ప్రభుత్వాసుపత్రుల్లో 28% పెరిగిన వైద్య సిబ్బంది హాజరు
- ఓపీ, ఐపీ సేవల్లో భారీ ఉన్నతి
- గత రెండేళ్లలో 37% అధికంగా శస్త్ర చికిత్సలు
- 56% పెరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- ప్రభుత్వాసుపత్రులపట్ల ప్రజల విశ్వాసం బాగా పెరిగిందన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
- ఆరోగ్యశ్రీ కంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ కింద భారీగా పెరిగిన లబ్దిదారులు, వ్యయం
- దుష్ప్రచారంపై జగన్ రెడ్డిని వాస్తవాలతో నిలదీసిన మంత్రి
- ‘సంజీవని’తో ప్రజల ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
- కూటమి రెండేళ్ల పాలనపై 8 పేజీల సమగ్ర నివేదిక విడుదల చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
Amaravati:
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రుల వాసి, రాశి ఇతోధికంగా పెరిగి, మొదటి సంవత్సరంలో మొదలైన మార్పు రెండో ఏడాది పటిష్టంగా విస్తరించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా ప్రజారోగ్య పరిరక్షణ, సంరక్షణ కోసం కూటమి చేస్తోన్న ప్రభుత్వ ప్రయత్నాలు, ఫలితాలను విజయవాడలో శనివారంనాడు రెండు గంటలపాటు సాగిన పత్రికా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగానే ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ, సాధించిన ఫలితాలపై మంత్రి 8 పేజీల వివరణాత్మకంగా నివేదికను విడుదల చేశారు.
విస్తృత స్థాయిలో సానుకూల ఫలితాలు
గత రెండేళ్లుగా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు 28.13% పెరిగిందని, దీని కారణంగా వైద్య సేవల సంఖ్య, నాణ్యతలో భారీ వృద్ధి నమోదైందని మంత్రి వివరించారు. సిబ్బంది హాజరు 2023-24లో 65.36% మాత్రమే ఉండగా అది 2025-26 నాటికి 83.75%కు పెరిగిందని మంత్రి తెలిపారు. దీనివల్ల అదే స్థాయిలో మరియు కొన్ని అంశాల్లో దానికి మించి పురోగతి కనబడిందని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల కాలంలో శస్త్ర చికిత్సల్లో 37.38% పెరుగుదల నమోదైందని, 2023-24లో మొత్తం 15.13 లక్షల శస్త్ర చికిత్సలు జరగ్గా ఆ సంఖ్య 2025-26 నాటికి 20.79 లక్షలకు పెరిగిందని, వ్యాధి నిర్ధారణ కోసం చేసే వివిధరకాల డయాగ్నస్టిక్ పరీక్షల్లో అధికంగా 56.14% పురోగతి నమోదైందన్నారు. 2023-24లో 7.98 కోట్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగ్గా ఈ సంఖ్య 2025-26కు 12.47 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. సిబ్బంది హాజరు, ఓపీ, ఐ పీ సేవల్లో, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో గత రెండేళ్లలో వెల్లడైన పెంపుదల కారణంగా ప్రజలకు ప్రభుత్వాసుపత్రులు అందించిన వైద్య సేవల్లో నాణ్యత బాగా పెరిగినట్లు స్పష్టమవుతోందని మంత్రి తెలిపారు.
మార్పునకు మూలాలు-హాజరే కీలకం
గత ప్రభుత్వ హయాంలో నియంత్రణ మరియు జవాబుదారీతనం లోపించడంతో సిబ్బంది హాజరు అతి తక్కువగా ఉందని, ఈ అంశంలో మార్పు కోసం కూటమి ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపట్టిందని, దీర్ఘకాలంపాటు విధులకు గైర్హాజరీ అయిన 51 మంది ఉన్నత వైద్యులకు సేవల నుంచి ఉద్వాసన పలకడం, ఇతర క్రమశిక్షణ చర్యలు చేపట్టడం, సక్రమంగా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించడంవంటి చర్యలద్వారా సిబ్బంది హాజరులో భారీ మార్పు వచ్చిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు.
తన పర్యటనలు, సమావేశాల సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు పొందే వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోందని పలువురు తరచుగా తనకు తెలిపారని, దీనిని నిర్ధారించుకోవడానికి వివిధ ఆన్లైన్ వేదికలపై నిరంతరం నమోదయ్యే హాజరు వివరాలను పరిశీలించగా సిబ్బంది హాజరు బాగా మెరుగుపడినట్లు స్పష్టమైందని మంత్రి అన్నారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పలుచోట్ల భారీ ‘క్యూల పట్ల వచ్చిన సమాచారం మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో గత రెండేళ్లలో అదనంగా 168 ఓపీ కౌంటర్లను ఏర్పాటుచేసినట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రుల కేటగిరిలు, ప్రాంతాలకు అతీతంగా… ఈ మార్పు స్పష్టమైందని మంత్రి సోదహరణంగా వివరించారు.
