోరగా పీడిత, తాడిత ప్రజల విముక్తి యుద్ధానికే అంకితమని విశ్రాంతి ని తిరస్కరించారు.అబూబక్ర్ అనుమతించగా యావత్తు ప్రజలు అశ్రునయనాలతో బిలాల్ ను సాగనంపగా సిరియాలోని డమాస్కస్లో ప్రవక్త బోధనలు ప్రజలకు పరిచయం చేస్తూ అక్కడే కన్నుమూశారు… ఇన్నాలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజివూన్..