క్రోధినామ సంవత్సరానికి స్వాగతం
ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 9న మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈ ఏడాదిని శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా పిలుస్తాం. సంప్రదాయకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కొత్త ప్రతి ఒక్కరూ శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.
పంచాంగం ప్రకారం ఉగాది నుంచి తెలుగు ఏడాది మొదలవుతుంది. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభం అవుతుంది. మొదటి రుతువు వసంతం. మొదటి నెల చైత్ర మాసం. మొదటి తిథి పాడ్యమి. చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఉగాది రోజున తెల్లవారుజామున లేచి నూనె రాసుకుని స్నానం చేస్తారు. తర్వాత కొత్త బట్టలు వేసుకుని ఇంటి గుమ్మాలను మామిడి ఆకులు, లోగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటారు. ప్రజలు ఈ సందర్భంగా ఉగాది పచ్చడి బొబ్బట్లు వంటి ప్రత్యేక వంటకాలను కూడా తయారుచేస్తారు. కుటుంబం, బంధువులు, స్నేహితులు కలిసి చేసుకునే పండుగ ఉగాది. భక్తులు దేవాలయాలను సందర్శించి, దేవీ, దేవుళ్లకు దండంపెట్టుకుని ఈ ఏడాది అంతా చల్లగా చూడాలని కోరుకుంటారు. ఒకరికొకరు బహుమతులు, స్వీట్లు ఇచ్చుకుని పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని అర్థం. ప్రజలు కోపము, ఆవేశముతో వ్యవహరిస్తారని, కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు కలగటం ఈ ఏడాదిలో జరుగుతుందని పండితులు చెబుతున్నారు. దేశంలోని రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధాలు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణానికి గుర్తుగా విష్ణువు ప్రిత్యార్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని కూడా పండితులు సెలవిస్తున్నారు.
శిశిరరుతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూ కుహూ అని పాడతాయి. . అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున నూతన శుభ కార్యక్రమాలు ప్రారంభించుటం పరిపాటి. ఆ రోజున ప్రాతఃకాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానంచేసి, కొత్తబట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది.
షడ్రుచుల సమ్మేళనం – తీపి అంటే మధురం, పులుపు అనగా ఆమ్లం, ఉప్పు అంటే లవణం, కారం అనగా కటు, చేదు అంటే తిక్త, వగరు అనగా కషాయం వంటి ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు.
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవిస్తారు. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని.. పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం. ఈ పండుగ జరిగిన వారం రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది.
ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి.. ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బుద్ధిబలాన్ని, కేతువు అధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరుణ ఫలితాన్ని తెలుసుకోవడం వల్ల పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.
పూర్వకాలంలో కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతోంది? ఏ పంటలకు డిమాండ్ ఉండబోతోంది? ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు? ఖర్చులు ఎలా ఉంటాయి? వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారు. ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నక్షత్రాలు, గ్రహాల ప్రభావం, వాటి గమనం తెలుసుకోవడం పూర్వం చాలా ముఖ్యమైన పని. ఒకప్పుడు కార్తెలను బట్టి రైతులు వ్యవసాయం చేసేవారు. ఊరిలో వ్యవసాయం బాగా జరుతుందా, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయా అని తెలసుకోవాలని అనుకునేవారు. వ్యవసాయం బాగా జరిగితే ఊరందరికీ పండుగే. ఇలా చాలా విషయాలు ప్రకృతి మీద, కాల గమనం మీద వారికి ఆధాపడి ఉండేవి.
అంతేకాక పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు, ఉత్సవాలు, ముఖ్యమైన పనులు ఈ తిథులే చెప్పాలి. వాటి మంచిచెడ్డల మీద ఆధారపడి నిర్ణయించేవారు. మనకు ఇలాంటి జ్యోతిష్య ఫలాలకు అన్నిటికీ ముఖ్యమైనది పంచాంగమే కదా. ఐతే, అలాంటి పంచాంగం పూర్వం అచ్చులో ఉండేది కాదు. ఇప్పుడంటే గంటలవారి పంచాంగం, నేమాని వారి పంచాంగం అని ఇన్ని అచ్చుపడి జనవరి, ఫిబ్రవరి నాటికే మన చేతుల్లో ఉంటున్నాయి. పూర్వం పంచాంగం ఏ మూడు నాలుగు ఊళ్ళకో ఒక ముఖ్యులైన పండితుల వద్ద ఉండేది. అది కూడా తాటాకుల మీద రాసిన పంచాంగం. వాళ్ళు పంచాంగం చూడకుండానే వేళ్ళ మీద లెక్కలు కట్టి చెప్పగలిగిన సమర్థులుగా ఉండేవాళ్ళు.
ఆ రోజుల్లో ఏ ఆలయంలోనో కూర్చుని, ఆ పురోహితుడో, పండితుడో చదివి వినిపిస్తే వినేవారు. తమ రాశులకు ఏ ఫలితాలు దక్కుతాయో, ఆ ఏడాది చేయాల్సిన పండుగ పబ్బాలు ఏమిటో ఎప్పుడు వస్తాయో, వ్యవసాయం, వ్యాపారం వంటివి ఎలా ఫలిస్తాయో, ఏ జాగ్రత్తలు ఉన్నాయో తొలిరోజే చెప్పేవారు. ఈ నాటికీ దీన్ని పాటిస్తున్నారు. అందుకు మనకు టెలివిజన్లు కూడా ఉపయోగపడుతున్నాయి.
అయితే పంచాంగ శ్రవణం దక్షిణ ముఖంగా కూర్చొని చేయకూడదు. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు. దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజే కొనుగోలు చేసేవారు. కొత్తబట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు షరా మాములేకదా…
పంటలు చేతికొచ్చే పండుగ ఉగాది రోజు చిన్న, పెద్ద వ్యాపారస్తులంతా వారి వ్యాపారాలను విస్తరిస్తారు. ఈ రోజున నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. అలాగే కొత్త ప్రొడక్టులు, మరింత స్టాకును ఏర్పాటు చేసుకొని కస్టమర్లను ఆకర్షిస్తారు. ఉగాది రోజున వ్యాపారాలకు కావాల్సిన ముడి సరకులను కూడా తెప్పించుకుంటారు. దీంతో అధిక లాభాలొస్తాయని భావిస్తారు. అందుకే ధాన్యం, అలంకరణ సామాగ్రి, ఆహార ఉత్పత్తులను అధికమొత్తంలో స్టాకు ఉంచుకుంటారు. ఉగాది నాడు లక్ష్మీ పూజ చేసి దస్త్రం పెడతారు. అంటే లాభదాయకంగా ఉండాలని కొత్త ఎకౌంట్ పుస్తకాలను ప్రారంభిస్తారు.
ఉగాది పండుగకు ఒక్కరోజు ముందు అతిపెద్ద సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఉగాది పండుగ మీద ఉండబోతోందా అంటే .. అలాంటిదేమీ ఉండబోదని వేదపండితులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతకం పాటించాల్సిన పనిలేదన్నారు. మీనరాశిలో గ్రహణం ఏర్పడటం వలన పశ్చిమ దేశాలకు అరిష్టమని ఆయా దేశాల్లో నివసించేవారు అసహనాలకు లోనవడం, రాజకీయ అనిశ్చితి ఏర్పడటం, జనులమధ్య ఆవేశంతో గొడవలు కలగడం, యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు నెలకొంటాయని తెలుస్తోంది.ఈ సూర్యగ్రహణం ప్రభావం వలన ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయని సెలవిస్తున్నారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని పండితులు చెబుతున్నారు.
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
RajadhaniVartalu.com