ప్రాథమిక ఆసుపత్రులకు సంబంధించి విజయనగరం జిల్లాలోని మధురవాడ-పీహెచ్సీలో ఓపీ సేవలు 31% మేరకు కర్నూలు జిల్లాలోని కొళ్లి పీహెచ్సి లో 23% మేరకు పెరిగాయని మంత్రి వెల్లడించారు. సెకండరీ ఆసుపత్రులకు సంబంధించి చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో ఓపీ సేవలు 20% మేరకు, ఐపీ సేవలు 16% మేరకు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు 43% మేరకు పెరిగాయని, పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రిలో ఓపీ సేవలు 33%, శస్త్రచికిత్సలు 18%, రోగ నిర్ధారణ పరీక్షలు 67% మేరకు పెరిగినట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ బోధనాసుపత్రులకు సంబంధించి తిరుపతి బోధనాసుపత్రిలో ఓపీ సేవలు 39%, విశాఖపట్నం కేజీహెచ్లో శస్త్రచికిత్సలు 38%, కర్నూలు బోధనాసుపత్రిలో శస్త్ర చికిత్సలు 53% పెరిగినట్లు మంత్రి తెలిపారు.
జగన్ రెడ్డి అబద్ధాలను ఎండగట్టిన మంత్రి
కూటమి పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వీర్యమైనట్లు మాజీ సీఎం జగన్ రెడ్డి తరచుగా చేసే ఆరోపణలపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాద తీవ్రంగా ధ్వజమెత్తారు. పలు అంశాలకు సంబంధించి వాస్తవాల ఆధారంగా జగన్ రెడ్డిని మంత్రి నిలదీశారు. గత రెండేళ్ల కూటమి పాలనలో ఈ పథకం కింద లబ్దిదారుల సంఖ్య 2 లక్షలకు పెరగ్గా, పథకం నిర్వీర్యమైందని ఎలా అంటారని మంత్రి ప్రశ్నించారు. జగన్ పాలనలో సగటున ప్రతి ఏడాది 8 లక్షల మంది మాత్రమే లబ్ధిపొందగా కూటమి పాలనలో సంవత్సరానికి లబ్దిదారుల సంఖ్య 14 లక్షలకు పెరిగి 70% వృద్ధి నమోదైందని మంత్రి స్పష్టంచేశారు. జగన్ పాలనలో సగటున ప్రతి ఏడాది రూ.2,315 కోట్లు మాత్రమే ఖర్చు నమోదు కాగా కూటమి పాలనలో సంవత్సరానికి రూ. 3,805 కోట్లు వ్యయం నమోదైందని మంత్రి వెల్లడించారు. ఈ వాస్తవాలతో భయపడిన జగన్ రెడ్డి తన దుష్ప్రచారంతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి వారిని దూరంగా ఉంచాలని జగన్ రెడ్డి కుట్రపన్నారని మంత్రి ఆరోపించారు.
జగన్ హయాంలో 108, 104 సేవలు నిరర్థకం కాగా, కూటమి ప్రభుత్వం వాటిని ఎంతో ప్రజోపయోగంగా తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. జగన్ హయాంలో 108 సేవల కోసం ఫోన్ చేసిన వారికి పట్టణ ప్రాంతాల్లో 27.03 నిమిషాల్లో వాహనం చేరుకోగా గత రెండేళ్ల కూటమి పాలనలో 17.34 నిమిషాల్లో 108 వాహనం చేరుతోందని, వాహనం చేరే సమయంలో పట్టణ ప్రాంతాల్లో గతంలో కంటే 9 నిమిషాలకు ముందుగా, గిరిజన ప్రాంతాల్లో 10 నిమిషాలు ముందుగా వాహనాలు ఘటనా స్థలాలకు చేరుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్ నిబంధన ప్రవేశపెట్టడంతో 95% కేసుల్లో 108 వాహనాలు రోగులను ఫోన్ చేసినప్పటి నుంచి గంటలోగానే వాహనాలు వివిధ ఆసుపత్రులకు చేరుకున్నాయన్నారు. గతంలో 34% కేసుల్లో మాత్ర మే వాహనాలు ఘటనా స్థలాలకు చేరుకున్నట్లు మంత్రి వివరించారు.
