లక్ష కోట్లతో రెండేళ్లలో జాతీయ రహదారులు పూర్తి
రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి
అమరావతి, ఆగస్టు 4: రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో లక్ష కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాల పనులను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 2 వ తేదీన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అదనంగా మరో రూ. లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు పనులు జరుగుచున్నాయని, వాటి సంబందించిన భూసేకరణ, అటవీ క్లియరెన్సుల్లో 80 శాతం మేర టాస్కుఫోర్సు కమిటీ ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందన్నారు. దాదాపు 9 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించడం జరిగిందని, వీటిలో హైదరాబాద్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు, రూ.6,700 కోట్ల విలువైన హైదరాబాద్ – విజయవాడ (6వరుసలు) ప్రాజెక్టు , రూ.2,600 కోట్ల విలువైన విజయవాడ-మచిలీపట్నం (6వరుసలు) ప్రాజెక్టు, రూ.2,605 కోట్ల విలువైన వినుకొండ-గుంటూరు (4వరుసలు) ప్రాజెక్టు, రూ.2,000 కోట్ల విలువైన గుంటూరు- నిజాంపట్నం (4వరుసలు) ప్రాజెక్టు, రూ.4,200 కోట్ల విలువైన బుగ్గ-కైప-గిద్దలూరు (4వరుసలు) ప్రాజెక్టు, రూ. 2,500 కోట్లు విలువైన ఆకివీడు-దిగమర్రు (4వరుసలు) ప్రాజెక్టు, రూ.4,200 కోట్లు విలువైన పెడన-లక్ష్మీపురం (4వరుసలు) ప్రాజెక్టు మరియు రూ.1,182 కోట్లు విలువైన ముద్దనూరు-కడప (4వరుసలు) ప్రాజెక్టు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటికి సంబందించి డిపిఆర్ లను త్వరలో రూపొందించి కేంద్రానికి నివేదించనున్నన్నామన్నారు.
2019 – 2024 మధ్య గత ప్రభుత్వం పోతూపోతూ రూ. 2300 కోట్ల బకాయిలు మా ప్రభుత్వంపై భారం పెట్టడం జరిగిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రూ. 922 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు పార్టీలకు అతీతంగా చెల్లించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 861 కోట్లతో గత సంవత్సరం నవంబర్ లో గుంతల రహిత రహదారుల మిషన్‌కి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 171 నియోజకవర్గాల్లో 20,000 కి.మీ రహదారులు గుంతల రహిత రహదారులుగా మార్చడము జరిగిందన్నారు. మరమ్మత్తులకు ప్రాధాన్యత నిస్తూ ప్లాన్ పథకం & NABARD మద్దతుతో రహదారుల అభవృద్ది పనులను చేపట్టడం జరిగిందన్నారు. ప్లాన్ పథకం కిందరూ. 600 కోట్లు ఖర్చు చేసి, 128 నియోజకవర్గాల్లో 1433 కి.మీ “C” కేటగిరీ SH & MDR రహదారుల అభివృద్ధి చేపట్టామని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అదే విధంగా NABARD నిధుల కింద రూ. 400 కోట్లతో 114 నియోజకవర్గాల్లో 1250 కి.మీ రహదారుల నిర్మాణ పనులకు సంబందించి టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి పనులను కుడా ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన 87 NDB రహదారుల పనులను రూ. 1680 కోట్లతో మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ. 637.76 కోట్ల విలువైన పనులను పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ కు అన్ని NDB ప్రాజెక్టులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవడము జరిగిందని, ఆ దిశ గా ముందుకు వెళ్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతాన్నిరతనానసీమగా అభివృద్ది పర్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నట్లు మంత్రి తెలిపారు.