నితీష్ నేతృత్వంలో ఏకతాటిపైకి విపక్షాలు
Opposition Leaders united under the leadership of Nitish
ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. మూడోసారి బీజేపీని గద్దె ఎక్కకుండా నువరించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. విపక్షాలను కూడకట్టేందుకు నితీష్ అహరహం శ్రమిస్తున్నారు. బీజేపీ పాలనలో నిత్యావసర ధరలపెరుగుదల, ఆదానీ అంబానీలపై ఆశ్రిత పక్షపాతం, దళితులు, మైనార్టీలపై దాడులును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
వచ్చే ఏడాది (2024లో) జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు జనతాదళ్ (యునైటెడ్)జేడీయూ నాయకుడు బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ తెరపైకి వచ్చారు. ప్రతిపక్షాలను ఏక తాటిపై తెచ్చేందుకు డిసెంబరు నుంచే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రతిపక్షాలతో ఆయన సంప్రదింపులు జరుపుతూ ఏప్రిల్ 12న కార్యరూపంలోకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని కలసి రెండు రోజుల క్రితం మాట్లాడారు. ప్రతిపక్షాల ఫ్రంట్ చివరి దశలో ఉందన్నారు. బీజేపీయేతర అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. పరస్పర వ్యతిరేక భావనలు కాకుండా ఆసక్తికర విశయాల ద్వారా అన్ని ప్రతిపక్షాలను బీజేపీకి వ్యతిరేకంగా కూడగడుతున్నామన్నారు. మా ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాక, మేమంతా ఒకే దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు ఆనందిస్తారని నితీష్ అన్నారు.
ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లోనే 2023 ఫిబ్రవరి 18 పాట్నాలో జరిగిన సీపీఐ ఎంఎల్ , లిబరేషన్ నేషనల్ కన్వెంన్షన్లో ప్రకటన చేశారు. ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ కూడా కలసి వస్తే బీజేపీకి 100 సీట్లు మించి రాకుండా కట్టడి చేయాలని వారు భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష మైన కాంగ్రెస్ కు చెందిన సల్మాన్ ఖుర్షీద్ కూడా పాట్నాలో జరిగిన కన్వెన్షల్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున సలహాలు సంప్రదింపులు జరగటానికి తానెప్పుడు సిద్దంగా ఉన్నానని బుధవారం ఖర్గే ఇంటిలో జరిగిన మీటింగ్ లో ఖుర్షీద్ తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తుండగా అనేక పెద్ద పార్టీలు ఒకటిగా కలసి బీజేపీని ఎదుర్కొనేందుకు సంసిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ (జేడీయూ), కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, చిన్న పార్టీలతో కలసి మహాగడ్భంధన్ ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉద్దవ్ థాకరే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కలసి మహావికాస్ అఘడీని ఏర్పాటు చేస్తున్నాయి. జార్ఘండ్, తమిళనాడుల్లో, కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రసివ్ అలియన్స్ ను బలంగా రూపొందిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల ముందే సంకీర్ణ దళాలు కామన్ విశయాల్లో 14 పార్టీలు ఒక్కటిగా కలసి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను (దర్యాప్తు సంస్థలను) ప్రతిపక్షాల నాయకులపై ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నాయంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం విధించిన అనర్హత వేటుపై కూడా 19 రాజకీయపార్టీలు కలసికట్టుగా న్యూఢిల్లీలో నిరసనలు తెలిపారు. ఇప్పటికీ కొన్ని పార్టీలు కలవక పోయినప్పటికీ చాలా పార్టీలు కలిశాయి.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత ప్రధాని మోడీ- ఆదానీల అభిమాన, అనుబంధాల ద్వారా జరిగిన ఆర్ధిక అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని కూడా విపక్షాలన్నీ నిలదీస్తున్నాయి.
కాంగ్రెస్ లేకుండా విపక్షాలకు గుర్తింపురాదని ఇప్పటికీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని నితీష్ కుమార్ చెబుతున్నారు. 250 పార్లమెంటు సీట్లలో బీజేపీ తలపడేది కాంగ్రెస్ తోనే అన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫ్రంట్ తో ముందుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు,( భారత రాష్ట్ర సమితి) తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ లను ఆయన పరోక్షంగా ఖండించారు. అయినప్పటికీ వారితో సంబంధాలను ఆయన తెంచుకోవడం లేదు. గతేడాది సెప్టెంబరులో ఆమ్ ఆద్మీపార్టీ అధ్యక్షడు అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, వామపక్ష పార్టీల నాయకులైన సీతారాం ఏచూరి, డి. రాజాలను, ఎన్ సీపీ నాయకుడు శరద్ పవార్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు చెందిన ఓం ప్రకాశ్ చౌతాలను కలిశారు.