రాజకీయ జోక్యం, అవినీతి మాయం
జగన్ హయాంలో ఉద్యోగ నియామకాలు, పోస్టింగులు, బదిలీల్లో భారీ స్థాయిలో రాజకీయ జోక్యం, అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం వీటికి అడ్డుకట వేసిందని మంత్రి స్పష్టంచేశారు. గత రెండేళ్లలో జరిగిన 12వేల నియామకాలు, 25వేలకు పైగా బదిలీలు, వందలాది పదోన్నతులు మరియు పోస్టింగుల కు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో ఒక్క వ్యతిరేక వార్త కూడా రాలేదని, కూటమి అవలంబించిన స్వచ్ఛమైన విధానాలకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ విషయాల్లో పలువురు ప్రముఖులు సిఫారసులు చేసినప్పటికీ నియమ నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించలేదని, తద్వారా నిరసనలను, వ్యతిరేకతను ఎదుర్కొవల్సి వచ్చిందని, అయినా వైద్య సేవలకు ఉల్లంఘన జరిగే విధంగా నడుచుకోవద్దని ముఖ్యమంత్రి చేసిన సూచన మేం కు కట్టుబడి వ్యవహరిస్తున్నానని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రజల్లో పెరిగిన సానుకూలత
గత రెండేళ్లుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల ప్రమాణాలను, ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల .వల్ల ప్రజల్లో ప్రభుత్వాసపత్రులపట్ల ఆదరణ గణనీయంగా పెరిగిందన్నారు. సానుకూలతను ఈ సంవత్సరం చివరి నాటికి 85%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు.
సంజీవని – ఆరోగ్యాంధ్ర దిశగా …
దార్శనికులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రజారోగ్య నిర్వహణ తీరుతెన్నులను సమగ్రంగా మార్చే దిశగా దిశానిర్దేశం చేశారని, ఈ మేరకు తమ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను చేపట్టిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వ్యాధులు వచ్చినప్పుడు చికిత్స చేసేటటువoటి సంప్రదాయానికి భిన్నంగా వ్యాధులను ముందుగానే పసిగట్టి నిరోధించేందుకు తాము కృషి చేస్తున్నామని, దీని వల్ల వ్యాదుల భారం పెరగకుండా తొలి దశలోనే నియంత్రించేందుకు వీలుంటందని చెప్పారు. వివిధ ఆసుపత్రులు, పలు పథకాల కింద విస్తృత స్థాయిలో పౌరుల ఆరోగ్య స్థితి, రోగ నిర్ధార ణ పరీక్షల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒకరి ఆరోగ్య వివరాలను డిజిటల్ గా క్రోడీకరించి వ్యక్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామన్నారు. తద్వారా ఎవరైనా, ఎక్కడ్నుంచైనా వైద్య సేవలు పొందే దిశగా పటిష్టమైన డిజిటల్ వేదికలను రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ లక్ష్యంతోనే రూపొందించిన సంజీవని పథకాన్ని ఈ సంవత్సరం ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మున్ముందుకు …
గత రెండు సంవత్సరాల అనుభవంతో కూటమి ప్రభుత్వం ముందుస్తు లక్ష్యాలను నిర్ధారించుకున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిసున్న డాక్టర్ల పాలన మరియు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, వైద్య విద్య ప్రమాణాలు పెంచి, రాష్ట్రంలోని వైద్య కళాశాలలను దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించేందుకు కృసి చేస్తున్నామన్నారు. పెరిగిపోతున్న అరుదైన వ్యాధుల నివారణకోసం డిజిటల్ ఆరోగ్య సేవలు ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వైద్య సేవల్లో అంతరాన్ని తగ్గించేందుకు, వైద్యం కోసం సామాన్య మానవులు తమ జేబు నుంచి పెట్టే ఖర్చు తగ్గించేందుకు మరియు నూతన జనాభా నిర్వహణ విధానం అమలు మరియు ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజల ఆశలు మరియు ప్రభుత్వ సంకల్పం మేరకు ప్రభుత్వాసుపత్రుల సేవల వాసి, రాశిని పెంచేందుకు వైద్యులు , ఇతర సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుతూ, చిరునవ్వుతో, ప్రేమపూర్వకంగా రోగులపట్ల వ్యవహరించాలని వారిని మంత్రి కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.











































