తెలుగు సాహిత్యంలో ఇస్లాంవాదాన్ని ఆవిష్కరించిన ఆదికవి కరీముల్లా
Karimullah was the pioneer of Islamism in Telugu literature
ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో అస్తిత్వవాద సాహిత్యాలడి అగ్రపీఠం. ఏ సమూహానికి ఆసమూహం తమ హక్కులకోసం గొంతెత్తుతున్నకాలంలో కవి కరీముల్లా తన జాతిజనుల హక్కులకోసం, వారు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా తనకలంద్వారా, గళంద్వారా యుధ్ధం ప్రకటించాడు. కవి కరీముల్లా తనదైన శైలిలో ఇస్లాం ధర్మాన్ని తాత్విక పునాదిగా చేసుకొని ఇస్లాం వాదాన్ని ఆవిష్కరించాడు.
ఇస్లాంవాదమని పేరు పెట్టినప్పటికీ పీడిత తాడిత దళిత బహుజనులందరూ తమ సోదరులేనని, పీడితులందరూ తన సంబోధితులేనని కరీముల్లా ప్రకటించాడు. తెలుగు సాహిత్యంలో తనదొక ప్రత్యేక స్వరంగా సామరస్య గీతాన్ని ఆలపిస్తున్నాడు. కరీముల్లా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ. గత మూడు దశాబ్దాలుగా నిరంతర సాహితీ సేద్యం చేస్తున్న కవి. తెలుగు సాహిత్యంలో ఇస్లాంవాద ఆవిష్కర్తగా, నూతన కవితా ప్రక్రియ ‘అబాబీలు’ రూపకర్తగా, ముస్లిం రచయితల సంఘం వ్యవస్థాపకు నిగా ఎందరో కవులకు దిశానిర్దేశం చేసిన కవి. ముస్లిం అస్థిత్వ వేదనకు అక్షరమద్దుతూ ముస్లిం ఫోబియా, ఇస్లామో ఫోబియాను దూరం చేసే కార్యభారాన్ని ఆయన కలం భుజానికెత్తుకుందిఎంతోమంది కవుల్ని ప్రోత్సహించి వెలుగులోకి తెచ్చి, అక్షరాలు దిద్దించిన ఆదర్శ గురువు, కరీముల్లా రూపొందించిన అబాబీలు అనే నూతన ప్రక్రియలో దాదాపు వందమందికి పైగా కవులు రాస్తూ ఉండటం మామూలు విషయం కాదు. కరీముల్లా ఇస్లా మియ సామ్యవాదాన్ని, సర్వమానవ సమతా భావాన్ని బలంగా విశ్వసించే కవి. ఇస్లాం ప్రేమ తత్వాన్ని హృదిలో నింపుకుని మతసామరస్యం, సోదరభావం, లౌకిక విలువల్ని ముందుకు తీసుకువెళుతున్న కవి.
తెలుగు సాహిత్యంలో ‘సాయిబు’ అనే పేరుతో దీర్ఘ కవిత రాసి, దీర్ఘకవిత రాసిన తొలి ముస్లిం కవిగా ఖ్యాతి గడించారు. విప్లవ కవిత్వంలో మహాప్రస్థానానికి, దళిత కవిత్వంలో గబ్బిలానికి ఎంత ప్రాధాన్యత ఉందో మైనార్టీ కవిత్వంలో సాయిబు దీర్ఘ కవితకు అంత ప్రాముఖ్యత ఉందని సాహితీ విమర్శకుల అభిప్రాయం. దేశీయ మతతత్వ ఫాసిజంపై కరీముల్లా కలం ఎలా విరుచుకు పడిందో మచ్చుకు ఇది: ‘రేయ్ హిట్లర్ నవ్వకు/అలా పగలబడి, విరగబడి నవ్వకు/నా దేశంలో పునరుద్ధానమొందిన నీ ఆత్మను చూసి నవ్వకు/ఖబరస్తాన్లో మా సమాధులపై మొలుస్తున్న వేరుచిగుర్లు/ రేపటి చరిత్రను నిర్మిస్తాయని తెల్సుకో’ అంటూ గర్జించిన నిర్భయ కవి.
ఇస్లాం శాంతిని బోధిస్తుంది అన్న యదార్ధాన్ని చాటింపువేస్తూ తెలుగు కవిత్వంలో ఇస్లాంవాద జెండాను ఎగరేసిన యోధుడు. కరీముల్లా ఇప్పటివరకూ ఇరవై ఆరుకు పైగా పుస్తకాలు రాశారు. అందులోపదిహేను పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, అవార్డులు అందుకున్నా రీయన. ఆయన కవిత్వంపై పలు విశ్వవిద్యాలయాలు పరిశోధన లు చేస్తున్నాయి. ఇస్లా కరీముల్లా కవిత్వంపై పరిశోధన పూర్తి చేసిన ఏ. శ్రీనివాసరావుకు నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్ డి ఇచ్చింది. తను రాసిన సాయిబు, బదర్ పుస్తకాలు ఆంగ్ల, కన్నడ భాషల్లో అనువాద మ య్యాయి. దేశవ్యాప్తంగా హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా భాషల్లో అనేక కవితలు, విశ్లేషణలు వచ్చాయి. ‘మనుషుల్ని కదా/మన వాళ్లనుకోవాలి/వసంతాన్ని కదా/మనం కలకనాలి’ అంటూ వసంత మేఘగర్జన చేస్తూ అన్ని రకాల మత తీవ్రవాదాలను కరీముల్లా కవిత్వం దునుమాడింది.
అనునిత్యం పీడితుల పక్షం వహిస్తూ రాజ్యహింసను వ్యతిరేకించిన కలం కరీముల్లాది. ప్రసిద్ధ కవి శివసాగర్ మాటల్లో చెప్పాలంటే, ఈ దేశ కల్లోల సంద్రంలో కరీముల్లా కవిత్వం పోరాడే యుద్ధనౌక. అందర్నీ సమంగా చూడలేని కుహనా దేశభక్తి మీద ‘థూ’ అని ఉమ్మేసిన కవిత్వం. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై కవి కరీముల్లా కలం తుఫానులా విరుచుకుపడుతుంది. హిందువైనా, ముస్లిమైనా కన్నీ రొక్కటే, కష్టాలొక్కటే అని నినదించే కరీముల్లా కలం ఎంద రికో ఆదర్శనీయం అంటే అతిశయోక్తి కాదు. కరీముల్లా భాయ్ ఇలానే ముందుకు సాగండి. ఆకాశమే హద్దుగా.. సుగుణాలే స్పూర్తిగా.!!
-యండి. ఉస్మాన్ ఖాన్, 9912580645