*Development through Political Governance**
పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి
అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి
నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదే..
యోగాడే స్ఫూర్తితో ముందుకుసాగుదాం
మనందరి ఉమ్మడి టార్గెట్ 2029, 2047
ఐఏఎస్‌లు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకోవాలి
‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
ప్రజాప్రతినిధులు-అధికారులతో తొలిసారి వినూత్న సదస్సు
యోగాడే సక్సెస్ చేసిన అధికారులు, ఉద్యోగులకు సన్మానం
అమరావతి, జూన్ 23 :- పొలిటికల్ గవర్నెన్స్‌తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. యోగా డే స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని, మనందరి ఉమ్మడి లక్ష్యం 2029, 2047 కావాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారులు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకుని.. వాళ్ల ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని… నిర్ధిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లి… వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరతాయని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం
స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి దేశ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్-2047 రూపొందించారు. మనం కూడా రాష్ట్రం కోసం స్వర్ణాంధ్ర విజన్-2047 రూపకల్పన చేశాం. ప్రజలు అధికారం ఇవ్వబట్టే ఈనాడు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎన్నికల సమయంలో కూటమిని ప్రజలు ఆదరించి ఓట్లేయడంతో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ఎన్డీయే విజయం సాధించింది. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఈ విజయం సాధ్యమైంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎంత అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం. నేను 4వ సారి సీఎం అయ్యాను… పదవి నాకు కొత్త కాదు. కానీ క్లిష్టమైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండి జీతాలివ్వలేని పరిస్థితి ఉన్నా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాను. 2014లో రాష్ట్ర విభజన జరిగి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. బస్సులో ఉండి పాలన చేసి 13.5 శాతం గ్రోత్‌రేట్ సాధించాం. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఏం చేశాం… ఇంకా ఏం చేస్తామో సమీక్షించుకోవడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
సమన్వయంతో మూడు పార్టీలు ముందుకు
*ఓటు విభజన జరగకూడదని నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. గెలుపు మా కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్ కోసమని పిలుపునిచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకెళ్లాయి. అధికారంలో మూడు పార్టీలు మిళతమై ఉన్నా ఎక్కడా సమస్యలు లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దీనికి సహకారం అందిస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఫలితాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే నిత్యం కొత్త విషయాలను గురించి తెలుసుకోవాలి, ప్రజల సమస్యల్ని అధ్యయనం చేయాలి, వారి అభీష్టం మేరకు మనం పని చేయాలని అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నా.’ అని సీఎం అన్నారు.
ఐదేళ్లు మూడు ముక్కలాటాడారు
‘ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆశలు చాలా ఉన్నాయి. కానీ మనకు అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎన్డీయే కూటమి పని చేస్తోంది. సూపర్-6తో పాటు మరికొన్ని ఎన్నికల హామీలు ఇచ్చాం. వీటి అమలుపై సమీక్ష చేసుకుంటున్నాం. ఎన్నికల ముందు పార్టీలు హామీలు ఇస్తాయి. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై వాటిని అమలు చేసే బాధ్యత ఉంటుంది. దీన్నే పొలికటికల్ గవర్నెన్స్ అంటారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోయారు. రాష్ట్రంపై పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం పోయింది. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. శాంతి భద్రతలు దెబ్బతీశారు. మూడ రాజధానుల అంటూ ఐదేళ్లు మూడు ముక్కలాడారు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
సంపద సృష్టిస్తేనే ఖర్చు చేసే హక్కు
పోలవరం ప్రాజెక్టు పూర్తైతే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతుంది. ఏపీకి చాలా వరకు నీటి సమస్య తీరుతుంది. దక్షిణ భారతదేశంలో నీటి సౌలభ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ. నదుల అనుసంధానిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసింది. రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానాన్ని కలిగించారు. ఎక్కడ చూసినా వేధింపులు, అణగదొక్కే దోరణిలే కనిపించాయి. పాలన ప్రజల కోసం చేయాలన్న ఆలోచనే కూడా నాటి పాలకులు చేయలేదు. ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అర్హత ఉంటుంది. ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి.? ఆదాయాన్ని పెంచుకుని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసి 2022-2023లో అప్పులు చేసే అవకాశం లేదని నీతి ఆయోగ్ రిపోర్టు కూడా ఇచ్చింది. తెచ్చిన అప్పులు చెల్లించాలి, అప్పులకు వడ్డీలు కట్టాలి…సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని వ్యవస్థలను కుదేలు చేసి వెళ్లిపోయారు. ఒక్క మైనింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల ఆదాయం పోయింది. ఒప్పందం చేసుకున్న సోలార్ విద్యుత్‌ను వాడకపోవడంతో రూ.9 వేల కోట్లను అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. నిధుల్ని ఇబ్బడిముబ్బడిగా దారిమళ్లించారు. కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా మళ్లించారు. సంక్షేమం సాధికారత, పెట్టుబడుల సాధన, సంపద సృష్టి, ఆదాయం పెంచడం.. ఈ నాలుగింటిని సమానంగా తీసుకెళ్తేనే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు నాంది పలికారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచారు.
