YS Jagan: జగన్ కేసుల్లో విచారణ వేగవంతం!
ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతంగా పూర్తిచేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు 130 డిశ్చార్జి పిటిషన్లు పరిష్కారం కాలేదు
ఈ కేసుల్లో 2023 నవంబరు 24 తర్వాత తీర్పుల్లేవు
సుప్రీం మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి
రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం
హైదరాబాద్/అమరావతి, జూన్ 5 : ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతంగా పూర్తిచేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణను హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్‌కుమార్ ధర్మాసనం ప్రత్యేకంగా పిటిషన్‌ను రిజిస్టర్ చేసి విచారణ చేపడుతోంది. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాదాపు 130 డిశ్చార్జి పిటిషన్లు పరిష్కారం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుల్లో 2023 నవంబరు 24 తర్వాత ఎలాంటి తీర్పులు వెలువడలేదని పేర్కొంది.
ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా విచారించడానికి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఆయా ప్రత్యేక కోర్టులకు (సీబీఐ కోర్టు సహా) పంపాలని రిజిస్ర్టీకి స్పష్టంచేసింది. ఇవి తమ ఆదేశాలు కాదని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలుగా గుర్తుంచుకోవాలని హెచ్చరిక స్వరంతో పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఏర్పడిందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం ఉంటుందా అనే అంశంపైనా చర్చ మొదలైంది. కాగా, వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దీనిని సైతం ప్రజాప్రతినిధుల కేసుగానే పరిగణించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.
జగన్ కేసుల విచారణ 19కి వాయిదా
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుధవారం సీబీఐ కోర్టు ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి టీ రఘురాం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.