విజయవాడ
ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం
మన బడుల్లో స్పానిష్, జర్మన్ భాషలు నేర్పే దిశగా అడుగులు
తొమ్మిదవ తరగతి నుంచి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోర్సులో శిక్షణ
: రాష్ట్ర పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు.
సోమవారం ఐబీ భారతదేశ విభాగం ఇంఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్ మెంట్ బన్నయాన్ లతో ప్రవీణ్ ప్రకాశ్ భేటీ అయ్యారు. 10,12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు.
సిలబస్ లో మార్పులతో పేద విద్యార్థుల కోసం ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘డిజిటల్ టీచర్’ సహాయంతో ప్రభుత్వ బడుల్లో జర్మన్, స్పానిష్ భాషలు నేర్పించే విషయమై స్పానిష్, జెర్మనీ ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్, మేనిక్ యూజినా, మతియాస్ స్థాలే లతో చర్చించామన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన డిజిటల్ తరగతి గదులు, విద్యా కానుక ద్వారా అందించిన ట్యాబులు డిజిటల్ విధానంలో అంతర్జాతీయ భాషలు నేర్పించడానికి తోడ్పతాయన్నారు.
హాట్ మెయిల్ వ్యవస్థాపకుడితో ప్రవీణ్ ప్రకాశ్
విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం విషయమై ప్రముఖ పారిశ్రామిక వేత్త, హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో ప్రవీణ్ ప్రకాశ్ చర్చలు జరిపారు. సబీర్ భాటియా రూపొందించిన ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్ ను 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన ఆలోచనా విధానం, నైపుణ్యాలు అలవడుతాయన్నారు.