పట్టుదలతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలి
అధికారంలోకి రాగానే 4 కీలక హామీలపై సంతకాలు చేశాను. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంతకం పెట్టాను… వీటికి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చాం. మాకు ప్రజల నుంచి వచ్చే వినతుల్లో 80 శాతం రెవెన్యూవే ఉన్నాయి. పట్టుదలతో పని చేసి ఏడాదిలో అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పింఛన్లు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అందిస్తున్నాం. గత ప్రభుత్వం మూసేసిన అన్నక్యాంటీన్లను అధికారంలోకి రాగానే 203 ప్రారంభించాం. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా భోజనాలు అందించాం. రాష్ట్రానికి కేంద్రం సాయం అందిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. అమరావతి పనులు చేపట్టి రాజధానిని పట్టాలెక్కించాం. పోలవరానికి రూ.12,500 కోట్లు అందించింది.. దీన్ని 2027కి పూర్తి చేసేలా లక్ష్యం విధించుకున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులకు రూ.5 వేల కోట్లు ఇచ్చింది. విశాఖ రైల్వేజోన్ పనులు కూడా సాగుతున్నాయి.’ అని సీఎం వివరించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
‘ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలున్నా తల్లికివందనం ఇస్తామని చెప్పాం..అందరికీ డబ్బులు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సును కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మత్య్సకార సేవలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు వేట నిషేధ భృతిని అందించాం. 90 శాతం సబ్సీడీతో రైతులకు డ్రిప్ ఇస్తున్నాం. 20 లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసేందుకు సంకల్పం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. 3 కిలో వాట్లకు బీసీలకు రూ.98 వేలు సబ్సీడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. చేనేతలకు మరమగ్గం ఉంటే 500 యూనిట్లు, మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒకే ఏడాదిలో రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టాం. పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి అనకాపల్లికి నీళ్లు అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చి పాత్ హోల్ ఫ్రీ రోడ్లుగా మార్చాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 33 పెట్టుబడి పాలసీలు తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం మన ఏపీయే. నియోజకవర్గాలకు పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలి.
కష్టాలు వెంటాడుతున్నా వృద్ధిరేటు సాధించాం
విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 95 కేంద్ర ప్రాయోజిత పథకాలు రద్దు చేస్తే మనం అధికారంలోకి వచ్చాక 82 పథకాలు తిరిగి ప్రారంభించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. పెట్టుబడిదారుల నుంచి ఏ అభ్యర్థన వచ్చినా ఆలస్యం చేయకుండా అనుమతులు ఇచ్చి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ల్యాండ్ రికార్డులను సరి చేయాలి.. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి.. ఎమ్మార్వోలు.. ఆర్డీవోలు ఇక్కడే ఉన్నారు.. దీన్ని కచ్చితంగా చేసి తీరాలి.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు
‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా.. తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లను గతానికంటే పెంచాం. పాడి రైతులకు గోకుల్ షెడ్లు ఇచ్చాం. హంద్రీనీవా కోసం రూ. 3800 కోట్లు ఖర్చు పెట్టాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కొత్త పాలసీ తెచ్చాం. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీ ఇచ్చాం. అన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్‌కు దక్కింది. అన్ని స్కూళ్లల్లో మెగా పేరెంట్ టీచర్ల మీటింగులు పెట్టారు మంత్రి నారా లోకేష్. వైద్య రంగం అభివృద్ధికి పని చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు.. దీనికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. సంక్షేమ పథకాలు దీపం, తల్లికివందనం, పెన్షన్లు వంటివి అమలు చేస్తున్నాం. పీ-4 ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఇప్పటి వరకు 87,226 బంగారు కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి బాధ్యతను 7,867 మంది మార్గదర్శకులకు అప్పజెప్పాం. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకే పీ-4 విధానం. పేదలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వంతో పాటు.. సంపన్నులు తీసుకోవాలి. సమాజంలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వారు పేదలను ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. అంబేద్కర్‌కు బరోడా మహరాజు సహకరించారు.. ఓ మేధావిని దేశానికి అందించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను పీ-4 పరిధిలోకి తేవాలి.’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
వచ్చే నాలుగేళ్లలో అందరికీ ఇళ్లు
