ప్రభుత్వ పథకాల అమలులో, అర్జీల పరిష్కారంలో క్రింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరుచుకుని బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ గారు అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ హాల్లో వీఆర్వోలు, సచివాలయ అడ్మిన్స్ వెల్ఫేర్ సెక్రటరీలు,మండల గ్రామ సర్వేయర్ల తో ఐవీఆర్ఎస్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నివేదికల పనితీరు పై డి.ఆర్.ఓ. విశ్వేశ్వర నాయుడు గారితో కలసి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ గారు సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. క్రింది స్థాయి అధికారులు పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. ఏలాంటి సమస్య అయినా కాలయాపన చేయకుండా వేగంగా స్పందించి చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్‌ఎస్ ద్వారా అందిన దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలు, పథకాలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే అంశాలపై ఐవిఆర్ఎస్ ద్వారా (ఫీడ్ బ్యాక్) మనోభావాలను సేకరిస్తోందని తెలిపారు. ఇందులో ప్రధానంగా మూడు ప్రశ్నలు ఉన్నాయని అవి అధికారులు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారా, అధికారులు నోటీసులు జారీ చేశారా, దరఖాస్తును పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేశారా అన్న అంశాలపై ఇప్పటివరకు ఐవిఆర్ఎస్ ద్వారా సేకరించిన ఫీడ్ బ్యాక్ లలో పనితీరు మెరుగ్గా లేని వారిని గుర్తించి పిలవడం జరిగిందన్నారు. ఇకపై క్రింది స్థాయి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఐవిఆర్ఎస్ నివేదికలపై ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ స్థాయిలో మోనిటరింగ్ ఉందని తెలిపారు. ప్రభుత్వ పథకాల అందజేత, అర్జీలు పరిష్కారం చూపడంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పని చేయాలన్నారు అన్నారు. ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ నివేదికలలో పనితీరు మెరుగ్గా లేని అధికారులపై తహశీల్దార్లు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అధికారి మురళీకృష్ణ గారు, మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్రమణ్యం గారు, తహశీల్దార్లు, సర్వేయర్లు,వీఆర్వో లు, సచివాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.