నితీష్ కుమార్ ప్రతిపక్షాలన్నింటినీ ఏక తాటిపైకి తెస్తానన్నది ప్రధాని అభ్యర్థిత్వం కోసమే అని ఆరోపణలు వస్తున్నప్పటికీ నా లక్ష్యం, ఆశయం ప్రతిపక్షాలను ఏకం చేయడమే అని నాకు స్వయంగా ప్రధాని కావాలన్న కోరిక ఉన్నాప్పటికీ దానికన్నా ముందు ప్రతిపక్షాలను ఏకం చేసి, బీజేపీని నిలువరించడమే అని నితీష్ అంటున్నారు. అసలైన సవాళ్లు ప్రతిపక్షాలను ఏకం చేయడం నితీష్ కుమార్ కు అంత తేలిక కాదు. ఎందుకంటే ఆప్, సమాజ్ వాదీ, టీఎంసీ, బీఆర్ ఎస్ లకు ప్రధాన వైరం కాంగ్రెస్ తోనే ఉంది. కోన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ లతో (ట్రయాంగిల్), మరికొన్ని చోట్ల నాలుగు పార్టీలు తలపడాల్సి వస్తుంది. దీనివల్ల ఎన్నికల్లో బీజేపీ లాభం పొందుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ – కాంగ్రెస్ కలసి పోటీ చేసినా, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ- కాంగ్రెస్ పోటీ చేసినా బీజేపీకి ఒక సీటు గెలవడం కూడ కష్టమే. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ – కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే ఆరాష్ట్రంలో ఉన్న 20 శాతం మైనార్టీల ఓట్లు చీలవు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే బీజేపీకి నష్టమే.
రెండవదిగా నితీష్ కుమార్ ఆయా రాష్ట్రాల్లోని చిన్న చిన్న పార్టీలను కూడా బీజేపీ నుంచి తప్పించాలని ఆయన ప్రణాళిక రచించారు. దీంతో బీజేపీ మాతృక ప్రతిపక్షాలను విభజించడం నుంచి బయటపడవచ్చు.
దీన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ కూడా అంగీకరించారు. దీని ద్వారా 2017 ఎన్నికల కంటే 2022లో ఎక్కువ సీట్లు రాబట్టామని ఆయన చెబుతున్నారు. ఎన్నికల ఈక్వేషన్ల కంటే ప్రతిపక్షాలు ఏకం కావడం వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువ. ప్రధాని మోడీ ఇప్పటికే అవినీతి పరులంతా ఒక స్టేజ్ మీదకు వచ్చారని విమర్శిస్తున్నారు. ఢిల్లీలో ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చి బీజేపీపై విమర్శలు కురిపించారన్న వాదాన్ని ఆయన కొట్టిపారేశారు. ఏళ్ల తరబడి నితీష్ కుమార్ ప్రతిపక్షాలను కలపడంలో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం అంతా బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ ను ఏర్పాటు చేయడంతో మొదలైంది. అయితే 2022 నుంచి ఆయన బీజేపీ హిందుత్వ, నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం మూడంచెల వ్యూహంతో పనిచేస్తున్నారు. ఆయన వ్యూహం ఫలిస్తే బలమైన ప్రతిపక్ష పార్టీ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.
బీహార్ , జార్ఖండ్ ,ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీపార్టీల కూటమిలతో ఫలితాలు పొందవచ్చు. 2019లో యూపీలోని 134 లోక్ సభ స్థానాల్లో ప్రతిపక్షాలు 70 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం నితీష్ కుమార్ సక్సెస్ అయితే బీజేపీ దెబ్బతినడంలో సందేహం లేదు. మోడీ ప్రభుత్వంలో నిత్వావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగం, జాతీయ ఆస్తులను విచక్షణలేకుండా అమ్మకాలు, అవినీతి, దళితులు, మైనార్టీలపై దాడులను ఎండగట్టి నమ్మకమైన, స్తిరమైన అభివృద్దిని సూచించే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకం కలిగించడం ద్వారా ఎన్నికల్లో గెలవవచ్చని నితీష్ చెబుతున్నారు.