ఇప్పటి వరకు రూ. 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.. 8.50 లక్షల మందికి ఉపాధి రానుంది. నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారేమోననే దిశగా ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలి. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే.. వారికి మరిన్ని ప్రొత్సహకాలిస్తాం. విజన్ 2020 నిజమిం.. ఇప్పుడు విజన్ 2047 లక్ష్యంతో పని చేస్తున్నాం. విశాఖ యోగా డే కార్యక్రమాన్ని లక్షల మందితో నిర్వహించాం.. మొదట్లో ఇది సాధ్యం కాదన్నారు. కానీ మంచి ప్రణాళికతో కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. 200 మందితో కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ భావిస్తే.. అదే కలెక్టరుతో 3 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించేలా చేశాం. 2047 విజన్ సాధనకు పది సూత్రాలను రూపొందించుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా.. అన్ని రకాల సౌకర్యాలు.. అన్ని వసతులు కల్పించేలా విజన్ రూపొందించాం. ప్రతి ఒక్కరికి ఇంటి జాగాను వచ్చే నాలుగేళ్లల్లో ఇస్తాం. వచ్చే నాలుగేళ్లల్లో అందరికీ ఇళ్లు కట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదు. నేను, పవన్ కళ్యాణ్ కేంద్రం మీద ఒత్తిడి తెస్తే.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకునేందుకు మరో రెండేళ్ల గడువు పొడిగించారు. జనాభా తగ్గుదల అనేది చాలా దేశాల్లో అతి పెద్ద సమస్యగా ఉంది. యువకులు తగ్గిపోతున్నారు.. ముసలి వాళ్లు పెరిగిపోతున్నారు. కొన్ని దేశాలు యువతను దత్తతను తీసుకునే పరిస్థితికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ముందు చూపుతో ఆలోచన చేయాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశంలో జనాభా భారీగా తగ్గనుంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది.. దీని కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా చేశాం.. ఇప్పుడు ఆ నిబంధనను తప్పించాం. పెద్ద కుటుంబాలకు.. మరిన్ని ప్రోత్సహాకాలు ఇచ్చేలా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది.
వృద్ధి రేటులో అనూహ్య పెరుగుదల
2024-25 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీలో 12.02 శాతం వృద్ధి రేటు సాధించి రూ.15.93 లక్షల కోట్లు నమోదు చేశాం. ఇదే సమయానికి దేశంలో వృద్ధి 9.8 శాతమే ఉంది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో సగటు వృద్ధి 13.49 శాతం సాధిస్తే… ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సగటున 10.32 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పడిపోవడంతో రూ.76,195 కోట్లు నష్ట పోయాం. 2024-25లో వ్యవసాయరంగంలో 15.41 శాతం, పరిశ్రమల రంగంలో 6.41 శాతం, సేవల రంగంలో 11.82 శాతం నమోదు చేశాం. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం 11.89 శాతం పెరిగింది. రూ.2,37,951 నుంచి రూ.2,66,240కు పెంచగలిగాం. 2029 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.29.29 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.5.42 లక్షలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.308 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.55 లక్షలు నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మైక్రో-మాక్రో విజన్ ప్లానింగ్ అమలు చేస్తున్నాం. పొలిటికల్ గవర్నెన్స్ అనుసరిస్తున్నాం. 9 థీమాటిక్ విజన్ ప్లాన్లు, 10 సెక్టారల్ విజన్ ప్లాన్లు రూపొందించాం. ఇందులో ఎంపీలను, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, జిల్లా స్థాయి అధికారులను భాగస్వామ్యం చేశాం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ప్రణాళిక అమలు బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమను 3 స్ట్రాటజిక్ రీజియన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా చేస్తాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తాం. సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. విశాఖలో యోగా డే విజయవంతంగా నిర్వహించడంతో కేంద్రం మనల్ని ప్రశంసించింది. ఏదైనా సాధించే శక్తిసామర్ధ్యాలు మనకున్నాయి. రియల్ టైమ్ డేటా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టాం. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ఏఐ యూనివర్సిటీ నెలకొల్పుతాం. విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 503 సేవలు అందిస్తున్నాం. ఆగస్ట్ 15 నాటికి ఈ సేవలను 703కి పెంచుతాం. ఇప్పటివరకు 25 డిజిటల్ క్యాబినెట్లు నిర్వహించాం. యోగాంధ్ర-యోగాడే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో ఏపీని చరిత్రలో నిలిపాం. 3.03 లక్షల మంది ఒకేచోట యోగాలో పాల్గొనడం, అలాగే 22,122 మంది గిరిజన విద్యార్ధులు సూర్యనమస్కారాలు చేయడం మరెవ్వరికీ సాధ్యం కాదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగాడే సక్సెస్ చేసిన వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం సన్మానించారు. లోకేష్ నేతృత్వంలో యోగా డే కోసం ఏర్పడిన కెబినెట్ సబ్ కమిటీలోని మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు.